పెళ్లి సందడి.. కల్యాణ ఘడియలొచ్చేశాయి..

5 Feb, 2022 15:58 IST|Sakshi

నేటి నుంచి 16 వరకు మంచి ముహూర్తాలు

20 నుంచి మార్చి 23 వరకు గురు మౌఢ్యమి అడ్డంకులు

మళ్లీ ఏప్రిల్, మే నెలల్లోనే వివాహాలకు వీలు

కోవిడ్‌ తగ్గుముఖంతో పెళ్లిళ్లకు సన్నద్ధం

ముందుగానే ఫంక్షన్‌ హాళ్ల బుకింగ్‌

కోవిడ్‌ నిబంధనల మేరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు 

సాక్షి, అమరావతి బ్యూరో: కల్యాణ ఘడియలొచ్చేశాయి. ఫిబ్రవరి ఐదో తేదీ నుంచి మంచి ముహూర్తాలు మొదలవుతున్నాయి. దీంతో జిల్లాలోను, నగరంలోనూ చాలా ఇళ్లల్లో పెళ్లి సందడి షురూ కానుంది కొన్నాళ్లుగా కోవిడ్‌ భయంతో పలువురు పెళ్లిళ్లను వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. తప్పనిసరి అయిన వారు మాత్రమే వివాహాలు జరిపించుకున్నారు. గత నవంబర్, డిసెంబర్‌ నెలల్లో కొన్ని ముహూర్తాలు ఉన్నప్పటికీ ఒమిక్రాన్‌ భయంతో వెనకడుగు వేశారు. ఇప్పుడు క్రమంగా కోవిడ్‌ తగ్గుముఖం పడుతుండడంతో పాటు శుభ ముహూర్తాలు ఆరంభం కావడంతో పెళ్లిళ్లకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

నేటి నుంచే సందడి షురూ.. 
శనివారం నుంచి ఈనెల 16 వరకు 5, 6, 7, 10, 11, 12, 14, 16 తేదీల్లో మంచి ముహూర్తాలున్నాయి. ఈనెల 20 నుంచి మార్చి 23 వరకు గురు మౌఢ్యమి (మూఢం) ఉంటుంది. మౌఢ్యమి రోజులు అశుభంగా పరిగణించి పెళ్లిళ్లు, ఇళ్లకు శంకుస్థాపనలు, గృహ ప్రవేశాలు వంటి శుభ కార్యాలు జరిపించరు. గురు మూఢం ముగిశాక కూడా మార్చి 23 నుంచి ఏప్రిల్‌ ఒకటో తేదీ వరకు మంచి ముహూర్తాలు లేవు. తిరిగి మళ్లీ ఏప్రిల్‌ 2 నుంచి పెళ్లి ముహూర్తాలు మొదలు కానున్నాయి. ఏప్రిల్‌లో 2, 3, 6, 7, 13, 15, 16,  20, 21, 23, 24 తేదీలు అంటే పదకొండు రోజుల పాటు పెళ్లిళ్లకు అనుకూలంగా ఉన్నాయి. అలాగే మే నెలలో 4, 11, 12, 13, 15, 26 తేదీల్లో వివాహ సుముహూర్తాలున్నాయి.

ముందు ముహూర్తాలకే ప్రాధాన్యం.. 
రెండేళ్లుగా కోవిడ్‌ మహమ్మారి జనాన్ని భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఎప్పుడు ఏ వేరియంట్‌ రూపంలో వచ్చి పడుతుందో తెలియని పరిస్థితి. వచ్చే రోజుల్లో కోవిడ్‌ పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న భయాందోళన అన్ని వర్గాల్లోనూ ఉంది. పైగా కొద్ది రోజుల నుంచి కోవిడ్‌ తగ్గుముఖం పడుతున్నట్టు కనిపిస్తోంది. అందువల్లే కొన్నాళ్ల పాటు వేచి ఉండకుండా ముందుగా వచ్చే ముహూర్తాల్లోనే పెళ్లిళ్లు చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.

తగ్గించుకుంటున్న పెళ్లి ఖర్చులు.. 
గతంలో పెళ్లిళ్లకు భారీగా ఖర్చు పెట్టి అంగరంగ వైభవంగా జరిపించేవారు. స్తోమతను బట్టి లక్షలు, కోట్ల రూపాయలను వెచ్చించే వారు. ఇదంతా కోవిడ్‌కు ముందు నాటి పరిస్థితి. కానీ ఇప్పుడా పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. కరోనా భయంతో పాటు కోవిడ్‌ ఆంక్షలతో ఎంతటి స్థితిమంతులైనా ఆర్భాటాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. వివాహ వేడుకలకు పరిమితులు విధించడంతో మునుపటిలా వందలు, వేల మందిని ఆహా్వనించడం లేదు.

పురోహితులకు డిమాండ్‌.. 
ఇక ఈ నెలలో కేవలం ఎనిఠిమిది రోజుల్లోనే పెళ్లి ముహూర్తాలుండడంతో పెళ్లి పురోహితులకు డిమాండ్‌ ఏర్పడింది. విజయవాడలో దాదాపు 1500 మంది పురోహితులున్నారు. వివాహానికి స్థాయిని బట్టి పురోహితులు రూ.30–60 వేల వరకు తీసుకుంటారు.

కల్యాణ మండపాలకు గిరాకీ..
మరోవైపు కల్యాణ మండపాలు, ఫంక్షన్‌ హాళ్లకు డిమాండ్‌ కనిపిస్తోంది. పెళ్లిళ్లు రెండు, మూడు నెలల ముందుగానే నిశ్చయమవడంతో అప్పట్లోనే వీటిని బుక్‌ చేసుకున్నారు. దీంతో ఇప్పుడు విజయవాడ నగరంలోని వివాహ వేదికలు ఖాళీ లేకుండా పోయాయి. బెజవాడలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 16 కల్యాణ మండపాలున్నాయి. ప్రైవేటు ఫంక్షన్‌ హాళ్లు మరో 70 వరకు నడుస్తున్నాయి. ఈ నెలలో జరిగే పెళ్లిళ్లకు ఇవన్నీ దాదాపు బుక్‌ అయినట్టు చెబుతున్నారు. కొందరు ధనికులు పేరున్న హోటళ్లలో వివాహాలు జరిపించుకుంటున్నారు. విజయవాడలో వివిధ స్టార్‌ హోటళ్లలో 4,500 వరకు గదులుండగా వీటిలో సగటున 50 శాతానికి పైగా పెళ్లిళ్లకు బుక్‌ అయ్యాయి. నగరపాలక సంస్థ కల్యాణ మండపాలకు ఒక రోజు అద్దె రూ.10–15 వేలు, వీఎంసీ ఐవీ ప్యాలెస్‌ రూ.లక్ష ఉంది. ప్రైవేటు ఫంక్షన్‌ హాళ్ల నిర్వాహకులు రూ.లక్ష నుంచి 5 లక్షల వరకు వసూలు చేస్తున్నారు.

50 శాతం ఆక్యుపెన్సీ.. 
కోవిడ్‌ భయంతో చాన్నాళ్లుగా వివాహ వేడుకలను తగ్గించుకున్నారు. దీంతో ఆతిథ్య రంగం బాగా నష్టపోయింది. కోవిడ్‌ తీవ్రత తగ్గుముఖం పడుతుండడం కాస్త ఊరట కలిగిస్తోంది. ఈ నెలలో మంచి ముహూర్తాలుండడంతో నగరంలోని హోటళ్లలో గదుల ఆక్యుపెన్సీ 50 శాతం వరకు పెరిగింది. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తున్నాం.  
– ముప్పవరపు మురళీకృష్ణ, మెంబర్, విజయవాడ హోటలీయర్స్‌ అసోసియేషన్‌  

ఈ నెలలో మంచి ముహూర్తాలు.. 
మాఘమాసం (ఫిబ్రవరి)లో సెంటిమెంటుగా భావించి పెళ్లిళ్లు చేయడానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతారు. ఈ నెలలో ఎనిమిది రోజులు మంచి ముహూర్తాలున్నాయి. అందువల్ల ఆయా తేదీల్లో వివాహాలకు ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో పురోహితులకు డిమాండ్‌ ఏర్పడింది.
– కృష్ణశాస్త్రి, పురోహితుడు, విజయవాడ  

మరిన్ని వార్తలు