శ్వాస విడిచిన యాస.. ఈవీవీ బా.. ఇక లేరు..

4 Jun, 2022 15:05 IST|Sakshi
ఈవీవీ సత్యనారాయణ (పాతచిత్రం)

 గోదారోళ్ళ కితకితలు ఫేస్‌బుక్‌ గ్రూపు సృష్టికర్త అస్తమయంతో విషాదం 

గోదారోళ్ళ వేష, భాష, యాసలకు ఐకాన్‌గా ఎదిగిన ఈవీవీ 

రెండు లక్షల మందికిపైగా సభ్యులతో అలరారుతున్న గ్రూపు 

రాజమహేంద్రవరం రూరల్‌ (తూర్పుగోదావరి జిల్లా): ప్రముఖ రచయిత, గోదారి యాస నా శ్వాస అంటూ గోదావరి జిల్లా యాస భాషలను కాపాడుకునేందుకు అనునిత్యం కృషిచేసిన గోదారోళ్ళ కితకితలు ఫేస్‌బుక్‌ గ్రూప్‌ సృష్టికర్త ఈదల వీరవెంకట సత్యనారాయణ(ఈవీవీ) గురువారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. శుక్రవారం బొమ్మూరులోని శివాలయం సమీపంలో ఉన్న ఈవీవీ స్వగృహం వద్ద ఆయన భౌతికకాయాన్ని బంధువులు, స్నేహితులు, గ్రూపు సభ్యులు, కోకోకోలా కంపెనీ ఉద్యోగులు అధికసంఖ్యలో వచ్చి సందర్శించి పూలమాలలతో నివాళులర్పించారు.

అనంతరం ఈవీవీ భౌతికకాయాన్ని ర్యాలీగా ఇన్నీసుపేటలో రోటరీ కైలాసభూమికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఈవీవీ మరణవార్త తెలియగానే ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలతో పాటు, ఇతర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ఫేస్‌బుక్‌ మిత్రులు ఆయన ఇంటికి చేరుకున్నారు. ఈవీవీ భార్య, ఇద్దరు కుమార్తెలను, తల్లి, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి తమ సానుభూతిని తెలియజేశారు.

గోదారోళ్ల కితకితలు ఐదవ ఆత్మీయ కలయికలో గ్రూపు సభ్యులతో ఈవీవీ సత్యనారాయణ (పాతచిత్రం) 

గోదావరి యాసపై విపరీతమైన మక్కువతో... 
గోదావరి యాసపై విపరీతమైన మక్కువ కలిగిన ఈదల వీరవెంకట సత్యనారాయణ(ఈవీవీ) 2016లో గోదారోళ్ళ కితకితలు పేరిట ఫేస్‌బుక్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ ఉన్నవారినో ఒకటి చేశారు. ఆరోగ్యకరమైన హాస్యానికి జీవం పోస్తూ మంచి రచయితగా అందరి అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఆ తరువాత జరిగిన ఓ ప్రమాదంలో ఓ స్నేహితుణ్ణి కాపాడి సంచలనంగా మారారు. ప్రాణం కాపాడిన ఫేస్‌బుక్‌ స్నేహం అంటూ అప్పట్లో వార్తకథనాలు ప్రసారం కావడంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు. అనంతరం కొద్దిరోజులకే గ్రూప్‌ లక్షమందిని చేరుకుని ఒక ప్రత్యేకతను ఏర్పరచుకుంది. గ్రూప్‌ పెట్టిన దగ్గర నుంచి ఈవీవీ హాస్యకథనాలతో పాటు మధ్యతరగతి ప్రజల స్థితిగతులపై కట్టిపడేసే కథనాలను పోస్ట్‌ చేస్తూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. గోదారోళ్ళకితకితలు గ్రూప్‌ సభ్యులందరిని ఆత్మీయ కలయిక పేరుతో ఏటా ఒకే వేదికపై తీసుకువచ్చేవారు. ప్రస్తుతం ఫేస్‌బుక్‌ గ్రూప్‌ సభ్యుల సంఖ్య రెండులక్షలకు పైగా చేరుకుంది.

ఈవీవీ మృతదేహం వద్ద రోదిస్తున్న భార్య, కుమార్తెలు 

సినిమా నటుడిగా... 
ఈవీవీ ఇటీవలే సినిమాలలో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా తన కెరీర్‌ను ప్రారంభించారు. నాగార్జున, నాగచైతన్య బంగార్రాజు సినిమాలో ఒక కీ రోల్‌లో నటించి అందరినీ మెప్పించారు. షార్ట్‌ఫిల్మ్స్‌లో నటించారు.

గోదారోళ్ల గుండెల్లో పదిలం
అందరికీ నవ్వులు అందిస్తూ ఆయుష్షు పెంచే ఉద్యమంలో అహర్నిశలు శ్రమిస్తున్న ఈవీవీ ఆయుష్షు అర్థంతరంగా ముగియడమేమిటి ! గోదారోళ్ళ యాసకు, ఎటకారాలకు చావుండదు. మన ఈవీవీ చిరంజీవి, గోదారోళ్ళ యాసలో, శ్వాసలో గుండెల్లో పదిలంగా ఉంటాడు. 
– కర్రి రామారెడ్డి, మానసిక వైద్యనిపుణులు, రాజమహేంద్రవరం 

మరిన్ని వార్తలు