అధ్యయనం తర్వాతే అనుసంధానం  

19 Feb, 2022 07:06 IST|Sakshi
వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న వివిధ రాష్ట్రాల జలవనరుల శాఖల అధికారులు 

ముందుగా గోదావరిలో నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ, ఎన్‌డబ్ల్యూడీఏతో అధ్యయనం

ఆ తర్వాతే గోదావరి – కావేరి అనుసంధానం

ఏపీ, తెలంగాణ వినతి మేరకు కేంద్రం నిర్ణయం

గోదావరి–కావేరి అనుసంధానంపై దక్షిణాది రాష్ట్రాలతో కేంద్రం సంప్రదింపులు

తొలి దశలో ఛత్తీస్‌గఢ్‌ కోటాలో వాడుకోని 147 టీఎంసీలను మళ్లించాలని సీడబ్ల్యూసీ ప్రతిపాదన

ఆ నీటిలో రాష్ట్రాల వాటాపై చర్చించి నిర్ణయం తీసుకుందామని సూచన

ఇచ్చంపల్లి నుంచి కాకుండా పోలవరం నుంచి గోదావరిని మళ్లించాలని ఏపీ ప్రతిపాదన

దీనిపై అధ్యయనానికి కేంద్రం సానుకూలం

అనుసంధానం వ్యయంలో 90 శాతం కేంద్రమే ఇవ్వాలన్న రాష్ట్రాలు

సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి: గోదావరిలో నీటి లభ్యత తేల్చాకే గోదావరి – కావేరి అనుసంధానాన్ని చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పు ఆధారంగా కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ)లతో అధ్యయనం చేయించాలని నిర్ణయించింది. ఇచ్చంపల్లి నుంచి కాకుండా పోలవరం నుంచి కావేరికి జలాలను తరలించాలని ఆంధ్రప్రదేశ్‌ చేసిన ప్రతిపాదనపైనా కేంద్రం సానుకూలంగా స్పందించింది. దీనిపై అధ్యయనం చేయిస్తామని తెలిపింది.

గోదావరి– కావేరి అనుసంధానంపై శుక్రవారం ఢిల్లీలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి అధికారులతో కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర జల్‌ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం, ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్‌ జనరల్‌ భోపాల్‌సింగ్, ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, తెలంగాణ అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం సీఈ మోహన్‌కుమార్, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి అధికారులు పాల్గొన్నారు.

మిగులు జలాలపై పూర్తి హక్కు ఏపీదే
ఇచ్చంపల్లి వద్ద 324 టీఎంసీల నీరు ఉందని, అందులో 247 టీఎంసీలను గోదావరి–కావేరి అనుసంధానం ద్వారా మళ్లిస్తామన్న కేంద్రం ప్రతిపాదనపై ఏపీ, తెలంగాణ అభ్యంతరం తెలిపాయి. గోదావరిలో మిగులు జలాలు అంత లేవని ఏపీ స్పష్టంచేసింది. మిగులు జలాలపై పూర్తి హక్కును ఏపీకి బచావత్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిందని గుర్తు చేసింది. తమ అవసరాలను కేంద్రం తక్కువగా అంచనా వేయడంపై అభ్యంతరం తెలిపింది. ఇచ్చంపల్లి వద్ద ఉన్న జలాలన్నీ ఇప్పటికే నిర్మాణంలో ఉన్న, నిర్మాణం చేయనున్న ప్రాజెక్టులకే సరిపోతాయని తెలంగాణ తెలిపింది. ఉభయ రాష్ట్రాల అవసరాలు పోను మిగిలి ఉన్న జలాలను మాత్రమే తరలించాలని తెలుగు రాష్ట్రాలు కోరాయి. గోదావరిలో మిగులు జలాలపై శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని సూచించాయి. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం.. సీడబ్ల్యూసీ, ఎన్‌డబ్ల్యూడీఏలతో సంయుక్తంగా అధ్యయనం చేస్తామని తెలిపింది. 

చదవండి: (ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం)

ఛత్తీస్‌గఢ్‌ నుంచి 147 టీఎంసీలు
గోదావరి నుంచి మళ్లిస్తామన్న 247 టీఎంసీలలో 147 టీఎంసీలు చత్తీస్‌గఢ్‌ నుంచి, మరో 100 టీఎంసీలు తెలంగాణ నుంచి తీసుకోవాలన్న కేంద్రం ప్రతిపాదనపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. తెలంగాణ పరిధిలో మిగులు జలాలు లేవని స్పష్టం చేసింది. దాంతో.. ఛత్తీస్‌గఢ్‌ కోటాలో వాడుకోని 147 టీఎంసీలను తొలి దశలో మళ్లిద్దామని కేంద్రం ప్రతిపాదించింది. ఇందుకు ఛత్తీస్‌గఢ్‌ను ఒప్పించాలని సీడబ్ల్యూసీ, ఎన్‌డబ్ల్యూడీఏలకు పంకజ్‌కుమార్‌ చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌ నీటిలో ఏ రాష్ట్రాలు ఎంత వాడుకోవాలన్నది చర్చించి నిర్ణయిద్దామని జల్‌ శక్తి శాఖ సూచించింది. మళ్లించే జలాల్లో రాష్ట్రాలకు కేటాయించిన నీటిపై కర్ణాటక అభ్యంతరాలు తెలిపింది. గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలిస్తే మళ్లింపు జలాల్లో కర్ణాటకకు వాటా ఉంటుందని చెప్పింది. కృష్ణా నుంచి కావేరికి నీటిని తరలించే 84 టీఎంసీల్లోనూ కర్ణాటకకు వాటా ఉంటుందని స్పష్టం చేసింది. దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం చెప్పలేదు. కావేరికి మళ్లించే గోదావరి జలాల్లో కేటాయింపులు పెంచాలని తమిళనాడు కోరింది.

కెన్‌–బెత్వా తరహాలోనే నిధులు
గోదావరి–కావేరి అనుసంధానం ఖర్చులో 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్రాలు భరించాలన్న కేంద్ర జల్‌ శక్తి శాఖ ప్రతిపాదనపై అన్ని రాష్ట్రాలు అభ్యంతరం తెలిపాయి. కెన్‌–బెత్వా అనుసంధానానికి ఇస్తున్న తరహాలోనే 90 శాతం నిధులను కేంద్రం ఇవ్వాలని, మిగతా పది శాతం తాము భరిస్తామని అన్ని రాష్ట్రాలు తేల్చిచెప్పాయి. 

పోలవరం నుంచే కావేరికి
గోదావరి మిగులు జలాలను ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్‌ (కృష్ణా) – సోమశిల (పెన్నా) – కావేరి (గ్రాండ్‌ ఆనకట్ట)కి తరలించడంపై ఏపీ అభ్యంతరం చెప్పింది. నాగార్జున సాగర్, సోమశిల రిజర్వాయర్లలోని జలాలు వాటి కింద ఆయకట్టుకే సరిపోవడంలేదని చెప్పింది. ఈ రెండు రిజర్వాయర్ల ద్వారా కావేరికి గోదావరిని తరలించడం సాధ్యం కాదని స్పష్టంచేసింది. చెన్నైకి తాగు నీటి కోసం ఎగువ రాష్ట్రాలు ఇవ్వాల్సిన నీటిని వరద సమయంలో ఇచ్చేశామని ఆ రాష్ట్రాలు చెబుతున్నాయని, దాంతో శ్రీశైలంలో ఉన్న తమ రాష్ట్రం కోటా నీటినే చెన్నైకి ఇవ్వాల్సి వస్తోందని కేంద్రానికి ఏపీ గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో ఇచ్చంపల్లి నుంచి కాకుండా పోలవరం నుంచి జలాలను బొల్లాపల్లి వద్ద నిర్మించే రిజర్వాయర్‌కు, అక్కడి నుంచి బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌కు తరలించి.. చెన్నైకి సరఫరా చేస్తున్న మార్గంలోనే కావేరికి తరలించాలని ప్రతిపాదించింది. పోలవరం దిగువ నుంచి వెళ్లే నీరంతా వృధాగా సముద్రంలోకి కలుస్తుంది కాబట్టి ఆ నీటిని మళ్లిస్తే అధిక ప్రయోజనం ఉంటుందని వివరించింది. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం, ఈ అలైన్‌మెంట్‌పై పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తామంది.

మరిన్ని వార్తలు