1,284 పాఠశాలల్లో ఇతర నిర్మాణాలను ఆపేశాం

12 Dec, 2021 03:55 IST|Sakshi

హైకోర్టుకు పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి నివేదన

తదుపరి విచారణ 23కి వాయిదా

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 1,284 పాఠశాలల్లో రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, ఆరోగ్య కేంద్రాలను నిర్మిస్తున్నట్లు గుర్తించామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఆ నిర్మాణాలన్నింటినీ నిలుపుదల చేయించి ఈ ఏడాది సెప్టెంబర్‌ చివరి కల్లా వాటిని ఖాళీ చేయించామని వివరించింది. పాఠశాలల్లో విద్యకు సంబంధం లేని కార్యకలాపాలను చేపట్టడం లేదంది. ఈ మేరకు పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది హైకోర్టు ముందు ఓ మెమో దాఖలు చేశారు. ఇందులో జిల్లాల వారీగా ఆయా పాఠశాలల్లో చేపట్టిన నిర్మాణాలను, తరువాత వాటిని ఖాళీ చేయించిన వివరాలను పొందుపరిచారు.

ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు తదితర నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలంటూ 2020లో హైకోర్టు అధికారులను ఆదేశించింది. అయితే తమ ఆదేశాలను అధికారులు అమలు చేయకపోవడంతో హైకోర్టు ఈ వ్యవహారంపై సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలకు ఉపక్రమించింది. గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజా శంకర్, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, అప్పటి కమిషనర్‌ చిన వీరభద్రుడు, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, అప్పటి, ప్రస్తుత డైరెక్టర్లు విజయకుమార్, ఎంఎం నాయక్‌లపై ధిక్కార చర్యలు చేపట్టింది.

ఈ ధిక్కార పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ విచారణ జరిపారు. ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లో చేపట్టిన ఇతర నిర్మాణాలను తొలగించాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాల అమలు ఎంత వరకు వచ్చిందో తెలియచేస్తూ సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. దీంతో ద్వివేది నిర్మాణాల వివరాలను మెమో రూపంలో కోర్టు ముందుంచారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేశారు. 

మరిన్ని వార్తలు