పులసలు: వండడంలోనూ ఎంతో ప్రత్యేకం.. నకిలీ చేపలను గుర్తించడం ఎలా?

30 Jul, 2022 11:07 IST|Sakshi

పెనుగొండ: ప్రతి ఏటా జూలై నెల వస్తే గోదావరి పరివాహక ప్రాంతంలో పులసలు సందడి చేస్తుంటాయి. ఆస్ట్రేలియా తీర ప్రాంతం నుంచి బంగాళాఖాతంలోకి వచ్చి గోదావరి ఎర్రనీటిలో ప్రవేశించే పులసలంటే రాష్ట్ర వ్యాప్తంగా క్రేజ్‌.. పుస్తెలు అమ్మైనా పులస తినాలనే నానుడిని నిజం చేస్తూ ధరలోనూ అధరహో అనిపిస్తాయి. ఏడాదికి రెండు మూడు నెలలు మాత్రమే లభించే పులసలను వేలు ఖర్చు చేసి కొంటారు చేపల ప్రియులు. గోదావరికి వరద నీరు వచ్చినప్పటి నుంచి ఇంచుమించుగా జూలై నెలలో ప్రారంభమై సెప్టెంబర్ వరకూ పులసలు  దొరుకుతుంటాయి. సిద్ధాంతం నుంచి ప్రారంభమై మల్లేశ్వరం, ఖండవల్లి, తీపర్రు, పెండ్యాల, గౌతమి నదిలో జొన్నాడ, ఆలమూరు, చెముడులంక, కేదారిలంక ప్రాంతాల్లో అధికంగా జాలర్లకు పులసలు చిక్కుతుంటాయి. సాధారణంగా బ్రతికి ఉన్న పులసలు దొరకడం కష్టం. వలకు చిక్కగానే పులసలు చనిపోతుంటాయి. గోదావరి తీరం జాతీయ రహదారిలో ఉండడంతో ఈ ప్రాంతంలో ఎక్కువగా అమ్మకాలు సాగిస్తుంటారు.  

వారం రోజులుగా అందుబాటులోకి.. 
గోదావరికి వరదనీరు పోటెత్తడంతో పులసలు దొరకడం ప్రారంభమయ్యాయి. అరకొరగా దొరుకుతున్న పులసల ధరలు అధికంగానే ఉన్నాయి. సామాన్య కుటుంబాలు పులస కొనాలంటే కష్టమే. కేజీ పులసలు రూ.2000 నుంచి రూ.6000 వరకూ అమ్ముతున్నారు. సాధారణంగా పులస దొరకాలంటే కష్టమైనే పనే. దీంతో ఇలసల్ని అమ్మేస్తుంటారు. తెలియని వారు వీటినే పులసలుగా భావించి కొంటుంటారు. గోదావరికి వరద నీరు ముందుగానే రావడంతో ఈ ఏడాది పులసలు ఎక్కువ కాలం దొరికే అవకాశం ఉందని జాలర్లు అంటున్నారు.   

ఇలసలనే పులసలుగా అమ్మకం 
ఒడిశా సముద్ర తీరంలో విరివిగా లభించే ఇలసలను తక్కువ ధరకు తీసుకొచ్చి పులసలుగా అమ్ముతుంటారు. వీటి మధ్య తేడాను గుర్తించడం కష్టసాధ్యం. నిజమైన పులస ఎర్రనీటి ప్రయాణం చేయడంతో.. శరీరంపై ఎర్రటి చాయలు వెండి రంగు ధగధగలు ఉంటాయి. ఇలసలు తెలుపుగా కనిపిస్తాయి.  

సంతానోత్పత్తి కోసం వచ్చి... 
ఆ్రస్టేలియా, థాయ్‌లాండ్‌ సముద్ర ప్రాంతాల్లో హిల్షా ఇలీషాగా పిలిచే ఈ చేప సంతానోత్పత్తి కోసం సుదూర ప్రాంతాల నుంచి ఈదుకొని  బంగాళాఖాతం చేరుకుంటుంది. గోదావరి, సముద్రం కలిసే ప్రాంతానికి చేరుకొని ఎర్రనీటిలో ప్రయాణిస్తూ గుడ్లను పెడుతుంది. గోదావరి ఎర్రనీటిలో ప్రవేశించినప్పుడు పులసగా పిలుస్తారు. పులసలను  ఉన్నతాధికారులకు, బాస్‌లకు గిఫ్ట్‌లుగా పంపుతారు. గోదావరి పరిసర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాలకు వీటిని పంపుతుంటారు. 

వండడం కూడా ప్రత్యేకమే 
పులస పులుసు తయారీ కూడా ప్రత్యేకమే. ఇతర చేపల్లాగా వండకూడదు. మట్టి కుండలో పులసను వండాలి. ముళ్లు అధికంగా ఉండడంతో ప్రత్యేకంగా వీటిని వండుతుంటారు. ముందుగా చేపముక్కలకు వెన్న, ఆముదం పూసి కొంత సమయం పాటు ఉంచి వీటిని పిడకలు, లేదా కట్టెల పొయ్యి పై తక్కువ మంటపై ఎక్కువ సమయం వండాలి. ఆవకాయ ఊట, వంకాయ, బెండకాయ వంటి వాటిని వేసి వండుతారు. మర్నాడు తింటే దీని రుచి అమోఘంగా ఉంటుందని చేప ప్రియుల చెబుతుంటారు.  

మరిన్ని వార్తలు