జీవో నెం 1 పూర్తిగా ప్రజా ప్రయోజనమే.. ప్రభుత్వం ఏ బహిరంగ సభను అడ్డుకోలేదు: ఏపీ హైకోర్టు

23 Jan, 2023 18:49 IST|Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్‌ 1 పూర్తిగా ప్రజా ప్రయోజనమైందని ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్‌పై సోమవారం విచారణ సందర్భంగా.. వాద ప్రతివాదనల తర్వాత హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ చేసిన వ్యాఖ్యలను ఓసారి పరిశీలిస్తే.. 

‘‘ఏపీ ప్రభుత్వం తెచ్చిన జీవో నెం.1 ప్రజల ప్రాథమిక హక్కులకు సంబంధించినది.పూర్తిగా ప్రజా ప్రయోజనమైందని న్యాయస్థానం భావిస్తోంది. అలాగే.. నడి రోడ్డుపై మీటింగ్‌ పెట్టడానికి ఎవరికీ హక్కు లేదు. నిజానికి ప్రభుత్వం ఏ బహిరంగ సభను అడ్డుకోలేదు. నడి రోడ్డు మీద కాదు, సౌకర్యమున్న చోట సభ పెట్టుకోమని చెప్పింది అని చీఫ్‌ జస్టిస్‌  గుర్తు చేశారు. 

రోడ్‌షోల మీద, ర్యాలీల మీద సర్కార్‌ ఎలాంటి నిషేధం విధించలేదని, నడి రోడ్డు మీద భారీగా జనాన్ని సమీకరించవద్దని మాత్రమే చెప్పిందని, ప్రజా రక్షణకు సంబంధించి ప్రభుత్వానికే పూర్తి అధికారమని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా హైకోర్టు సీజే గుర్తు చేశారు. అలాగే.. చంద్రబాబు సభల్లో 8 మంది చనిపోయిన దృష్ట్యా సర్కారు జీవో తెచ్చిందని పేర్కొన్నారు.

ఈ పిటిషన్‌ వేసిన వ్యక్తిలో దురుద్ధేశమేదో కనిపిస్తోందన్న హైకోర్టు సీజే.. ఎనిమిది మంది చనిపోయిన దుర్ఘటనపై విచారణ కమిటీ నివేదిక కోసం వేచి చూస్తున్నామని తెలిపారు. జీవో నెంబర్‌ 1ని నిలిపివేయాలంటూ వేసిన పిటిషన్‌కు సహేతుక కారణాలు లేవని, అలా చేయడమంటే ప్రజల హక్కులు కాలరాసినట్టేనని హైకోర్టు పిటిషనర్‌కు స్పష్టం చేసింది. 

అది సుప్రీం రూల్స్‌కు విరుద్ధం
జీవో నెంబర్‌ 1పై ఏపీ హైకోర్టులో వాద, ప్రతివాదనలు వాడీవేడిగానే సాగాయి. ప్రభుత్వం తెచ్చిన జీవోను పిటిషన్‌ సవాల్‌ చేయగా.. ఆ వాదనలను అంతే సమర్థవంతంగా తోసిపుచ్చింది ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వం తరపున అడ్వొకేట్‌ జనరల్‌ వాదనలను పరిశీలిస్తే.. ‘‘పిటిషన్‌ను అత్యవసరంగా వెకేషన్‌ బెంచ్‌ ముందుకు తేవడాన్ని వ్యతిరేకించాం. చీఫ్‌ జస్టిస్‌ వేసిన రోస్టర్‌ను వెకేషన్‌ బెంచ్‌ మార్చింది. రోస్టర్‌ను జనవరి 5వ తేదీన రూపొందించి, 6వ తేదీన హడావిడిగా మార్చారు. రోస్టర్‌ను సరైన కారణం లేకుండా మార్చడం సుప్రీంకోర్టు నియామవళికి విరుద్ధం. రోస్టర్‌ మార్చిన విషయం ప్రతివాదులకు కనీసం చెప్పలేదు. ఈ పిటిషన్‌లో అత్యవసరం కూడా ఏమీ లేదు. సెలవులు పూర్తయ్యేవరకు వేచి ఉండకుండా ముందే విచారించారు. జనవరి 12న వెకేషన్‌ బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలను మార్చాలి అని వాదనలు వినిపించారు.

మరిన్ని వార్తలు