రూ.1,654 కోట్లకు కేంద్రానికి ప్రతిపాదనలు 

11 Mar, 2023 03:54 IST|Sakshi

ఆర్‌కేవీవై కింద రూ.1148 కోట్లు 

క్రిషోన్నతి యోజన కింద రూ.506 కోట్లు 

వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా వ్యవసాయ, అనుబంధ రంగాల్లో వివిధ కార్యక్రమాల అమలుకు రాష్ట్రీయ కృషి వికాస యోజన (ఆర్‌కేవీవై), క్రిషోన్నతి పథకాల కింద 2023–24 సంవత్సరానికి రూ.1,654 కోట్లు కేటాయించాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తున్నట్టు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టే పథకాలకు  నిధుల కేటాయింపుౖపై శుక్రవారం సచివాలయంలో జరిగిన సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. రాష్ట్రంలో వివిధ పంటల సాగు విస్తీర్ణం, ఉత్పత్తి పెంచడంతో పాటు వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్‌కేవీవై, క్రిషోన్నతి యోజన కింద నిధుల  కోసం కేంద్రం ప్రతిపాదనలు కోరిందని ఈ సందర్భంగా చెప్పారు.  

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులు సమకూరుçస్తూ ఏటా ఈ పథకాలు అమలు చేస్తున్నాయన్నారు. ఆర్‌కేవీవై కింద ఈ ఏడాది రూ. 1,148 కోట్లకు కార్యాచరణ రూపొందించామని చెప్పారు. ఈ నిధులతో కిసాన్‌ డ్రోన్‌ టెక్నాలజీ ప్రోత్సాహం, భూసార పరిరక్షణ, సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు బిందు సేద్యానికి ప్రోత్సాహకాలు ఇవ్వడం, పొగాకుకు బదులుగా అపరాలు, నూనె గింజలసాగు పెంచడం వంటి కార్యక్రమాలు అమలు చేస్తామని తెలిపారు.

అదేవిధంగా క్రిషోన్నతి యోజన కింద ఈ ఏడాది  506 కోట్ల రూపాయాలతో  కార్యాచరణ రూపొందించామని చెప్పారు. వీటితోపాటు జాతీయ ఆహార భద్రత పథకం కింద 70 కోట్ల రూపాయలుర, జాతీయ నూనె గింజల పథకం కింద  29.50 కోట్ల రూపాయలు, రైతులకు నాణ్యమైన, ధ్రువీకరించిన విత్తనాలు అందించేందుకు  19 కోట్ల రూపాయలు, వ్యవసాయ విస్తరణ, శిక్షణకు  రూ.36 కోట్లు, సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకం కింద రూ.200 కోట్లు మంజూరు చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతున్నట్టు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు.  ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ స్పెషల్‌ కమిషనర్‌ చేవూరు హరికిరణ్‌తో పాటు వ్యవసాయ, ఉద్యాన శాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు