గోదావరి–కావేరి అనుసంధానం డౌటే

24 Oct, 2022 09:51 IST|Sakshi

ఇచ్చంపల్లి నుంచి 247 టీఎంసీలు తరలించేలా ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదన 

తమ కోటాలోని నీటిని ఎలా తరలిస్తారని ప్రశ్నించిన ఛత్తీస్‌గఢ్‌ 

మిగులు జలాలను తరలించడంపై ఆంధ్రప్రదేశ్‌ అభ్యంతరం

దీంతో ప్రతిపాదనల దశలోనే ప్రశ్నార్థకంగా మారిన గోదావరి–కావేరి అనుసంధానం

నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చాకే సంప్రదింపులు జరిపాలంటున్న నిపుణులు 

సాక్షి, అమరావతి: గోదావరి–కావేరి నదుల అనుసంధానం ప్రతిపాదనల దశలోనే ప్రశ్నార్థకంగా మారింది. ఛత్తీస్‌గఢ్‌ సర్కార్‌తో కనీసం సంప్రదింపులు జరగకుండా ఆ రాష్ట్ర కోటా 141 టీఎంసీలకు.. బచావత్‌ ట్రిబ్యునల్‌ పరిధిలోని దిగువ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు హక్కుగా కల్పించిన మిగులు జలాల్లో 106 టీఎంసీలను జతచేసి 247 టీఎంసీలను ఇచ్చంపల్లి నుంచి అనుసంధానంలో తరలించేలా ఎన్‌డబ్ల్యూడీఏ (జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ) తొలుత ప్రతిపాదనలు రూపొందించింది.
చదవండి: రైతుభరోసాపై ‘ఈనాడు’ విష ప్రచారం

దీనిపై పరీవాహక ప్రాంతాల్లోని రాష్ట్రాలు వ్యక్తం చేసిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని.. ఛత్తీస్‌గఢ్‌ కోటాలోని 141 టీఎంసీలను అనుసంధానంలో తరలించేలా ప్రతిపాదనను మార్చింది. బచావత్‌ ట్రిబ్యునల్‌ తమకు కేటాయించిన నీటిని ఎలా తరలిస్తారంటూ ఛత్తీస్‌గఢ్‌ సర్కార్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో గోదావరి–కావేరి అనుసంధానంపై నీలినీడలు కమ్ముకున్నాయి.

సంప్రదింపులకు అర్థమేదీ?
ఇచ్చంపల్లి లేదా అకినేపల్లి (గోదావరి) నుంచి జూన్‌–అక్టోబర్‌ మధ్య 143 రోజుల్లో 247 టీఎంసీలను నాగార్జునసాగర్‌ (కృష్ణా), సోమశిల (పెన్నా) మీదుగా గ్రాండ్‌ ఆనకట్టకు తరలించడం ద్వారా గోదావరి–కావేరి నదులను అనుసంధానం చేయాలని 2018లో ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమళనాడులకు 80 టీఎంసీల చొప్పున అందిస్తామని పేర్కొంది. ఇచ్చంపల్లి నుంచి తరలించే నీటిలో 141 టీంఎసీలు ఛత్తీస్‌గఢ్‌ కోటాలోనివి కాగా.. మిగతా 106 టీఎంసీలు మిగులు జలాలు. 
దీనిపై 2020 జూలై 28న ఒకసారి.. డిసెంబర్‌ 10న మరోసారి పరీవాహక ప్రాంతాల పరిధిలోని రాష్ట్రాలతో ఎన్‌డబ్ల్యూడీఏ సంప్రదింపులు జరిపింది. తమ కోటాలో నీటిని తరలించడానికి తాము అంగీకరించే ప్రశ్నే లేదని ఛత్తీస్‌గఢ్‌ తెగేసి చెప్పగా.. తమకు హక్కుగా కల్పించిన నీటిని ఎలా తరలిస్తారని ఆంధ్రప్రదేశ్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది.  
సంప్రదింపుల్లో రాష్ట్రాలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని అనుసంధానం ప్రతిపాదనలో ఎన్‌డబ్ల్యూడీఏ అవసరమైన మార్పులు, చేర్పులు చేయాలి.

కానీ.. అందుకు విరుద్ధంగా ఛత్తీస్‌గఢ్‌ కోటాలో 141 టీఎంసీలను మాత్రమే.. అదీ ఇచ్చంపల్లి  నుంచి కాకుండా తుపాకులగూడెం నుంచి నాగార్జునసాగర్, సోమశిల మీదుగా కావేరికి తరలించేలా మళ్లీ ప్రతిపాదన రూపొందించింది. దీనిపై ఈ నెల 18న రాష్ట్రాలతో మళ్లీ సంప్రదింపులు జరిపింది. తమ కోటా నీటిని వాడుకోవడానికి అంగీకరించే ప్రశ్నే లేదని తాము ఇప్పటికే స్పష్టం చేశామని.. మళ్లీ తమ నీటిని వాడుకునేలా ప్రతిపాదన రూపొందించడాన్ని బట్టి చూస్తే సంప్రదింపులకు అర్థమేముందని ఛత్తీస్‌గఢ్‌ అసహనం వ్యక్తం చేసింది.

నీటి లభ్యత శాస్త్రీయంగా తేల్చాకే.. 
గోదావరి–కావేరి అనుసంధానం ప్రతిపాదన రూపొందించాలంటే.. తొలుత గోదావరిలో నీటి లభ్యతను తేల్చడానికి శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని నీటి పారుదలరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పరీవాహక ప్రాంతంలోని రాష్ట్రాలకు బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయించిన జలాలుపోగా నికర జలాల్లో మిగులు ఉంటే.. వాటిని అనుసంధానంలో భాగంగా తరలించడానికి రాష్ట్రాలతో ఎన్‌డబ్ల్యూడీఏ సంప్రదింపులు జరపాలని సూచిస్తున్నారు. రాష్ట్రాలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని.. అనుసంధానం ప్రతిపాదన రూపొందిస్తేనే గోదావరి–కావేరి అనుసంధానంపై అడుగులు ముందుకు పడే అవకాశం ఉంటుందని తేల్చి చెబుతున్నారు. అలాకాకుండా ఏకపక్షంగా ప్రతిపాదనలు రూపొందించి.. రాష్ట్రాలతో సంప్రదింపులు జరపడం వృథా ప్రయాసేనని స్పష్టం చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు