AP: కరెంట్‌ కోతలంటూ కట్టుకథలు

17 Oct, 2021 02:23 IST|Sakshi

పండగ తర్వాత భారీగా పవర్‌ కట్స్‌ అంటూ దుష్ప్రచారం

రాష్ట్రమంతా చీకట్లేనంటూ భయాందోళనలకు గురిచేసే యత్నం

సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వదంతులు వ్యాప్తి

అవన్నీ అవాస్తవాలని స్పష్టం చేసిన ఇంధన శాఖ, డిస్కమ్‌లు

బొగ్గు కొనుగోలు కోసం ఏపీ జెన్‌కోకు రూ.250 కోట్లు అత్యవసర నిధులు అందించిన రాష్ట్ర ప్రభుత్వం 

ఏపీకి అదనంగా 8 బొగ్గు రైళ్లు

జూన్‌ వరకూ 400 మెగావాట్ల విద్యుత్‌ ఇవ్వాలని కేంద్రానికి వినతి

రెండు థర్మల్‌ ప్లాంట్లలో 800 మెగావాట్ల ఉత్పత్తి ప్రారంభం

పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపు

సకాలంలో నిర్ణయాలతో సత్ఫలితాలు.. ముందుగానే ప్రధానికి సీఎం వైఎస్‌ జగన్‌ లేఖ

సాక్షి, అమరావతి: అదిగో పులి.. ఇదిగో తోక లాంటి బెదిరింపులు, కట్టు కథలతో ప్రజలను ఆందోళనకు గురిచేస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యుత్‌ వ్యవస్థపై వదంతులు సృష్టించే ప్రయత్నం జరుగుతోంది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, కోవిడ్‌ ప్రభావం తగ్గి పారిశ్రామిక విద్యుత్‌ వినియోగం పెరగడం, డిమాండ్‌ – సరఫరాలో వ్యత్యాసం తదితర పరిణామాలతో దేశవ్యాప్తంగా బొగ్గు కొరతతో విద్యుత్‌ సంక్షోభం ఏర్పడే పరిస్థితులను ముందుగానే గమనించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 8వతేదీన ప్రధాని మోదీకి లేఖ రాయడం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా బొగ్గు కొరత దృష్ట్యా విద్యుత్తు సంక్షోభాన్ని పరిష్కరించేందుకు తక్షణమే స్పందించాలని కోరారు. ఏపీలోని 2,300 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన గ్యాస్‌ ఆధారిత ప్లాంట్లకు ఓఎన్‌జీసీ, రిలయన్స్‌ నుంచి అత్యవసరంగా గ్యాస్‌ సరఫరాకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ క్రమంలో పరిస్థితిని ఊహించి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో తీసుకున్న నిర్ణయాలు, బొగ్గు కొనుగోలుకు అత్యవసర నిధులను వెచ్చించడం, ముందస్తుగా చేపట్టిన చర్యల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం బొగ్గు సంక్షోభం ఏర్పడలేదు. కానీ దసరా తరువాత రాష్ట్రవ్యాప్తంగా భారీగా విద్యుత్‌ కోతలుంటాయని, ముఖ్యంగా రాత్రి వేళ గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో గంటల తరబడి చీకట్లు తప్పవంటూ సోషల్‌ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. శనివారం ఉదయం నుంచి ఈ తరహా వదంతులతో రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురి చేసే ప్రయత్నాలు జరిగాయి. 
రాత్రి సమయంలో విజయవాడ ఇలా.. 

లోటు.. లేదు
విద్యుత్‌ కోతలంటూ జోరుగా జరుగుతున్న ప్రచారంపై స్పందించిన విద్యుత్తు శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులు, డిస్కమ్‌ల సీఎండీలు అది పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు లేవని స్పష్టం చేశారు. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఈనెల 10వతేదీ నుంచి 14 వరకు విద్యుత్‌ లోటు సగటున రోజుకు 1.22 మిలియన్‌ యూనిట్ల కంటే తక్కువగానే ఉంది. పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో విద్యుత్‌ లోటు మన దగ్గర కంటే ఎక్కువగా ఉంది.

అక్టోబర్‌ 14న ఏపీలో 0.76 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ లోటు ఉండగా మరుసటి రోజు నాటికి అది కూడా పోయి లోటు పూర్తిగా జీరో అయ్యింది. దీంతో రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు లేకుండా డిస్కమ్‌ పూర్తి స్థాయిలో విద్యుత్‌ పంపిణీ చేయగలుగుతున్నాయి. రానున్న రోజుల్లో కూడా రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు ఉండవని విద్యుత్‌ శాఖ హామీ ఇచ్చింది. కోతలపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించింది. విద్యుత్‌ సరఫరాపై తప్పుడు వార్తలను నమ్మవద్దని వినియోగదారులకు ఇంధనశాఖ విజ్ఞప్తి చేసింది. 

రాష్ట్ర అత్యవసర నిధులతో తీరుతున్న బొగ్గు కొరత
ఇంధనశాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం బొగ్గు కొనుగోలు కోసం ఏపీ జెన్‌కోకు రూ.250 కోట్ల మేర అత్యవసర నిధులను రాష్ట్ర ప్రభుత్వం అందించింది. దీంతో థర్మల్‌ విద్యుదుత్పత్తి మెరుగు పరచేందుకు రాష్ట్రానికి అదనంగా ఎనిమిది బొగ్గు రైళ్లు తరలి వస్తున్నాయి. వీటీపీఎస్‌లో 13,097 మెట్రిక్‌ టన్నుల బొగ్గు ఉండగా శనివారం 29,806 మెట్రిక్‌ టన్నులు వచ్చింది. దీనిలో 25,410 మెట్రిక్‌ టన్నులు వినియోగించగా ఇంకా 17,493 మెట్రిక్‌ టన్నులు నిల్వ ఉన్నాయి. ఆర్‌టీపీఎస్‌లో 70,411 మెట్రిక్‌ టన్నుల బొగ్గుకు అదనంగా 19,457 మెట్రిక్‌ టన్నులు తెప్పించారు.

ఇందులో 12,925 మెట్రిక్‌ టన్నులు వినియోగించగా ఇంకా 76,943 మెట్రిక్‌ టన్నులు ఉంది. కృష్ణపట్నంలో 68,459 మెట్రిక్‌ టన్నులు ఉండగా 8,533 మెట్రిక్‌ టన్నులు వినియోగించారు. ఇంకా 59,926 మెట్రిక్‌ టన్నుల బొగ్గు నిల్వ ఉంది. ఈ నిల్వలతో మరో మూడు నాలుగు రోజుల పాటు విద్యుదుత్పత్తి చేయవచ్చు. దీనికితోడు వచ్చే ఏడాది జూన్‌ వరకూ 400 మెగావాట్ల విద్యుత్‌ ఇవ్వాల్సిందిగా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. మరోవైపు బహిరంగ మార్కెట్లో విద్యుత్‌ కొనుగోలు ధరలు శుక్రవారం రూ.20 నుంచి రూ.6.11కి పడిపోవడం గమనార్హం. ఇది మరింత తగ్గే అవకాశం కూడా ఉంది. సాధారంగా యూనిట్‌ రూ.4 నుంచి రూ.5కు లభించే విద్యుత్‌ ఈ నెల 8వతేదీ తరువాత రూ.15 – రూ.20 వరకూ పెరిగినా తాజాగా తగ్గుముఖం పట్టింది.

ఆర్టీపీఎస్, కృష్ణపట్నంలో 800 మెగావాట్ల ఉత్పత్తి ప్రారంభం
ఏపీ జెన్‌కో యూనిట్లను పూర్తి సామర్థ్యంతో నిర్వహించాలని, థర్మల్‌ విద్యుదుత్పత్తి కేంద్రాల్లో బొగ్గు నిల్వలను మెరుగుపరచాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల ఇంధనశాఖను ఆదేశించారు. థర్మల్‌ ప్లాంట్లలోని కొత్త యూనిట్లలో విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభించి రాష్ట్రానికి 1,600 మెగావాట్లు అందుబాటులోకి తెచ్చేలా తక్షణం చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రానికి బొగ్గు సరఫరాను మెరుగుపరచడానికి సింగరేణి, కేంద్ర ప్రభుత్వ సంస్థలతో చర్చించి సమన్వయం చేసుకోవాలని నిర్దేశించారు. ముఖ్యమంత్రి జగన్‌ సూచనల మేరకు రాయలసీమ థర్మల్‌ పవర్‌ స్టేషన్, దామోదరం సంజీవయ్య థర్మల్‌ పవర్‌ స్టేషన్లలో ఈనెల 15న అధికారులు 800 మెగావాట్ల విద్యుదుత్పత్తిని ప్రారంభించారు. 

నిరంతర పర్యవేక్షణ
విద్యుత్తు శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్‌ నిరంతరం విద్యుత్‌ సరఫరాను పర్యవేక్షిస్తున్నారు. నగరాల నుంచి గ్రామ స్థాయి వరకు విద్యుత్‌ సరఫరాను సమీక్షిస్తూ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ నుంచి సీఎండీ స్థాయి వరకూ అందరూ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఈ క్రమంలో డిస్కమ్‌ల సీఎండీలు హెచ్‌.హరనాథరావు, జె.పద్మజనార్ధనరెడ్డి, కె.సంతోష్‌రావు, డైరెక్టర్‌/గ్రిడ్‌ – ట్రాన్స్‌మిషన్, కె.ప్రవీణ్‌కుమార్, సీఈ/గ్రిడ్, ఏవీ భాస్కర్‌లతో ఇంధన శాఖ కార్యదర్శి శనివారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్ర ఇంధన పర్యవేక్షక మిషన్‌ సీఈవో ఏ.చంద్రశేఖరరెడ్డి ఆ వివరాలను వెల్లడించారు. 

సీఎం సూచనల ప్రకారం..
రాష్ట్రంలో నిత్యం 185 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం ఉండగా గత 16 రోజులుగా సగటున రోజుకు ఒక మిలియన్‌ యూనిట్‌ కంటే తక్కువగానే లోటు ఉందని ఇంధన శాఖ కార్యదర్శి తెలిపారు. పదహారు రోజులకు కేవలం పది మిలియన్‌ యూనిట్లు మాత్రమే లోటు నమోదైందన్నారు. దీంతో లోడ్‌ రిలీఫ్‌లు చాలా తక్కువగానే విధించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధత, పవర్‌ యుటిలిటీల అద్భుత పనితీరుతో నాణ్యమైన సరఫరా జరుగుతోందన్నారు.

బొగ్గు కొరతను అధిగమించి నాణ్యమైన విద్యుత్‌ సరఫరా కొనసాగేలా వెంటనే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. సీఎం సూచనల ప్రకారం తగిన చర్యలు చేపట్టడం వల్ల ఆంధ్రప్రదేశ్‌ ఎలాంటి విద్యుత్‌ కోతలను ఎదుర్కోవడం లేదని, రాబోయే రోజుల్లో కూడా కోతలు ఉండవని భరోసా ఇచ్చారు. అన్ని వర్గాల వినియోగదారులకు రోజంతా నాణ్యమైన విద్యుత్‌ అందించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. రాష్ట్రంలో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు సరఫరా గణనీయంగా పెరిగినట్లు ఏపీ జెన్‌కో ఎండీ  శ్రీధర్‌ వివరించారు.

నమ్మొద్దు.. మేమే చెబుతాం
–విద్యుత్‌ పంపిణీ సంస్థలు
సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్న వదంతులను నమ్మవద్దని ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్‌), ఆంధ్రప్రదేశ్‌ మధ్యప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్‌), ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్‌) వినియోగదారులకు విజ్ఞప్తి చేశాయి. విద్యుదుత్పత్తికి అవసరమైన బొగ్గు నిల్వలను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చడం వల్ల సరఫరాలో అంతరాయాలు, కోతలు లేవని స్పష్టం చేశాయి. విద్యుత్‌ సరఫరా పరిస్థితిపై ఎలాంటి సమాచారానైన్నా సామాజిక మాధ్యమాల ద్వారా కాకుండా ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియా ద్వారా వినియోగదారులకు అధికారికంగా తెలియచేస్తామని ప్రకటించాయి.

మరిన్ని వార్తలు