మార్చి నాటికి నాగావళిలోకి వంశధార పరవళ్లు

17 Nov, 2020 20:06 IST|Sakshi

వేగంగా అనుసంధానం పనులు 

నారాయణపురం ఆనకట్ట కింద 39,179 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ

హెచ్చెల్సీతో కొత్తగా ఐదు వేల ఎకరాలకు సాగునీరు

సాక్షి, అమరావతి: నదుల అనుసంధానం ద్వారా సముద్రంలో కలుస్తున్న వరద జలాలను ఒడిసి పట్టి ఆయకట్టుకు నీళ్లందించే పనులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో భాగంగా రూ.145.34 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ‘వంశధార-నాగావళి’ నదుల అనుసంధానం పనులను మార్చిలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. తద్వారా నారాయణపురం ఆనకట్ట కింద 39,179 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు హైలెవల్‌ కెనాల్‌ ద్వారా కొత్తగా ఐదు వేల ఎకరాలకు నీళ్లందించి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల అభివృద్ధికి బాటలు వేయాలని నిర్ణయించింది. 

ఏటా 100 టీఎంసీలు వృథా
గత మూడు దశాబ్దాల గణాంకాలను పరిశీలిస్తే గొట్టా బ్యారేజీ నుంచి ఏటా సగటున వంద టీఎంసీల వంశధార జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. నాగావళి నదిలో వరద ఆలస్యంగా రావడం, నారాయణపురం ఆనకట్ట నీటి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల ఆయకట్టుకు నీళ్లందించడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే వంశధార ప్రాజెక్టు స్టేజ్‌-2.. ఫేజ్‌-2లో కాట్రగడ్డ సైడ్‌ వియర్‌ నుంచి హిరమండలం రిజర్వాయర్‌కు తరలించిన వంశధార నీటిని, ఆ రిజర్వాయర్‌ మట్టికట్ట వద్ద నుంచి హెచ్చెల్సీ (హైలెవల్‌ కెనాల్‌) తవ్వి రోజుకు 600 క్యూసెక్కులను నారాయణపురం ఆనకట్టకు ఎగువన నాగావళి నదిలోకి పోయడం ద్వారా ఆ రెండు నదుల అనుసంధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

► హిరమండలం రిజర్వాయర్‌ నుంచి తవ్వాల్సిన 33.583 కి.మీ.ల హెచె​‍్చల్సీ పనులకు గాను 25 కి.మీ.ల మేర తవ్వకం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. మిగిలిన 8.583 కి.మీ.ల కాలువ పనులు పూర్తి చేయడానికి 4,87,740 క్యూబిక్‌ మీటర్ల మట్టిని తవ్వాల్సి ఉండగా.. అధికారులు పనులు వేగవంతం చేశారు.
► హెచ్చెల్సీలో అక్విడెక్టులు, అండర్‌ టన్నెల్స్‌ (యూటీ) బ్రిడ్జిలు వంటివి 66 నిర్మాణాలను చేపట్టాలి. ఇందులో ఇప్పటికే 31 నిర్మాణాలను పూర్తి చేశారు. మిగిలిన 35 నిర్మాణాలను పూర్తి చేయాలంటే 49,608 క్యూబిక్‌ మీటర్ల మేర కాంక్రీట్‌ పనులు చేయాల్సి ఉండగా ఆ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. 
► వచ్చే ఖరీఫ్‌లో నారాయణపురం ఆనకట్టకు నీళ్లందించడం ద్వారా రైతులకు నదుల అనుసంధానం ఫలాలను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మరిన్ని వార్తలు