AP: ప్రభుత్వ ఉపాధ్యాయులకు శుభవార్త..

10 May, 2023 08:30 IST|Sakshi

సాక్షి, అమరావతి: మండలానికి ఒక బాలికల జూనియర్‌ కాలేజీ అనే మాటను నిలబెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆయా కాలేజీల్లో బోధనకు అవసరమైన సిబ్బంది నియామకాలకు చర్యలు చేపట్టింది. దీంతోపాటు దాదాపు 7 వేల మంది సెకండరీ గ్రేడ్‌ టీచర్ల (ఎస్‌జీటీ)కు పదోన్నతి కల్పించి హైస్కూల్‌ స్థాయిలో సబ్జెక్టు ఉపాధ్యాయులుగా నియమించనుంది.

ఈ మొత్తం ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం గత విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 292 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను హైస్కూల్‌ ప్లస్‌ (జూనియర్‌ కాలేజీ స్థాయి) స్థాయికి పెంచుతూ ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే.కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), జూనియర్‌ కళాశాలలు లేనిచోట ‘ప్లస్‌’ స్కూళ్లను గుర్తించి బాలికలకు ఇంటర్మీడియెట్‌ విద్యాబోధన ప్రారంభించింది.

ఈ క్రమంలో 2022–23 విద్యా సంవత్సరంలో 177 ప్లస్‌ హైస్కూల్స్‌లో ప్రవేశాలు చేపట్టింది. వచ్చే విద్యా సంవత్సరంలో మిగిలిన 115 ‘ప్లస్‌’ స్కూళ్లలోనూ ఇంటర్‌ తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో అన్నిచోట్లా పూర్తి స్థాయి బో­ధన సిబ్బందిని నియమించే ప్రక్రియను చేపట్టింది. 
చదవండి: సమస్యలు తీర్చే 'సేవకులం'

7 వేల ఎస్‌జీటీలు.. 1,752 ఎస్‌ఏలకు అవకాశం  
2023–24 విద్యా సంవత్సరంలో జూన్‌ 1 నుంచి ఇంటర్‌ తరగతులు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుత గణాంకాల ప్రకారం హైస్కూల్‌ ప్లస్‌ స్థాయిలో ఇంటర్‌ తరగతుల బోధనకు 1,752 మంది ఉపాధ్యాయులు అవసరమని గుర్తించారు. ఇందులో ఎంపీసీ, బైపీసీ, కామర్స్, ఆర్ట్స్‌ సబ్జెక్టులకు అవసరముంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సేవలందిస్తున్న స్కూల్‌ అసిస్టెంట్ల(ఎస్‌ఏ)లో సీనియారిటీతో పాటు పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (పీజీటీ) అర్హతలున్నవారిని హైస్కూల్‌ ప్లస్‌లో నియమించనున్నారు.

ఇంతకాలం పాఠశాల స్థాయి బోధనలో ఉన్నవారు కాలేజీ స్థాయిలో బోధనకు ఎంత వరకు అనువుగా ఉన్నారో ఇంటర్‌ బోర్డు ద్వారా పరీక్షించనున్నారు. అనంతరం ఎంపికైన 1,752 మంది స్కూల్‌ అసిస్టెంట్లకు ఒక ఇంక్రిమెంట్‌ అదనంగా ఇచ్చి జూనియర్‌ కాలేజీల్లో బోధనకు నియమించనున్నారు.

కాగా, దాదాపు 6 వేల నుంచి 7 వేల మంది ఎస్‌జీటీలకు పదోన్నతిని సైతం ప్రభుత్వం కల్పించనుంది. వీరిని హైస్కూల్‌ స్థాయిలో సబ్జెక్టు నిపుణులుగా నియమించనుంది. పదోన్నతులు, పోస్టుల భర్తీ ప్రక్రియను మే నెలాఖరుకు పూర్తి చేయాలని ప్రభుత్వం విద్యాశాఖను ఆదేశించింది.   
చదవండి: సీఐతో ఎమ్మెల్యే నిమ్మల దురుసు ప్రవర్తన

మరిన్ని వార్తలు