బిల్లులు లేకుండా బిస్కెట్లు.. బంగారు వ్యాపారుల్లో వణుకు

10 Aug, 2022 08:21 IST|Sakshi

ఓ వైపు ఐటీ అధికారుల దాడులు 

మరో వైపు దొంగల చేతివాటం 

రైల్లో పోలీసుల తనిఖీల్లో దళారీ వద్ద పట్టుబడిన రూ.60 లక్షలు  

ఆదాయపన్ను శాఖకు అప్పగింత 

రంగంలోకి దిగిన ఐటీ అధికారులు 

మరో దళారీ వద్ద రూ.30 లక్షలు అపహరించిన దుండగులు 

బిల్లులు లేకుండా వ్యాపారం సాగిస్తున్న కావలి బంగారు వ్యాపారుల వ్యవహారం మరోసారి బట్టబయలు అయింది. కొంత కాలంగా గుట్టుగా సాగుతున్న వ్యాపార లావాదేవీల్లో ఒకే రోజు రెండు ఘటనలు వణుకుపుట్టిస్తున్నాయి. బంగారం కొనుగోలు కోసం రైల్లో కావలి నుంచి చెన్నైకు ఓ దళారీ తీసుకెళ్తున్న నగదు పోలీసుల తనిఖీల్లో పట్టుబడడంతో ఐటీ అధికారులు రంగ ప్రవేశం చేశారు. మరో దళారీ తీసుకెళ్తున్న నగదును గుర్తు తెలియని దుండగులు దోచుకోవడం కలకలం రేగింది.   

కావలి (నెల్లూరు): కావలిలోని బంగారు వ్యాపారులపై ఆదాయపన్ను శాఖకు చెందిన అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. కొంత కాలంగా బిల్లులు లేకుండా చెన్నై నుంచి బంగారు బిస్కెట్లు కొనుగోలు చేసి వాటిని కావలికి తీసుకువచ్చి ఇక్కడ ఆభరణాలుగా తయారు చేసి అమ్మకాలు చేస్తున్నారు. గతంలో ఇదే పరిస్థితిపై ఐటీ అధికారులు దృష్టి పెట్టి చర్యలు చేపట్టారు. కొంత కాలంగా లావాదేవీలు పారదర్శకంగా సాగాయి. మళ్లీ వ్యాపారులు అక్రమ మార్గం పట్టారు. చెన్నైలో బంగారం కొనుగోలు చేసినా.. ఆభరణాలుగా విక్రయించినా ఎక్కడా బిల్లులు కానీ, చిత్తు కాగితం కూడా ఉండదు. ఈ క్రమంలో ఆదాయపన్ను శాఖ అధికారులు కావలికి రావడం వ్యాపారులు వణికిపోతున్నారు. 

అసలేం జరిగింది..  
సోమవారం ఒకే రోజు రెండు ఘటనలు జరిగాయి. ఇదే బంగారు వ్యాపారుల్లో వణుకుపుట్టిస్తోంది. కావలికి చెందిన ఒక బంగారు వ్యాపారి చెన్నైలో బంగారు బిస్కెట్లు కొనుగోలు చేసి తీసుకువచ్చేందుకు సోమవారం ఓ దళారీకి రూ.60 లక్షలు నగదు ఇచ్చి పంపించాడు. అయితే మార్గంమధ్యలో పోలీసుల తనిఖీల్లో ఈ రూ. 60 లక్షలు నగదు పట్టుబడింది. ఈ నగదును  పోలీసులు ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పగించారు. దీంతో గుంటూరు నుంచి ఐటీ అధికారులు కావలికి చేరుకున్నారు. రూ.60 లక్షలు నగదు ఇచ్చిన బంగారు వ్యాపారి షాపు, నివాసంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ వ్యాపారి చేస్తున్న లావాదేవీలపై పూర్తిస్థాయిలో లావాదేవీల నిర్వహణపై విచారణ చేపడుతున్నారు. మరి కొన్ని దుకాణాలపై దాడులు చేసే అవకాశం ఉండడంతో వ్యాపారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.   

చదవండి: (ఫలించిన ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి కృషి.. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు)

రూ.30 లక్షల అపహరణ 
కావలిలోని మరో బంగారు వ్యాపారి చెన్నై నుంచి బంగారు బిస్కెట్‌ కొనుగోలు చేసి తీసుకు వచ్చేందుకు సోమవారం ఓ దళారీకి రూ.30 లక్షలు నగదు ఇచ్చాడు. అతను రైల్లో వెళ్తుండగా గుర్తు తెలియని దుండగులు దోచుకెళ్లారు. అయితే ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సదరు వ్యాపారి సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. బంగారం వ్యాపారం అంతా బిల్లులు లేకుండా చేస్తుండడంతో పాటు ఈ నగదుకు లెక్కలు చూపించాల్సి వస్తుందని సదరు వ్యాపారి మౌనంగా ఉన్నట్లు సమాచారం.    

మరిన్ని వార్తలు