మానవ అక్రమ రవాణాపై కఠిన చర్యలు 

31 Jul, 2021 09:22 IST|Sakshi

బాధితులను తక్షణమే ఆదుకుంటాం 

ఆ మేరకు సీఎం జగన్‌ ఆదేశాలు 

జిల్లాకో ఏహెచ్‌టీయూ ఏర్పాటు  

డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ వెల్లడి 

సాక్షి, అమరావతి: మానవ అక్రమ రవాణా నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని, బాధితులను తక్షణమే ఆదుకునేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టమైన ఆదేశాలిచ్చారని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. మానవ అక్రమ రవాణా నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ పోలీస్, ఏపీ సీఐడీ ఆధ్వర్యంలో శుక్రవారం వర్చువల్‌ సమావేశం జరిగింది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించిన డీజీపీ ప్రారంభోపన్యాసం చేశారు. మానవ అక్రమ రవాణా నివారణ చర్యల్లో భాగంగా బాధితుల గుర్తింపు, వారు తక్షణ న్యాయం, సహాయం పొందేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో నంబర్‌ 47ను తెచ్చిందని డీజీపీ తెలిపారు. ఇందుకోసం ప్రతి జిల్లాలో ఒకటి చొప్పున యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్‌ (ఏహెచ్‌టీయూ) లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

ఏపీ సీఐడీ ఏడీజీ పీవీ సునీల్‌ కుమార్‌ అధ్యక్షతన జరిగిన ఈ వర్చువల్‌ సమావేశంలో రాష్ట్ర శాంతి భద్రతల అడిషనల్‌ డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్,  దిశ ప్రత్యేక అధికారి బి.రాజకుమారి, రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి డాక్టర్‌ పీఎం నాయర్, సెంటర్‌ ఫర్‌ హ్యూమన్‌ సెక్యూరిటీ అండ్‌ ఎక్స్‌టర్నల్‌ అఫైర్స్‌ ఆఫ్‌ ఇండియా ఫౌండర్‌ చైర్మన్‌ డాక్టర్‌ రమేష్‌ కన్నెగంటి, హెల్ప్‌ సంస్థ ఆర్గనైజేషన్‌ కన్వీనర్‌ ఎన్‌వీఎస్‌ రామ్మోహన్, బచపన్‌ బచావో ఆందోళన్‌ ప్రతినిధి తిరుపతి, రెడ్‌ రోప్‌ తదితర స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు పాల్గొని మాట్లాడుతూ.. అక్రమ రవాణాను అరికట్టడంతోపాటు దాని బారి నుంచి బయట పడిన బాధితులకు తక్షణ న్యాయం అందించడంపై మరింత దృష్టి పెట్టాలన్నారు. పలువురు డీఐజీలు, జిల్లాల ఎస్పీలు, నగర పోలీస్‌ కమిషనర్‌లు, పలు ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు పాల్గొని మాట్లాడారు.

మరిన్ని వార్తలు