Gold Price: పసిడి పరుగులు.. రికార్డు దిశగా బంగారం ధర.. ఇవీ  కారణాలు..  

22 Jan, 2023 10:44 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: పసిడి ధర పరుగులు తీస్తోంది. సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎగబాకుతోంది. కొన్నాళ్లుగా ధర పెరగడమే తప్ప తగ్గడంలేదు. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో నెలన్నర క్రితం డిసెంబర్‌ 5న 24 కేరెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,350 ఉంది. ప్రస్తుతం రూ.58,770కు చేరింది. అంటే 45 రోజుల్లో రూ.మూడున్నర వేలు పెరిగింది. ఇక 22 కేరెట్ల పుత్తడి రూ.54,040కి చేరుకుంది.

నగల దుకాణాల్లో  ఆభరణాలపై తరుగు, మజూరీ పేరిట 10 నుంచి 23 శాతం వరకు కొనుగోలుదారుడి నుంచి అదనంగా వసూలు చేస్తారు. ఈ లెక్కన సగటున 15 శాతం వీటికి చెల్లిస్తే పది గ్రా­ముల బంగారు నగకు రూ.68 వేలు అవుతోంది. దీనికి జీఎస్టీ అదనం. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో బంగారాన్ని తులం (11.66 గ్రాములు) లెక్కల్లో కొనుగోలు చేస్తారు. ఆ లెక్కన చూస్తే తులం ముడి బంగారం ధర రూ.68,625 అవుతుంది. అదే తులం ఆభరణాల ధర రూ.79 వేల వరకు ఉంటుంది. 

బంగారాన్ని ఆభరణాలకే కాకుండా ఎలక్ట్రానిక్స్‌ పరికరాల తయారీలోనూ వినియోగిస్తారు. ప్రస్తుతం కోవిడ్‌ తగ్గుముఖం పట్టడంతో ఎలక్ట్రానిక్‌ పరికరాల తయారీ కూడా ఊపందుకుంది. మరోవైపు రష్యా–ఉక్రెయిన్‌ దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ఆరి్థక మాంద్యం కూడా తోడైంది. అంతర్జాతీయంగా డాలర్‌తో రూపాయి మారకం విలువ తగ్గడం, యూఎస్‌ ఫెడ్‌ వడ్డీ రేట్ల ప్రభావం, షేర్‌ మార్కెట్లో అనిశ్చితి వంటివి పసిడి ధర ఎగబాకడానికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

ఆల్‌టైం హై దిశగా..  
2020 ఆగస్టులో 24 కేరెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.59,300కు చేరుకుంది. పుత్తడి చరిత్రలో అదే ఆల్‌టైం రికార్డు. ఇప్పుడు మళ్లీ ఆ రికా­ర్డును దాటుకొని సరికొత్త రికార్డు దిశగా బంగారం పరుగులు తీస్తోంది. ప్రస్తుతం ధర పెరుగుతున్న వేగం, అంతర్జాతీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని రానున్న రోజుల్లో మరింత పెరు­గు­­తుందని వర్తకులు అంచనా వేస్తున్నారు.

తగ్గుతున్న కొనుగోళ్లు 
బంగారం ధర పెరుగుదల ఆభరణాల కొనుగోళ్లపై ప్రభావం చూపుతోంది. కొన్నాళ్లుగా పసిడి ధర పెరుగుతుండడం వల్ల అమ్మకాలు పడిపోయాయని ది బెజవాడ జ్యూయలరీ అండ్‌ బులియన్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి కె.శ్రీహరి సత్యనారాయణ ‘సాక్షి’తో చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఔన్స్‌ (30 గ్రాములు) ధర 1910 నుంచి 1931 డాలర్లకు పెరిగిందన్నారు.
చదవండి: దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్‌లో సగం సీట్లు ఖాళీ

ఇది 1870 డాలర్లకు దిగివస్తే బంగారం ధర తగ్గే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆర్థిక మాంద్యం, డాలరుతో రూపాయి మారకం విలువ తగ్గడం వంటివి బంగారం ధర పెరగడానికి దోహదపడుతున్నాయని విశాఖ గోల్డ్‌ అండ్‌ సిల్వర్‌ మర్చంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మారోజు శ్రీనివాసరావు చెప్పారు.

పెళ్లిళ్ల సీజను వేళ పెను భారం.. 
ఈనెల 25 తర్వాత నుంచి పెళ్లిళ్ల సీజను ప్రారంభమవుతుంది. పెళ్లింట బంగారం కొనుగోలు తప్పనిసరి.  పేద, మధ్య తరగతి వారు కనీసం 40 – 50 గ్రాములైనా కొనాలి. ఈ స్వల్ప మొత్తానికే రూ.3 లక్షల వరకు ఖర్చు చేయాలి. ఇలా ఆకాశాన్నంటుతున్న పసిడి ధర తమకు పెనుభారం అవుతుందని మధ్య తరగతి వారు చెబుతున్నారు.  

మరిన్ని వార్తలు