మేకపోతు తెచ్చిన ఉపద్రవం!.. వంద మీటర్ల లోయలోకి పల్టీలు కొడుతూ..

21 Sep, 2022 15:55 IST|Sakshi
లోయలో నుంచి గణేష్‌ను వెలికి తీసుకొస్తున్న ఎస్‌ఐ, ఫైర్‌ ఆఫీసర్‌ తదితరులు, ప్రమాదానికి కారణమైన మేకపోతు

బలి ఇవ్వడానికి తెస్తే పరుగో..పరుగు 

దానిని పట్టుకునే యత్నంలో లోయలోకి జారిపడిన భక్తుడు  

శ్రమలకోర్చి వెలికితీసిన పోలీసులు, ఫైర్‌ సిబ్బంది 

చౌడేపల్లె: బలి ఇవ్వడానికి తెచ్చిన మేకపోతు లిప్తపాటులో ఉడాయించించి ఓ యువకుడి ప్రాణాలమీదకు తెచ్చింది. దానిని పట్టుకునే ప్రయత్నంలో అదుపు తప్పిన ఆ యువకుడు ఏకంగా వంద మీటర్ల లోయలోకి జారి పడ్డాడు. దీంతో మేకపోతు సంగతి పక్కనబెట్టి ఆ యువకుడిని కాపాడే ప్రయత్నాల్లో పడ్డారు. ఐదు గంటలకు పైగా శ్రమించి తాళ్ల సాయంతో అతడిని పోలీసులు, ఫైర్‌ సిబ్బంది వెలికితీశారు. బోయకొండలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

ఎస్‌ఐ రవికుమార్‌  కథనం.. తిరుపతిలోని సప్తగిరినగర్‌కు చెందిన ఎన్‌.కుమార్‌ తన కుటుంబ సభ్యులు, బంధువులతో మంగళవారం బోయకొండ గంగమ్మకు మొక్కులు చెల్లించడానికి వచ్చారు. అమ్మవారికి పూజలు చేసి జంతుబలి సమర్పించడానికి ఉదయం 11 గంటల ప్రాంతంలో మేకపోతును తీసుకొని ఆలయం వద్దకు వచ్చారు. బలి ఇవ్వబోతున్న క్షణంలో అది ఒక్కసారిగా విదిల్చుకుని ఉడాయించింది. అటవీ ప్రాంతం వైపు పరుగులు తీసింది. దానిని కుమార్‌ కుమారుడు గణేష్‌(19)తోపాటు బోయకొండలో మటన్‌ కత్తిరించే కూలీ మంజు(28) వెంబడించారు.

అది పరుగులు తీస్తూ సరాసరి చిత్తారికోట సమీపంలోని లోయ వద్ద ఏటవాలుగా ఉన్న బండపై ఆగింది. దానినే అనుసరిస్తూ వెళ్లిన గణేష్‌ మేకపోతును పట్టుకునే ప్రయత్నంలో అదుపు తప్పాడు. అక్కడి నుంచి వంద మీటర్ల లోయలోకి పల్టీలు కొడుతూ పడిపోయాడు. ఇది గమనించి మంజు ఎస్‌ఐకు సమాచారం ఇచ్చారు. ఆలయం వద్ద విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ రాజేష్‌ తాళ్ల సహాయంతో చాకచక్యంగా లోయలోకి దిగి గణేష్‌ వద్దకు చేరాడు. గాయాల పాలై షాక్‌లో ఉన్న అతడిని ఓదార్చి ధైర్యం చెప్పారు. నీళ్లు తాగించారు. ఇంతలో పుంగనూరు నుంచి ఫైర్‌ ఆఫీసర్‌ సుబ్బరాజు, సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.  

తాళ్ల సాయంతో లోయలోకి దిగారు. గణేష్‌ను లోయలోంచి వెలికి తీశారు. అప్పటికే సాయంత్రమైంది. ప్రభుత్వ  వైద్య కేంద్రంలో గణేష్‌కు ప్రథమ చికిత్స చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. బాధితుడిని ఆలయ కమిటీ చైర్మన్‌ మిద్దింటి శంకర్‌నారాయణ పరామర్శించారు.  అమ్మవారి మహిమ వలనే తమ బిడ్డ ప్రాణాలతో బయటపడ్డాడని బాధితుడి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అప్పటికే మిగతా వాళ్లు ఆ మేకపోతును పట్టుకున్నారు. ఇక  తప్పించుకునే అవకాశం ఏమాత్రం ఇవ్వలేదు. ఆలయం వద్ద మేకపోతు కథ ముగించి తిరుపతికి బయల్దేరారు. 

మరిన్ని వార్తలు