ఇక 'వాడ'వాడలా గుడిగంటలు

13 Jun, 2021 05:42 IST|Sakshi

రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల నిర్మాణానికి సర్కారు కసరత్తు 

ఎస్సీ, మత్స్యకార కాలనీ, తండాలు, బీసీ కాలనీలకు ప్రాధాన్యత  

సాక్షి, అమరావతి/విజయవాడ: రాష్ట్రంలో పెద్దఎత్తున ఆలయాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎస్సీ, మత్స్యకార కాలనీలు, గిరిజన తండాలతో పాటు ఇతర వెనుకబడిన ప్రాంతాల్లో వీటిని నిర్మించనుంది. ఇందుకోసం ఒక్కో ఆలయానికి గరిష్టంగా రూ.10 లక్షల వరకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిధులు అందజేయనుంది. ఇప్పటివరకు ఒక్క ఆలయం కూడా లేనిచోట్ల కొత్తగా ఆలయ నిర్మాణానికి ప్రాధాన్యతనిచ్చి నిధులు విడుదల చేస్తారు. ఇందులో భాగంగా దేవదాయ శాఖ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దీనికి సంబంధించి దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్, ప్రత్యేక కమిషనర్‌ అర్జునరావు డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్‌ కమిషనర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. భక్తుల మనోభావాల మేరకు రామాలయం, వేంకటేశ్వరస్వామి, శివాలయం, గ్రామదేవతల మొదలు ఏ ఇతర హిందూ ఆలయాల నిర్మాణానికైనా నిధులు అందజేస్తారు. ఇందుకోసం దేవదాయశాఖ పలు నియమ నిబంధనలు రూపొందించింది. అవి.. 

► ఆలయ నిర్మాణానికి గ్రామస్తులు పది సెంట్ల స్థలాన్ని సమకూర్చాలి. స్థలాన్ని ఎవరైనా దాత ఇచ్చినట్లయితే, రూ.100 స్టాంపు పేపరుపై అతని సమ్మతిని తెలియజేయాలి. దేవదాయ శాఖ, టీటీడీ అధికారులు స్థలాన్ని పరిశీలించి, ఆలయ నిర్మాణానికి అనుమతిస్తారు. తర్వాత ఆలయ నిర్మాణ పురోగతి ఆధారంగా ఐదు విడతల్లో నిధులు విడుదల చేస్తారు.  
► టీటీడీ, దేవదాయ శాఖ రూపొందించిన డిజైన్‌లో మాత్రమే ఆలయ నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. ప్రతి గుడిలోనూ గర్భాలయం, ఆరాధన మండపంతోపాటు భక్తులు కూర్చుని భజనలు చేసుకునేందుకు వీలుగా 13.3 అడుగుల వెడల్పు, 13.3 అడుగుల పొడవుతో మరో మండపాన్ని ఉండేలా డిజైన్‌ చేశారు.  
► దేవాలయం నిర్మాణానికి గ్రామస్తులు కమిటీగా ఏర్పడాలి. ఆలయ నిర్మాణానికే టీటీడీ నిధులు సమకూర్చుతుంది. 
► గ్రామాల్లోని దళితవాడలు, ట్రైబల్‌ ఏరియా, మత్స్యకార కాలనీలు, వెనుకబడిన ప్రాంతాల్లో ఎలాంటి ఆలయాలు లేకపోతే ప్రాధాన్యత ఇస్తారు.  

మరిన్ని వార్తలు