ధాన్యం రైతులకు గుడ్‌ న్యూస్‌.. రూ.1,096.52 కోట్లు విడుదల చేసిన ఏపీ సర్కార్‌

31 Dec, 2022 13:04 IST|Sakshi

ఇప్పటి వరకు 18.52 లక్షల టన్నుల సేకరణ

2.84 లక్షల మంది రైతులకు రూ.2,924.53 కోట్లు చెల్లింపు

సాక్షి, అమరావతి: ధాన్యం రైతులకు శుభవార్త! ఆర్బీకేల ద్వారా రైతన్నల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు రూ.1,096.52 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో ఇప్పటివరకు 3.29 లక్షల మంది రైతుల నుంచి రూ.3,781 కోట్ల విలువైన 18.52 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది.

తాజా చెల్లింపుతో మొత్తం 2.84 లక్షల మంది రైతులకు రూ.2,924.53 కోట్లను ఖాతాల్లో జమ చేసినట్లయింది. రైతులకు మద్దతు ధర కల్పించడంతోపాటు ప్రభుత్వం వేగంగా చెల్లింపులు కూడా జరుపుతోంది. 21 రోజుల్లోపు చెల్లించాలని నిర్ణయించినప్పటికీ ధాన్యం కొనుగోలు చేసిన వారం నుంచి పది రోజుల లోపే రైతుల ఖాతాలకు నగదు జమ చేసిన దాఖలాలున్నాయి. కొన్ని చోట్ల మాత్రం సాంకేతిక సమస్యల వల్ల ఒకటి రెండు రోజులు చెల్లింపులు ఆలస్యమయ్యాయి.

తొలిసారిగా అదనపు సాయం.. 
ధాన్యం సేకరణలో తొలిసారిగా తెచ్చిన ఆన్‌లైన్‌ విధానంతో రైతులకు పారదర్శకంగా మద్దతు ధర లభిస్తోంది. గోనె సంచులు, రవాణా చార్జీలు, హమాలీ ఖర్చులను సైతం రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేస్తోంది. వీటి కింద ఇప్పటివరకు రూ.45.91 కోట్లు విడుదల చేసింది. ఇందులో దాదాపు 50 శాతం చెల్లింపులను పూర్తి చేసింది. గత సర్కారు హయాంలో ఇవేమీ లేకపోగా రైతులకు ధాన్యం సొమ్ములను నెలలు తరబడి బకాయిలు పెట్టారు. మిల్లర్లు, దళారులకు లబ్ధి చేకూర్చేందుకు ధాన్యం కొనుగోళ్లలో  జాప్యం చేసింది.

ఫలితంగా రైతన్నల్లో ఆందోళన రేకెత్తించి నష్టానికే మధ్యవర్తులకు ధాన్యం విక్రయించుకోవాల్సిన దుస్థితి కల్పించింది. ఇలాంటి వాటిని అరికడుతూ రైతులే తొలి ప్రాధాన్యంగా 21 రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ధర జమ చేయాలని నిర్ణయించి సీఎం జగన్‌ పక్కాగా అమలు చేస్తున్నారు. దీంతో గత సీజన్ల కంటే ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరుగుతున్నాయి.

సంక్రాంతి నాటికి పూర్తి
ఖరీఫ్‌ ధాన్యం సేకరణను సంక్రాంతి నాటికి పూర్తి చే­­సేలా కృషి చేస్తున్నాం. ఉత్తరాంధ్రలో కొనుగోళ్లు వేగవంతం చేయాలని ఆదేశించాం. ఆన్‌లైన్‌ విధా­నంతో రైతులకు సంపూర్ణ మద్దతు ధర లభి­స్తోంది. పండగ సీజన్లను దృష్టిలో పెట్టుకుని నిర్ణీత సమయం ప్రకారం చెల్లింపులు చేస్తున్నాం. 
– హెచ్‌.అరుణ్‌కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ, జి.వీరపాండియన్, ఎండీ, పౌరసరఫరాల సంస్థ  

మరిన్ని వార్తలు