ఏపీ: ఆలయాల్లో ప్రభుత్వ కోవిడ్‌ కేర్‌ సెంటర్లు

15 May, 2021 10:35 IST|Sakshi

సాక్షి, అమరావతి: కోవిడ్‌ విపత్తు వేళ రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ దేవాలయాల్లో కోవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 16 పెద్ద ఆలయాల ఆధ్వర్యంలో వెయ్యి పడకలతో కోవిడ్‌ కేర్‌ సెంటర్లను అందుబాటులోకి తెచ్చినట్టు దేవదాయ శాఖ వర్గాలు తెలిపాయి. ఒకట్రెండు చోట్ల చిన్న కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో 25 వరకు బెడ్‌లను, చాలాచోట్ల వంద వరకు బెడ్లను ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో మూడు/నాలుగు ఆక్సిజన్‌ పడకలను సిద్ధంగా ఉంచారు.

వైద్యుల పర్యవేక్షణ నుంచి ప్రాథమిక చికిత్స వరకు..
కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో వైద్యుల పర్యవేక్షణలో రోగులకు ప్రాథమిక చికిత్స అందించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణస్వామి ఆలయం, పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం, విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో ఇప్పటికే వైద్య సేవలు ప్రారంభమయ్యాయి.

వీటితోపాటు శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్యనారాయణస్వామి ఆలయం, విశాఖ జిల్లా సింహాచలం, గుంటూరు జిల్లా పెదకాకాని, ప్రకాశం జిల్లా సింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయం, నెల్లూరు జిల్లా జొన్నవాడ ఆలయం, కర్నూలు జిల్లా శ్రీశైలం, మహానంది, ఉరుకొంద ఆలయాలు, వైఎస్సార్‌ జిల్లా గండి, అనంతపురం జిల్లా కసాపురం, చిత్తూరు జిల్లా కాణిపాకం, శ్రీకాళహస్తి, చౌడేపల్లి మండలం దిగువపల్లి ఆలయాల ఆధ్వర్యంలో కోవిడ్‌ కేర్‌ సెంటర్ల ఏర్పాటు దాదాపు పూర్తయినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.

చదవండి: ఏపీ: జూన్‌ 22న వైఎస్సార్‌ చేయూత 
పలు రైళ్ల దారి మళ్లింపు 

మరిన్ని వార్తలు