జిమ్నాస్టిక్స్‌లో ఏపీకి స్వర్ణం

19 Dec, 2022 05:34 IST|Sakshi
హాకీ మ్యాచ్‌లో తలపడుతున్న మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారులు

కబడ్డీ, ఆర్చరీలోనూ ప్రతిభ చాటిన ఆంధ్రా మన్యం బిడ్డలు

సందడిగా సాగుతున్న ఏకలవ్య ఆదర్శ గురుకులాల జాతీయ క్రీడలు

సాక్షి, అమరావతి: ఏకలవ్య ఆదర్శ గురుకులాల విద్యార్థుల మూడవ జాతీయ క్రీడా పోటీల్లో ఆతిథ్య ఆంధ్రప్రదేశ్‌ జట్లు వివిధ విభాగాల్లో సత్తా చాటారు. విజయవాడలోని లయోలా కాలేజీ, గుంటూరు నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణాల్లో ఆదివారం పలు ఈవెంట్లలో పోటీలు జరిగాయి.

జిమ్నాస్టిక్స్‌ అండర్‌–14 (బాలుర ఈవెంట్‌ ఫ్లోర్‌ ఎక్సర్‌సైజ్‌) విభాగంలో మొదటి స్థానంలో నిలిచిన వి.లక్ష్మణ్‌రెడ్డి (ఆంధ్రప్రదేశ్‌) స్వర్ణపతకం సాధించారు. కె.క్రోనాల్‌ (మహారాష్ట్ర) రజతం, బి.ఆదిత్య (మధ్యప్రదేశ్‌) కాంస్య పతకాలు పొందారు. జిమ్నాస్టిక్స్‌ అండర్‌–14 (బాలికల ఈవెంట్‌ ఫ్లోర్‌ ఎక్సర్‌సైజ్‌) విభాగంలో బి.అమూల్య (తెలంగాణ) స్వర్ణం సాధించగా.. కె.తేజస్వి (ఆంధ్రప్రదేశ్‌) రజతం, ఎం.జ్యోతిక కాంస్యం గెలుచుకున్నారు.

జిమ్నాస్టిక్స్‌ అండర్‌–19 (బాలుర ఈవెంట్‌ ఫ్లోర్‌ ఎక్సర్‌సైజ్‌)లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జె.చిరంజీవి, బాలికల విభాగంలో పి.సావిత్రి రజత పతకాలు సాధించారు. బి.రాజు (మధ్యప్రదేశ్‌) స్వర్ణం, డి.దేవ్‌ (మధ్యప్రదేశ్‌) కాంస్య పతకాలు సాధించారు. బాలి­కల విభాగంలో ఎ.వైష్ణవి (తెలంగాణ) స్వర్ణం, అంకిత (మహారాష్ట్ర) కాంస్య పతకాన్ని సాధించారు.

కబడ్డీలో సత్తా చాటిన తెలంగాణ
కబడ్డీ బాలుర విబాగంలో తెలంగాణ, కబడ్డీ పూల్‌–బి రెండో మ్యాచ్‌లో ఛత్తీస్‌గఢ్‌ విజయం సాధించాయి. బాలికల విభాగం పూల్‌–బీ కబడ్డీ పోటీల మొదటి మ్యాచ్‌లో తెలంగాణ, రాజస్థాన్‌ జట్లు విజయం సాధించాయి. బాలుర (అండర్‌–19) పూల్‌లో తెలంగాణ, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ జట్లు విజయం సాధించాయి. బాలికల (అండర్‌–19) పూల్‌లో తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర జట్లు విజయం సాధించాయి. 

ఆర్చరీలో చెలరేగిన మన్నెం వీరులు
ఆర్చరీ 20 మీటర్ల కేటగిరీ అండర్‌–14 (బాలుర)లో 297 పాయింట్లతో రాజస్థాన్‌కు చెందిన ఆయూష్‌ చర్పోటా మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 291 పాయింట్లతో రెండో స్థానంలో జార్ఖండ్‌కు చెందిన ఆజాద్‌ కుశల్‌ బాస్కే, 289 పాయింట్లతో మూడవ స్థానంలో రాజస్థాన్‌కు చెందిన హిమ్మత్‌ ఖాదియా నిలిచారు.

20 మీటర్ల కేటగిరీ అండర్‌–14 (బాలికల)లో 288 పాయింట్లతో అగ్రస్థానంలో ఉత్తరాఖండ్‌కు చెందిన వైష్ణవి జోషి, 253 పాయింట్లతో రెండవ స్థానంలో తెలంగాణకు చెందిన సనప మమత, 242 పాయింట్లతో మూడవ స్థానంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బసాయ్‌ ప్రీతి నిలిచారు. 30 మీటర్ల కేటగిరీ అండర్‌ –14 (బాలుర)లో 299 పాయింట్లతో జార్ఖండ్‌కు చెందిన ఆజాద్‌ కుశల్‌ బాస్కే వీర విజృంభణ చేసి మొదటి స్థానంలో నిలిచాడు.

298 పాయింట్ల స్వల్ప తేడాతో రెండో స్థానంలో రాజస్థాన్‌కు చెందిన హిమ్మత్‌ ఖాదియా, 265 పాయింట్లతో మూడవ స్థానంలో రాజస్థాన్‌కు చెందిన రంజిత్‌ నిలిచారు. 30 మీటర్ల కేటగిరీలో అండర్‌ –14 (బాలికల)లో 232 పాయింట్లతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బసాయ్‌ ప్రీతి మొదటి స్థానం కైవసం చేసుకుంది.

226 పాయింట్లతో ఉత్తరాఖండ్‌కు చెందిన వైష్ణవి జోషి, 216 పాయింట్లతో తెలంగాణకు చెందిన సనప మమత రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఆర్చరీ గ్రూప్‌ (4) అండర్‌–14(బాలుర)లో 1,669 పాయింట్లతో రాజస్థాన్‌కు చెందిన హిమ్మత్‌ ఖాదియా, అయూష్‌ చర్పొట, రంజిత్, సునీల్‌ బృందం మొదటి స్థానంలో నిలిచింది. 1,399 పాయింట్లతో జార్ఖండ్, 1,383 పాయింట్లతో ఛత్తీస్‌గఢ్‌ బృందాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.

ఆర్చరీ గ్రూప్‌ (4) అండర్‌–14 విభాగం (బాలికల)లో 1,166 పాయింట్లతో తెలంగాణ సనప మమత, మందరకల నవ్యశ్రీ, కుంజ భవ్యశ్రీ, పొట్ట ప్రవల్లిక బృందం మొదటి స్థానంలో నిలిచింది. 1,056 పాయింట్లతో ఉత్తరాఖండ్, 999 పాయింట్లతో ఆంధ్రప్రదేశ్‌ బృందాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.  

మరిన్ని వార్తలు