‘అనంత’లో ప్రభుత్వ ఉద్యోగుల కృతజ్ఞతా ర్యాలీ

19 Sep, 2022 06:30 IST|Sakshi
అభివాదం చేస్తున్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర చైర్మన్‌ కాకర్ల వెంకట్రామిరెడ్డి తదితరులు

ఉద్యోగాలు, పదోన్నతులు ఇస్తున్నందుకు సీఎం జగన్‌కు ధన్యవాదాలు  

అనంతపురం: అనంతపురంలో ప్రభుత్వ ఉద్యోగులు ఆదివారం పెద్ద ఎత్తున ‘కృతజ్ఞతా ర్యాలీ’ నిర్వహించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సచివాలయ సిబ్బంది భారీ సంఖ్యలో పాల్గొని ‘థ్యాంక్యూ సీఎం సార్‌’ అంటూ నినదించారు. కోవిడ్‌ సంక్షోభంలోనూ ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి సీఎం జగన్‌ కృషి చేశారని కొనియాడారు. అనంతరం జరిగిన సమావేశంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర చైర్మన్‌ కాకర్ల వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి లక్షకు పైగా ఉద్యోగాలిచ్చారని చెప్పారు.

పాతికేళ్లుగా పదోన్నతులు దక్కని ఎంపీడీవోల కల నెరవేర్చారని పేర్కొన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసి వారి భవిష్యత్‌కు భరోసా కల్పించారన్నారు. పాలిటెక్నిక్‌ అధ్యాపకులకు పీఆర్సీతో అండగా నిలిచారన్నారు. వేలాది మంది వీఆర్‌ఏ, వీఆర్‌వోలకు పదోన్నతులిచ్చారని గుర్తు చేశారు. 1998, 2018 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించారని పేర్కొన్నారు. ఇప్పుడు ప్రతి మండలానికీ ఇద్దరు ఎంఈవోలను నియమిస్తూ.. టీచర్లకు పదోన్నతులు కల్పిస్తున్నారని చెప్పారు.

ఇంతగా మేలు చేస్తున్న ముఖ్యమంత్రి వెన్నంటే ఉండి.. కృతజ్ఞతలు తెలపడం ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యతని అన్నారు. కాగా, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న తనకు మద్దతుగా నిలవాలని పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి కోరారు. కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య, వైఎస్సార్‌టీఎఫ్, పీఆర్టీయూ, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం, పాలిటెక్నిక్‌ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు