AP: శరవేగంగా ‘గొల్లపూడి-చినఅవుటపల్లి’ బైపాస్‌ నిర్మాణ పనులు

27 Dec, 2022 13:23 IST|Sakshi
బీబీ గూడెం–కొండపావులూరు మధ్య పూర్తయిన ఆరు లైన్ల రహదారి

గన్నవరం(కృష్ణా జిల్లా): విజయవాడ నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్‌ కష్టాలను పరిష్కరించేందుకు చేపట్టిన 16వ నంబర్‌ జాతీయ రహదారి బైపాస్‌ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. భారతమాల ప్రాజెక్ట్‌లో భాగంగా చిన  అవుటపల్లి నుంచి గుంటూరు జిల్లా చినకాకాని వరకు 48 కిలోమీటర్ల పొడవునా రెండు ప్యాకేజీలుగా ఆరు లైన్ల గ్రీన్‌ఫీల్డ్‌ రహదారిని నిర్మిస్తున్నారు.

ప్యాకేజీ–3లో భాగంగా చినఅవుటపల్లి నుంచి గొల్లపూడి వరకు 30 కిలోమీటర్ల బైపాస్‌ నిర్మాణం చేపట్టిన మెగా ఇంజినీరింగ్‌ సంస్థ ఇప్పటికే 80 శాతం పనులను పూర్తిచేసింది. మరో మూడు నెలల్లో రహదారి నిర్మాణాన్ని పూర్తిచేసి జాతికి అంకితం చేసే దిశగా పనుల్లో వేగం పెంచింది. ప్యాకేజీ–4లో చేపట్టిన గొల్లపూడి నుంచి చినకాకాని వరకు 18 కిలోమీటర్ల బైపాస్‌ పనులు కూడా పూర్తయితే విజయవాడపై పూర్తిగా ట్రాఫిక్‌ భారం తగ్గుతుంది. ఏలూరు వైపు నుంచి హైదరాబాద్, గుంటూరు వైపు రాకపోకలు సాగించే వాహనాలు గొల్లపూడి మీదుగా బైపాస్‌ రోడ్డులో వెళ్లనున్నాయి.


మర్లపాలెం రైల్వేట్రాక్‌ వద్ద నిర్మిస్తున్న వంతెన  

రూ.1,148 కోట్లతో నిర్మాణం 
ప్యాకేజీ–3లో భాగంగా రూ.1,148 కోట్లతో చేపట్టిన బైపాస్‌ నిర్మాణ పనులు చినఅవుటపల్లిలోని పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాల సమీపంలో జీరో పాయింట్‌ నుంచి ప్రారంభమై గొల్లపూడిలో 30వ కిలోమీటర్‌ వద్ద ముగుస్తుంది. ఈ మార్గంలో రెండు రైల్వే ఫ్లై ఓవర్లు మినహా 36 మైనర్‌  వంతెనలు, 17 వెహికల్‌ అండర్‌ పాస్‌లు, రెండు బాక్స్‌ కల్వర్ట్‌లు, మరో 44 పైపు కల్వర్టులు, గ్రామాల వద్ద సర్వీస్‌ రోడ్ల నిర్మాణం దాదాపుగా పూర్తయ్యాయి. మర్లపాలెం, గొల్లపూడి వద్ద రైల్వేట్రాక్‌లకు ఇరువైపులా పిల్లర్ల నిర్మాణం పూర్తిచేసి ఫ్లైఓవర్‌ కోసం గడ్డర్లు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.


చినఅవుటపల్లి వద్ద నిర్మాణంలో ఉన్న రహదారి 

మర్లపాలెం నుంచి అంబాపురం వరకు ఆరులైన్ల రహదారి నిర్మాణం పూర్తికాగా, చినఅవుటపల్లి, మర్లపాలెం, బీబీ గూడెం వద్ద వంతెనలు, అండర్‌ పాస్‌లకు రహదారిని అనుసంధానించే పనులు వేగంగా జరుగుతున్నాయి. సూరంపల్లి–నున్న మధ్యలో టోల్‌ప్లాజా నిర్మాణం కూడా జరుగుతోంది. వాహనదారుల సౌకర్యార్ధం పలుచోట్ల బైపాస్‌ రోడ్లకు ఇరువైపులా టాయిలెట్ల నిర్మాణం కూడా చేస్తున్నారు.

నున్న వద్ద హైటెన్షన్‌ వైర్లు ఎత్తు పెంచకపోవడంతో నిర్మాణ పనులకు కొంత ఆటంకంగా మారింది. ఈ అవరోధాలను అధిగమించేందుకు ఎన్‌హెచ్‌ఏ అధికారులు, జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మిగిలిన నిర్మాణ పనులను కూడా మార్చిలోపు పూర్తిచేసే దిశగా మెగా ఇంజినీరింగ్‌ సంస్థ, నేషనల్‌ హైవే అథారిటీ అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్తున్నారు.
చదవండి: పెన్షన్లపై విష ప్రచారం.. సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు     

మరిన్ని వార్తలు