‘సొంత లాభం కొంత మానుకొని’

15 Dec, 2020 04:01 IST|Sakshi

ఊరికి ఉపకారం.. రైతుకు సహకారం

తండ్రి పేరిట భారీ భూదానం

సాక్షి, అమరావతి బ్యూరో: కరువు సీమలో కరెంటు బిల్లులు చెల్లించడానికే కటకటలాడే రైతు పరిస్థితిని ప్రత్యక్షంగా చూశారు. ‘ఎలాగోలా కడతాం.. కరెంట్‌ తీసేయకండి బాబూ’ అంటూ ప్రాధేయపడే వారి గోడునూ విన్నారు. అన్నదాత ఆవేదన ఆయనను కదిలించింది. వారికి తన వంతుగా ఏదైనా చేయాలి.. అన్న ఆలోచన వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన ఉచిత విద్యుత్‌ పథకంతో కార్యరూపం దాల్చింది. అప్పట్నుంచి రైతుకు మేలు చేసే ఆ పథకంలో తానూ పాలుపంచుకుంటున్నారు. నెలనెలా తన జీతం నుంచి కొంత మొత్తాన్ని ఆ పథకం కోసం వెచ్చిస్తున్నారు. 

రైతుల కష్టాలు చూసి..
ప్రకాశం జిల్లా వేటపాలెంకు చెందిన ఊటుకూరి గోపాలకృష్ణమూర్తి.. ప్రస్తుతం విజయవాడ కేంద్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ మధ్య ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్‌)లో ఫైనాన్స్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. విద్యుత్‌ శాఖలో తొలుత అనంతపురం జిల్లా ధర్మవరంలో జూనియర్‌ అకౌంట్స్‌ అధికారి (జేఏవో)గా 1986లో చేరారు. విధి నిర్వహణలో భాగంగా రైతుల వ్యవసాయ విద్యుత్‌ బిల్లుల వసూళ్లకు వెళ్లేవారు. అప్పట్లో 5హెచ్‌పీ మోటారుకు నెలకు వచ్చే రూ.37 బిల్లును కూడా నాగసముద్రంగేటు, రామగిరి, వంటి వెనకబడ్డ ప్రాంతాల్లో కొంతమంది రైతులు చెల్లించలేక పోయేవారు. ఆ తర్వాత నెల్లూరు జిల్లా నాయుడుపేట ఏఏవోగా బదిలీ అయిన ఆయనకు ఓజిలి, పెళ్లకూరుల్లోనూ దాదాపు అలాంటి పరిస్థితులే కనిపించాయి. ఇలాంటి రైతులకు తనవంతు సహాయం అందించాలనే తపన అప్పట్నుంచీ ప్రారంభమయ్యింది. ప్రజా ప్రస్థానం పాదయాత్ర సందర్భంగా రైతుల కష్టాలు కళ్లారా చూసిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి, 2004లో అధికారంలోకి రాగానే.. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఉచిత విద్యుత్‌ పథకం ఫైలుపై ముఖ్యమంత్రిగా తొలి సంతకం చేశారు. ఆ పథకంతో గోపాలకృష్ణమూర్తికి ఒక మార్గం దొరికింది.  

నెలనెలా ఇలా.. 
ఒక రైతుకు సుమారుగా ఏడాదికయ్యే విద్యుత్‌ బిల్లును ప్రభుత్వం ద్వారా తాను చెల్లించాలని మూర్తి నిర్ణయించుకున్నారు. అలా 2004 మే నుంచి మొదలుకుని నెల నెలా తన జీతం నుంచి తొలుత రూ.500 చొప్పున ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌)కి  చెల్లించడం మొదలు పెట్టారు. ఏటా మార్చిలో ఆ మొత్తాన్ని పెంచుతూ వచ్చారు. అలా ఇప్పుడు నెలకు రూ.6,500 చెల్లిస్తున్నారు. ప్రతి నెలా తన జీతం నుంచే ఆ సొమ్ము సీఎంఆర్‌ఎఫ్‌కు వెళ్లేలా ఏర్పాటు చేశారు. ఇలా 16 ఏళ్లుగా చెల్లింపులను నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. 

మూర్తి స్ఫూర్తితో మరికొందరు.. 
గోపాలకృష్ణమూర్తిని సాటి ఉద్యోగులూ ఆదర్శంగా తీసుకున్నారు. అప్పట్లో విద్యుత్‌శాఖ ‘పవర్‌లైన్‌’ పేరిట నడిపే మ్యాగజైన్‌లో మూర్తి గురించి ప్రచురించారు. దీంతో స్ఫూర్తి పొందిన మరికొందరు విద్యుత్‌ శాఖ ఉద్యోగులు తమకు తోచినంత సీఎంఆర్‌ఎఫ్‌కు నెలనెలా పంపించడం మొదలుపెట్టారు. 

తుదిశ్వాస వరకు ఇస్తా..
రైతులకు సాయపడే విషయంలో నా ఆనందం మాటల్లో చెప్పలేను. మరో ఏడాదిన్నరలో పదవీ విరమణ చేస్తున్నాను. అయినా ఇది ఆపను. నాకొచ్చే పెన్షన్‌ సొమ్ములోనూ కొంత కేటాయిస్తా. ఏటా పెంచకపోయినా, ఇప్పుడు చెల్లిస్తున్న మొత్తాన్ని మాత్రం తగ్గించను. ఇలా నా ప్రాణం ఉన్నంత వరకు కొనసాగిస్తా. నన్ను నా కుటుంబసభ్యులూ ప్రోత్సహిస్తున్నారు. 

తండ్రి పేరిట రూ.కోటిన్నర విలువైన భూమి ప్రభుత్వానికి అప్పగింత 
తాళ్లరేవు (ముమ్మిడివరం): పుట్టిన ఊరి కోసం ఆ తండ్రి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడితే.. ఆయన వారసులు ఆ తండ్రి పేరిట భారీ భూదానం చేశారు. వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని ఇంజరం గ్రామానికి చెందిన దివంగత నృసింహదేవర సత్యనారాయణ మూర్తి (దత్తుడు) పలుమార్లు సర్పంచ్‌గా పనిచేసి గ్రామాభివృద్ధిలో కీలక భూమిక పోషించారు. నిరుపేదలకు గృహ నిర్మాణాల నుంచి పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలతోపాటు ఆరోగ్య ఉప కేంద్రాన్ని తీసుకువచ్చి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.

ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించేందుకు ప్రభుత్వ స్థలం లేని పరిస్థితుల్లో ఆయన తన సొంత భూమిని ఆయా భవనాలకు కేటాయించి అందరి మన్ననలు పొందారు. ప్రస్తుతం దేశానికే తలమానికంగా మారిన గ్రామ సచివాలయ వ్యవస్థలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ల నిర్మాణానికి ఆయన కుమారులు రూ.కోటిన్నరకు పైగా విలువైన భూమిని దానం చేశారు. దత్తుడు మరణానంతరం కూడా ఆయన సేవా వారసత్వాన్ని కుమారులు కొనసాగిస్తూ ఊరి అవసరాల కోసం ప్రభుత్వానికి భూమిని అందించారు. 

మరిన్ని వార్తలు