కిక్కు తగ్గింది! 

3 Oct, 2020 08:27 IST|Sakshi

దశల వారీ మద్య నిషేధంతో సత్ఫలితాలు 

జిల్లాలో 52 శాతం లిక్కర్, 81 శాతం బీర్ల విక్రయాల్లో తగ్గుదల

సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు 

నూజెండ్ల మండలానికి చెందిన సుబ్బారావు (పేరు మార్చాం) కూలి పని చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. భార్య, ఇద్దరు పిల్లలు. కుమారుడు పదో తరగతి, కుమార్తె ఇంటరీ్మడియెట్‌ చదువుతున్నారు. కూలికి వెళ్లితే రోజుకు రూ.400 వస్తుంది. పది నెలల కిందట వరకూ రోజు వారీ వచ్చే కూలి డబ్బుల్లో రూ.300 తాగుడుకే ఖర్చు చేసేవాడు. ఇక సుబ్బారావు మిగిలి్చన రూ.100తో పాటు అతని భార్య వ్యవసాయ కూలి పనులకు వెళ్లగా వచ్చే రూ.200తో సంసారాన్ని నెట్టుకొచ్చేది. ఆర్థిక ఇబ్బందులతో కూతురు, కుమారుడిని కూడా బడి మాన్పించి అప్పుడప్పుడు పనులకు తీసుకువెళ్లేది. ఈ క్రమంలో ప్రభుత్వం మద్య నిషేధంలో భాగంగా బెల్టు షాపులు ఎత్తేయడం, మద్యం దుకాణాలు కుదించడంతో వారి గ్రామ పరిధిలో మద్యం సరిగా దొరకడంలేదు. తాగాలంటే మండల కేంద్రానికి వెళ్లాల్సిన పరిస్థితి. దీనికి తోడు ధరలు బాగా పెరిగాయి. దీంతో సుబ్బారావు నెమ్మదిగా మద్యానికి దూరంగా జరగడం మొదలు పెట్టాడు. గత ఏడెనిమిది నెలల నుంచి పూర్తిగా మద్యం తాగడం మానేశాడు. కూలి డబ్బులు మొత్తం ఇంట్లోనే ఇస్తున్నాడు. ప్రస్తుతం ఆ కుటుంబం ఆర్థికంగా నిలబడి సంతోషంగా ఉంది.  

సాక్షి, గుంటూరు: ఇది ఒక సుబ్బారావు కుటుంబం సంతోషమే కాదు. మద్యం రక్కసి నుంచి బయటపడిన ఎందరో కుటుంబాల్లో వికసిస్తున్న ఆనందం. జిల్లాలో దశల వారీ మద్య నిషేధం సత్ఫలితాలిస్తోంది. గత టీడీపీ హయాంతో పోలిస్తే ప్రస్తుతం జిల్లాలో మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గడం ఇందుకు నిదర్శనం. 
గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో 353 మద్యం షాపులు, 185 బార్లు ఉండేవి. మరో నాలుగు వేల వరకూ బెల్టుషాపులు గ్రామాల్లో అందుబాటులో ఉండేవి.   
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టగానే బెల్టు షాపులను రద్దు చేశారు. మద్యం షాపుల సంఖ్యను 20 శాతం కుదించారు.    
ఈ ఏడాది జూన్‌ నుంచి మరో 13 శాతం దుకాణాలను రద్దు చేయడంతో ప్రస్తుతం జిల్లాలో మద్యం దుకాణాలు 239 మాత్రమే ఉన్నాయి. 
దీనికి తోడు మద్యాన్ని ప్రజల నుంచి దూరం చేయడంలో భాగంగా మద్యం రేట్లను పెంచడం, మద్యం అక్రమాలపై ఉక్కుపాదం మోపడంతో మద్యం వినియోగం బాగా తగ్గింది. 
ప్రస్తుతం జిల్లాలో లిక్కర్‌ విక్రయాలు 52 శాతం, బీర్ల విక్రయాలు 81 శాతం మేర తగ్గాయి.  
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఏటా 10 శాతం మేర మద్యం విక్రయాలు పెరుగుతాయనేది ఎక్సైజ్‌ శాఖ అంచనా. అయితే అందుకు విరుద్ధంగా మద్యం విక్రయాల్లో గణనీయమైన తగ్గుదల చోటు చేసుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.    

మరిన్ని వార్తలు