అప్రమత్తతతో తప్పిన గోదావరి ముప్పు

22 Jul, 2022 03:56 IST|Sakshi
నరసాపురం పొన్నపల్లి వద్ద నిత్యావసర వస్తువుల పంపిణీ

వరద ప్రాంతాల ప్రజలకు 40 వేల మంది సిబ్బంది సేవలు

23 లక్షల మందికి వరద ఉధృతిపై ఎప్పటికప్పుడు అలెర్ట్‌ మెసేజ్‌లు 

గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ

రెండు మండలాలకు హెలికాప్టర్ల ద్వారా ఆహారం సరఫరా

సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో విపత్తు నిర్వహణ సంస్థ కీలకపాత్ర

సాక్షి, అమరావతి: ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలకు తోడు నదీ పరివాహక ప్రాంతంలో విస్తారంగా కురిసిన వానలతో కొండ వాగులు, వంకలు, ఉప నదులు ఉప్పొంగడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లోని ఆరు జిల్లాల్లో వరద ప్రభావం చూపింది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద 2006లో 28.50 లక్షల క్యూసెక్కులు నమోదు కాగా.. ఆ తర్వాత ఈ ఏడాది 25.80 లక్షల క్యూసెక్కులు రికార్డైంది.

ఈ వరద విపత్తు నుంచి ప్రజలను గట్టెక్కించడంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలను అమలు చేస్తూ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలకపాత్ర పోషించింది. గోదావరి వరద ముప్పు నుంచి ప్రజలను తప్పించేందుకు వారిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వచ్చింది. వివిధ విభాగాలకు చెందిన 40 వేల మంది సిబ్బంది వరద ప్రభావిత జిల్లాల్లో ప్రజలకు అండగా నిలిచారు. వారిని రక్షించడం నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించడం వరకు విశేష సేవలందించారు. ఇందుకు సంబంధించిన వివరాలను గురువారం ఒక ప్రకటన ద్వారా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. 

ముందుగానే అంచనా..
ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతుండటంతో వరద ప్రవాహాన్ని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ముందుగానే అంచనా వేసింది. వరద ప్రారంభానికి ముందుగానే సంస్థలోని ఎమర్జెన్సీ ఆపరేషన్‌ సెంటర్‌లో 24 గంటలు అందుబాటులో ఉండేలా స్టేట్‌ కంట్రోల్‌ రూమ్‌ను జూలై 9న ప్రారంభించింది. జిల్లాల్లో కూడా కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా టోల్‌ ఫ్రీ నంబర్లతో ప్రజలకు అందుబాటులో ఉండి.. వెంటనే స్పందించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది.

ఆ తర్వాత వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూ.. ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలోని అధికారులకు గంట గంటకు సమాచారం చేరవేస్తూ వచ్చింది. తద్వారా ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా గట్టెక్కించింది. సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు స్టేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, ఎండీ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్, దాదాపు వంద మంది సిబ్బంది నిరంతరం పనిచేస్తూ సేవలు అందించారు. 

ప్రజలకు అండగా వేలమంది సిబ్బంది..
ఓ వైపు వరద ఉ«ధృతిని అంచనా వేసి మొదటి ప్రమాద హెచ్చరిక నుంచి మూడో ప్రమాద హెచ్చరిక వరకు ప్రతిక్షణం గమనిస్తూ ఆరు జిల్లాల ప్రజలను అప్రమత్తం చేశారు. కీలక సమయంలో గోదావరి పరివాహక ప్రాంతంలోని 23 లక్షల మంది ప్రజలకు వరద ఉధృతిని తెలుపుతూ అలెర్ట్‌ మెసేజ్‌లు పంపించారు. ఎన్ని లక్షల క్యూసెక్కులకు ఎన్ని మండలాలు ప్రభావితమవుతాయి? ఎన్ని గ్రామాలు ముంపునకు గురవుతాయి?.. వంటివాటిపై అంచనా వేసి జిల్లాల అధికారులకు సమాచారం అందించారు. తద్వారా వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించి పెనుప్రమాదాన్ని తప్పించగలిగారు.

ఓవైపు అధికారులు, ప్రజలను అప్రమత్తం చేస్తూనే.. మరోవైపు వరద ప్రభావిత జిల్లాల్లో సహాయక బృందాలను రంగంలో దింపారు. 10 ఎన్డీఆర్‌ఎఫ్, 11 ఎస్డీఆర్‌ఎఫ్, 3 ఇండియన్‌ నేవీ బృందాలు శ్రమించి ప్రాణాపాయంలో ఉన్న 183 మందిని రక్షించారు. సహాయక బృందాలు చేరలేని విపత్కర స్థితిలోనూ ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు హెలికాప్టర్ల ద్వారా ఆరు రోజులపాటు ఆహారం, నిత్యావసర సరుకులను అందించారు. గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారిని సురక్షితంగా తరలించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 40 వేల రెవెన్యూ, జలవనరులు, వైద్య, గ్రామ సచివాలయాలు, పారిశుధ్యం, ఇతర విభాగాల సిబ్బంది బాధితులకు సేవలు అందించారు.

క్రమంగా తగ్గుతున్న గోదా‘వర్రీ’
పోలవరం రూరల్‌ / నరసాపురం: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, నరసాపురం ప్రాంతాల్లో గోదావరి నీటిమట్టం గురువారం మరింత తగ్గింది. దీంతో గోదావరి పొడవునా ఏటిగట్టు వెంట ముంపు ప్రాంతాల్లో పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. వరద కారణంగా నీట మునిగిన పొన్నపల్లి, లాకుపేట, నందమూరి కాలనీ, స్టేషన్‌పేట, చినమామిడిపల్లి ప్రాంతాల్లో ఇంకా పూర్తిగా నీరు లాగలేదు. ముంపు ప్రాంతాల్లో నీటిని అధికారులు ఇంజన్‌లతో తోడిస్తున్నారు. పొన్నపల్లి ఏటిగట్టు ప్రాంతాన్ని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ జేవీ మురళి పరిశీలించి అక్కడ జరుగుతున్న చర్యలను పర్యవేక్షించారు. ముంపు తొలగిన ప్రాంతాల్లో సిబ్బంది పారిశుధ్య పనులు చేపట్టారు.

వరదలకు నీట మునిగిన ఆలయాల్లో శుద్ధి
కోనసీమ, కాకినాడ, ఏలూరు, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో గోదావరి వరద ఉధృతి సమయంలో నీట మునిగిన ఆలయాలన్నింటిలోనూ యుద్ధప్రాతిపదికన శుద్ధి నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగా క్లీనింగ్, బ్లీచింగ్, క్లోరినేషన్, ఫాగింగ్, ధూపం తదితర కార్యక్రమాలు చేపట్టాలని దేవదాయ శాఖ కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌ గురువారం ఉత్తర్వులిచ్చారు. 

మరిన్ని వార్తలు