బంగారం ధగధగ: ఉమ్మడి పశ్చిమ గోదావరిలో రూ.800 కోట్ల విక్రయాలు

19 Aug, 2022 08:59 IST|Sakshi

రూ.500 కోట్ల వరకూ రిటైల్‌ అమ్మకాలే.. 

మార్కెట్‌ విశ్లేషణకు అందని అంచనాలు

నరసాపురం, భీమవరంలో షాపులు కళకళ   

నరసాపురం: కనకం మోత మోగిస్తోంది.. అమ్మకాలలో భళా అనిపిస్తోంది.. నెల రోజుల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో రికార్డు స్థాయిలో అమ్మకాలు నమోదయ్యాయి. ఎన్నడూ లేనివిధంగా రూ.800 కోట్ల అమ్మకాల టర్నోవర్‌ సాగినట్టు బులియన్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వీటిలో రూ.500 కోట్ల వరకూ కేవలం ఆభరణాలు వంటి రిటైల్‌ వ్యాపారమే జరిగిందని చెబుతున్నారు. సాధారణంగా పండుగల సీజన్‌లలో బంగారం వ్యాపారం జోరుగా ఉంటుంది. ప్రస్తుతం శ్రావణమాసంలో వివాహాది శుభకార్యాలకు ముహూర్తాలు మాత్రమే ఉన్నాయి. అయినా రికార్డుస్థాయి అమ్మకాలు నమోదవుతున్నాయి. జిల్లాలోని నరసాపురం, భీమవరం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు లాంటి ప్రధాన పట్టణాల్లో బంగారం షాపులు కళకళలాడుతున్నాయి.  
 
ధర పెరుగుతున్నా..  
ప్రస్తుతం బంగారం ధరలు భారీగా పెరిగాయి. మూడు రోజుల నుంచి మాత్రం స్వల్పంగా తగ్గినా అదీ నామామాత్రమే. ముంబై ధరలను అనుసరించి వ్యాపారం సాగే నరసాపురం బులియన్‌ మార్కెట్‌లో గురువారం 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,500, 22 క్యారెట్ల 916 ఆభరణాల బంగారం ధర రూ.49,750గా ట్రేడయ్యింది. ఈలెక్కన కాసు (8 గ్రాములు) ధర రూ.39,800గా ఉంది. మూడు రోజుల నుంచి గ్రాముకు రూ.70 మాత్రమే ధర తగ్గింది. ప్రస్తుత పరిస్థితుల్లో అమ్మకాలు పెరగడంపై బులియన్‌ వర్గాల్లో చర్చ సాగుతోంది. సాధారణంగా శ్రావణ మాసంలో కొంత మేర అమ్మకాలు పెరుగుతాయి. అయితే ఈ స్థాయిలో ఎన్నడూ పెరగలేదు. ప్రతి దుకాణంలో మూడు రెట్ల వరకూ అమ్మకాలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.   

ఇదే కారణం కావచ్చు.. 
కరోనా సెకండ్‌వేవ్‌ తర్వాత రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంతో బంగారం ధరల పెరుగుదలలో భారీగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. మరో పక్క డాలర్‌తో రూపాయి మారకపు విలువ కూడా భారీ హెచ్చుతగ్గులను చూస్తుంది. ప్రస్తుతం డాలర్‌ విలువ రూ.80కు చేరింది. మరో పక్క షేర్‌ మార్కెట్‌ ఒడిదుడుకుల్లో సాగుతోంది. ఈనేపథ్యంలో బంగారం ధరలు మరింత పెరుగుతాయనే అంచనాలతో బంగారంపై పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువ మంది మక్కువ చూపడంతో బిస్కెట్‌ అమ్మకాలు పెరిగినట్టుగా భావిస్తున్నారు. దీంతోపాటు చాలాకాలం నుంచి బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్న వారు ఒక్కసారిగా ఆసక్తి చూపడంతో ఆభరణాల అమ్మకాల జోరు పెరిగినట్టు చెబుతున్నారు. నెలరోజుల్లో జిల్లాలో హోల్‌సేల్‌ వ్యాపారం ఎక్కువ జరిగే నరసాపురంలో అత్యధికంగా, తర్వాత స్థానంలో భీమవరంలోను పెద్ద ఎత్తుల అమ్మకాలు సాగాయని అంచనా.   

మూడురెట్లు పెరిగాయి  
నెల రోజుల నుంచి బంగారం షాపులు ఖాళీ ఉండటం లేదు. ఆభరణాల అమ్మకాలు కూడా భారీగా పెరిగాయి. గత నెల చివరి నుంచి అమ్మకాల విషయంలో తేడా కనిపిస్తోంది. దాదాపుగా ప్రతి షాపులో మూడురెట్లు అమ్మకాలు పెరిగాయి. కరోనా తర్వాత ఈ స్థాయిలో అమ్మకాలు సాగడం ఇదే. బంగారం ధరలు తగ్గితే రాబోయే రోజుల్లో కూడా ఇదేజోరు కొనసాగుతుంది. దసరా, దీపావళి లాంటి పండుగలు 
ముందున్నాయి.      
– వినోద్‌కుమార్‌జైన్, నరసాపురం బులియన్‌ మర్చంట్‌  అసోసియేషన్‌ అధ్యక్షుడు

మరిన్ని వార్తలు