గోదావరి ఉరకలు

1 Oct, 2021 02:52 IST|Sakshi
ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజ్‌ నుంచి దిగువకు పరుగులు తీస్తున్న గోదావరి

ధవళేశ్వరం/శ్రీశైలం ప్రాజెక్ట్‌/విజయపురి సౌత్‌ (మాచర్ల): ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజ్‌ వద్ద గోదావరి ఉరకలేస్తోంది. దీంతో ఎప్పటికప్పుడు మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. బ్యారేజ్‌ వద్ద నీటిమట్టం గురువారం సాయంత్రం 10.20 అడుగులకు చేరింది. 7,83,817 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. నిజానికి.. గురువారం ధవళేశ్వరం వద్ద నీటి మట్టం 11.75 అడుగులకు చేరుతుందని అధికారులు అంచనా వేశారు. కానీ, భద్రాచలం వద్ద నీటి ఉధృతి పెరగలేదు.  జిల్లా ఏజెన్సీలోని కొన్ని ప్రాంతాల్లో వరద నీరు ముంచెత్తింది. 

శ్రీశైలానికి కొనసాగుతున్న వరద
శ్రీశైలం జలాశయానికి ఎగువనున్న జూరాల, సుంకేసుల నుంచి 1,17,212 క్యూసెక్కుల వరద నీరు గురువారం విడుదలైంది. కుడి, ఎడమ గట్టు విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 32,718 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా హంద్రీనీవా సుజల స్రవంతికి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి నీటిని విడుదల చేస్తున్నారు. కుడిగట్టు కేంద్రంలో బుధవారం నుంచి గురువారం వరకు 13.927 మిలియన్‌ యునిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 17.119 మిలియన్‌ యునిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. ప్రస్తుతం జలాశయంలో 206.09 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇది 883.30 అడుగులకు సమానం.

గరిష్టస్థాయిలో సాగర్‌ నీటిమట్టం
ఇక శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులోకి నీటి ప్రవాహం పెరగడంతో ఆరు గేట్ల ద్వారా 48,600 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.  ప్రస్తుతం సాగర్‌ జలాశయ నీటిమట్టం గరిష్ట స్థాయిలో 590 అడుగులకు చేరుకుంది. ఇది 312.0450 టీఎంసీలకు సమానం. సాగర్‌ జలాశయం నుంచి కుడి కాలువకి 8,221, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రానికి 32,399, ఎస్‌ఎల్‌బీసీకి 1,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు