50 ఏళ్ల గాడిద ‘బతుకు’ కష్టమైపోయింది.. పరిస్థితి ఇలాగే కొనసాగితే వాటిని చూస్తామో లేదో!

7 Feb, 2023 18:52 IST|Sakshi

అనంతపురం అగ్రికల్చర్‌: కష్టజీవి అయిన గాడిద (ఖరము) క్రమేణా కనుమరుగవుతోంది. శాస్త్ర, సాంకేతిక రంగాలతో పాటు మానవుని జీవన శైలిలో మార్పులు వచ్చాక గాడిదల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇదే పరిస్థితి మరికొన్ని సంవత్సరాలు కొనసాగితే భూమి మీద గాడిద జాతి అంతరించిపోయే ప్రమాదం ఉంది. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై ప్రత్యేక దృష్టి సారించి... వీటి సంతతిని పెంచాలని వార్షిక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
► గాడిద జీవితకాలం 50 సంవత్సరాలు. గ్రామీణ ప్రాంతాల్లో బరువు మోయడానికి వినియోగిస్తారు. చాకలివారు తమ వృత్తి పనిలో వీటినే ఎక్కువగా వాడేవారు. కొండలు, గుట్టలు లాంటి ప్రాంతాల్లో నివసించే వారు రవాణాకు, మరికొన్ని ప్రాంతాల్లో వ్యవసాయ పనుల్లో కూడా వినియోగించేవారు. లగేజీ రవాణాకు ఆటోలు, తోపుడు బండ్లు, ద్విచక్రవాహనాలు అందుబాటులోకి రావడంతో గాడిదల వినియోగం తగ్గిపోయింది.

30 ఏళ్ల కిందట వరకు గాడిదల సంఖ్య గణనీయంగా ఉండేది. పల్లెల్లో చూస్తే ఎక్కడ చూసినా కనిపించేవి. గాడిద పాలను పిల్లలకు రోగనిరోధక శక్తిగానూ, కొన్ని ఆయుర్వేద మందుల్లోను వాడతారు. అక్కడక్కడా ఉన్న గాడిదల నుంచి కొందరు పాలను సేకరించి అమ్ముకుంటున్నారు. ఇప్పుడు వాటి పాలకు గిరాకీ ఉన్నందున గాడిద కూడా కొందరికి జీవనాధారంగా మారింది.  

వెయ్యిలోపే గాడిదలు 
ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలో 2007 లెక్కల ప్రకారం 15 వేలకు పైగా గాడిదలు ఉండేవి. 2012లో ఆ సంఖ్య 6,800కు చేరగా, 2018లో 3,200కు పడిపోయింది. తాజాగా గాడిదల సంఖ్య వెయ్యికి లోపే ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో రొళ్ల, శెట్టూరు, విడపనకల్లు, ఉరవకొండ, వజ్రకరూరు, యాడికి, పెద్దవడుగూరు, గుంతకల్లు, గుత్తి, ధర్మవరం, కూడేరు, కుందురి్ప, అమరాపురం, ఆత్మకూరు తదితర ప్రాంతాల్లో గాడిదలు సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. 

గాడిదల పెంపకంపై 23న సదస్సు  
అంతరించిపోతున్న గాడిదల సంతతిని పెంచాలనే ఆలోచనతో ఈ నెల 23న అనంతపురంలో జాతీయ స్థాయి సదస్సు నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘బ్రూక్‌ హాస్పిటల్‌’ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం, పశుసంవర్ధక శాఖ సహకారంతో ‘డీక్లినింగ్‌ డాంకీ పాపులేషన్‌ అండ్‌ స్టెప్స్‌ ఫర్‌ మిటిగేషన్‌ ఇన్‌ ది స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌’ అనే అంశంపై సదస్సు ఏర్పాటు చేశారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం, బ్రూక్‌ హాస్పిటల్‌ ప్రతినిధులతో పాటు పశు సంవర్ధక శాఖ రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు, నోడల్‌ ఆఫీసర్లు, అనిమల్‌ వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్స్‌ ప్రతినిధులు, గుంటూరుకు చెందిన గాడిద పెంపకందారులు కొందరు హాజరు కానున్నట్లు ఆ శాఖ జిల్లా అధికారి డాక్టర్‌ వై.సుబ్రహ్మణ్యం తెలిపారు.   

మరిన్ని వార్తలు