స్వేచ్ఛగా ఎన్నికలు జరిగాయి: డీజీపీ

18 Apr, 2021 03:22 IST|Sakshi

సాక్షి, అమరావతి: తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికలు సజావుగా జరిగాయని, ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల విధుల్లో రాష్ట్ర పోలీస్‌ బలగాలతోపాటు 69 ప్లటూన్ల కేంద్ర బలగాలు పాలుపంచుకున్నాయని తెలిపారు.

ఎన్నికల నేపథ్యంలో బయట వ్యక్తులు, వాహనాలు రాకుండా తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ సరిహద్దుల్లో కఠిన చర్యలు తీసుకున్నామని వివరించారు. అనుమతి లేకుండా వచ్చిన 250పైగా వాహనాలను తిప్పి పంపించామన్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలో 33,966 మందిని బైండోవర్‌ చేశామన్నారు. రూ.76,04,970 నగదును, 6,884 లీటర్ల మద్యాన్ని, 94 వాహనాలను సీజ్‌ చేసినట్టు తెలిపారు. ఉద్దేశపూర్వకంగా శాంతిభద్రతలకు భంగం కలిగిస్తారనే సమాచారం మేరకు అనుమానితులపైన నిరంతర నిఘాను ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఏ సమస్య తలెత్తినా తక్షణమే డయల్‌ 100, 112 ద్వారా సమాచారమివ్వాలని ప్రచారం చేసినట్టు చెప్పారు.  

మరిన్ని వార్తలు