దుర్గమ్మకు గాజుల ఉత్సవం

16 Nov, 2020 10:06 IST|Sakshi

సాక్షి, ఇంద్రకీలాద్రి : కార్తీక శుద్ధ విదియను పురస్కరించుకుని సోమవారం దుర్గమ్మకు గాజులతో అలంకరించనున్నారు.  ప్రస్తుతం నెలకున్న కోవిడ్‌ నేపధ్యంలో ఈ ఏడాది కేవలం అంతరాలయంలో అమ్మవారికి మాత్రమే గాజుల అలంకారం చేయాలని వైదిక కమిటీ నిర్ణయించింది. అమ్మవారితో పాటు ఆలయ ప్రాంగణంలో మాత్రమే ఈ ఏడాది గాజులతో అలంకరిస్తారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు అమ్మవారి సన్నిధిలో ధనలక్ష్మీ పూజ నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం  అమ్మవారికి పంచహారతుల సేవ జరిగింది. సేవ అనంతరం ఆలయం చుట్టూ ఉన్న అష్టలక్ష్ముల విగ్రహాల వద్ద  ఏర్పాటు చేసిన జ్యోతులను ఆలయ ఈఓ ఎంవీ సురేష్‌బాబు దంపతులు, చైర్మన్‌ పైలా సోమినాయుడు, ఆలయ అర్చకులు వెలిగించి వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఆలయ అధికారులు, సిబ్బంది టపాసులు కాల్చి, మిఠాయిలను పంచుకున్నారు. రాత్రి 7 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేశారు.  

నేటి నుంచి కార్తీక మాసోత్సవాలు 
ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి వారి సన్నిధిలో కార్తీక మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. కార్తీక మాసం తొలి రోజు సోమవారం కావడంతో పెద్దఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు విచ్చేసే అవకాశాలున్నాయని ఆలయ అధికారులు భావిస్తున్నారు.  
 
దుర్గమ్మకు బంగారు హారం బహూకరణ..
ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు నగరానికి చెందిన భక్తులు బంగారపు హారాన్ని కానుకగా అందచేశారు. విజయవాడ కాళేశ్వరరావు రోడ్డుకు చెందిన  భార్గవ రాము దంపతులు అమ్మవారి అలంకరణ నిమిత్తం సుమారు 40 గ్రాముల బంగారంతో తయారు చేసిన హారాన్ని ఆలయ ఈఓ ఎంవీ. సురేష్‌బాబుకు అందచేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. 

మరిన్ని వార్తలు