ప్రభుత్వ పాఠశాలల నవీకరణతో మంచి రోజులు

27 Jan, 2023 17:25 IST|Sakshi

ప్రభుత్వ ముందుచూపుతో పూర్వ వైభవం చూస్తున్నాం

కార్పొరేట్‌ విద్యా వ్యవస్థతో ఏం లాభమనేది తల్లిదండ్రులే ఆలోచించుకోవాలి

గత 30 ఏళ్లలో కార్పొరేట్‌ వ్యవస్థతో సాధించిందేముంది

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బొప్పూడి కృష్ణమోహన్‌

ఘనంగా గుంటూరు మాజేటి గురవయ్య హైస్కూల్‌ పూర్వ విద్యార్థుల సమ్మేళనం

గుంటూరు:  ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరించడం ద్వారా విద్యావ్యవస్థలో ఆశాజనక పరిణామాలను చూస్తున్నామని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బొప్పూడి కృష్ణమోహన్‌ చెప్పారు. గుంటూరు బ్రాడీపేటలోని మాజేటి గురవయ్య హైస్కూల్‌ పూర్వ విద్యార్థుల వార్షిక సమ్మేళనాన్ని గురువారం సాయంత్రం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పాఠశాల పూర్వ విద్యార్థి జస్టిస్‌ కృష్ణమోహన్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్న తీరుతో సర్కారు విద్యావ్యవస్థకు మంచి రోజులు వచ్చాయని చెప్పారు.

కార్పొరేట్‌ విద్యాసంస్థల రాకతో గత 30 ఏళ్లలో విద్యారంగంలో ఎన్నో మార్పులు వచ్చాయని, అయితే కార్పొరేట్‌ వ్యవస్థతో విద్యార్థులకు ఎటువంటి లాభం చేకూరిందనే విషయాన్ని తల్లిదండ్రులు పునరాలోచన చేయాలని అన్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్‌ రంగంలో ఎంతో పేరు, ప్రఖ్యాతలు గడించిన మంచి విద్యాసంస్థలు కార్పొరేట్‌ వ్యవస్థతో పోటీ పడలేక కనుమరుగయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.

మళ్లీ ప్రభుత్వ పాఠశాలల వైభవాన్ని చూడాలని మనసారా కోరుకుంటున్నానని పేర్కొన్నారు. గతంలో కళాశాల విద్య తరువాత ఇంజినీరింగ్‌ చదువులకు కోచింగ్‌ పొందేవారని, ప్రస్తుతం 8వ తరగతి నుంచే ఐఐటీ కోచింగ్‌ల పేరుతో విద్యార్థులపై కార్పొరేట్‌ విద్యాసంస్థలు ఒత్తిడి తెస్తున్నాయని చెప్పారు. విద్యావ్యవస్థకు పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు పూర్వ విద్యార్థులు తమ వంతు బాధ్యత తీసుకోవాలని సూచించారు. తాను మాజేటి గురవయ్య హైస్కూల్లో 1977–80 మధ్య కాలంలో 8,9,10 తరగతులు చదివానని గుర్తు చేసుకుని, నాడు తనకు పాఠాలు బోధించిన ఉపాధ్యాయుల పేర్లను చెప్పారు. కార్యక్రమంలో పాఠశాల పూర్వ విద్యార్థి, కార్పొరేటర్‌ ఈచంపాటి వెంకటకృష్ణ, పూర్వ విద్యార్థి సంఘ ప్రతినిధులు ఎంపీడీ భానుప్రసాద్, కె.రామ్‌నాథ్‌బాబు, ఎం.కోదండ రామారావు, న్యాయవాది చుండూరు సుందరరామ శర్మ, మాజేటి ఎంవీఆర్‌కే ముత్యాలు, పాఠశాల కార్యదర్శి మాజేటి వీఎస్‌ఆర్‌ ప్రసాద్, హెచ్‌ఎం శారదాదేవి, పూర్వ విద్యార్థులు  పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు