అమరావతి: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గోదావరికి వరద ఉద్ధృతి పెరుగుతోంది. ధవళేశ్వరానికి వరద పోటెత్తింది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లో 5,91,269 క్యూసెక్కులుగా ఉంది. దీంతో వరద ముంపు ప్రభావిత జిల్లాల అధికారులను అప్రమత్తం చేసింది ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ. వరద ఉద్ధృతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
వరద ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో చర్యలు చేపట్టంది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. ముందస్తుగా అత్యవసర సహాయక చర్యల కోసం.. రెండు ఎన్డీఆర్‌ఎఫ్, మూడు ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దింపింది. సహాయక చర్యల్లో ప్రజలు అధికారులకు సహకరించాలని విన్నవించింది. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలిని సూచించింది.
ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తివేత..
ప్రకాశం బ్యారేజ్‌కు ఎగువ నుంచి కృష్ణా నది వరద ఉద్ధృతి పెరగటంతో గేట్లు ఎత్తారు. దిగువకు వరద నీరు విడుదల చేశారు అధికారులు. దిగువకు నీటిని విడుదల చేసిన క్రమంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. బోట్లు, మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించవద్దని స్పష్టం చేశారు. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, చేపలు పట్టడం, స్నానాలకు వెళ్ళడం లాంటివి చేయరాదన్నారు.
ఇదీ చూడండి: 'క్యూట్'గా ఉంటే విమాన టికెట్‌పై అదనపు ఛార్జ్.. ఇందులో నిజమెంత?