ఏపీ హైకోర్టు: జీవోనెం. 1పై వాదనలు పూర్తి.. తీర్పు రిజర్వ్‌లో ఉంచిన చీఫ్‌ జస్టిస్‌

24 Jan, 2023 16:12 IST|Sakshi

సాక్షి, అమరావతి:  ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్‌ 1కి వ్యతిరేకంగా ఏపీ హైకోర్టులో ఓ పిటిషన్‌  దాఖలైన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో వాదనలు ముగిశాయి. మంగళవారం వాదనలు పూర్తికావడంతో.. తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు చీఫ్‌ జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా.

ఇక జీవో నెంబర్‌ 1 పై సస్పెన్షన్‌ను కొనసాగించాలని టీడీపీ తరపు న్యాయవాది.. హైకోర్ట్‌ బెంచ్‌ను కోరారు. అయితే అందుకు ధర్మాసనం నిరాకరించింది. అంతకు ముందు రోజు వాదనల సందర్భంగా.. చీఫ్‌ జస్టిస్‌, వెకేషన్‌ బెంచ్‌ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. అలాగే..

రోడ్‌షోల మీద, ర్యాలీల మీద సర్కార్‌ ఎలాంటి నిషేధం విధించలేదని, నడి రోడ్డు మీద భారీగా జనాన్ని సమీకరించవద్దని మాత్రమే చెప్పిందని, ప్రజా రక్షణకు సంబంధించి ప్రభుత్వానికే పూర్తి అధికారమని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని హైకోర్టు సీజే గుర్తు చేశారు. అలాగే.. చంద్రబాబు సభల్లో 8 మంది చనిపోయిన దృష్ట్యా సర్కారు జీవో తెచ్చిందని ప్రస్తావించారు.

మరిన్ని వార్తలు