గోదావరి మళ్లీ ఉగ్రరూపం

13 Sep, 2022 05:39 IST|Sakshi
పోలవరం స్పిల్‌వే వద్ద ప్రవహిస్తున్న వరద నీరు

మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు  

సాక్షి, అమరావతి/పోలవరం రూరల్‌: గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. పరీవాహక ప్రాంతం (బేసిన్‌)లో మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మన రాష్ట్రంలోని ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో విస్తృతంగా శనివారం, ఆదివారం వర్షాలు కురువడంతో ప్రధాన పాయతోపాటు ఉపనదులు మంజీర, మానేరు, ప్రాణహిత, ఇంద్రావతి, వాగులు, వంకలు ఉప్పొంగుతుండటంతో గోదావరిలో వరద ఉద్ధృతి పెరుగుతోంది.

గోదావరి ప్రధానపాయపై జైక్వాడ్‌ నుంచి బాబ్లీ వరకు అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తేయడం, వాటికి మంజీర వరద తోడవుతుండటంతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి వరద ఉద్ధృతి పెరిగింది. వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తుండటం.. వాటికి కడెం వాగు, ఇతర వాగుల వరద తోడవుతుండటంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరుగుతోంది. ఎల్లంపల్లి నుంచి దిగువకు విడుదల చేసిన వరదకు ప్రాణహిత, ఇంద్రావతి జలాలు తోడవుతుండటంతో కాళేశ్వరంలో అంతర్భాగమైన మేడిగడ్డ, దానికి దిగువన తుపాకులగూడెం బ్యారేజీలలోకి వరద ఉద్ధృతి పెరుగుతోంది. 

తుపాకులగూడెం, సీతమ్మసాగర్‌లలోకి వచ్చిన వరద వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తుండటంతో భద్రాచలం వద్ద వరద ప్రవాహం గంటగంటకు పెరుగుతోంది. రాత్రి 7 గంటలకు 10.36 లక్షల క్యూసెక్కుల ప్రవాహం రావడంతో నీటిమట్టం 45.6 అడుగులకు చేరింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీచేశారు. భద్రాచలం నుంచి పోలవరం వద్దకు వచ్చిన వరదను వచ్చినట్టుగా 48 గేట్ల నుంచి దిగువకు వదిలేస్తున్న అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద నీటిమట్టం సోమవారం 32.1 మీటర్లకు చేరుకుంది. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 7,08,251 క్యూసెక్కులు చేరుతోంది. గోదావరి డెల్టాకు 2,600 క్యూసెక్కులను విడుదల చేస్తూ, 175 గేట్లను పూర్తిగా ఎత్తేసి 7,05,651 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. మంగళవారం ఉదయానికి ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి చేరే వరద 10.50 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల గోదావరి బేసిన్‌లో మరో రెండురోజులు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో మరో మూడురోజులు గోదావరికి వరద ఉద్ధృతి కొనసాగనుంది.   

మరిన్ని వార్తలు