దివ్యాంగులకు వరం.. యూడీ కార్డ్‌

13 Aug, 2021 09:19 IST|Sakshi

ఏలూరు (టూటౌన్‌): దివ్యాంగులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకూడదనే సంకల్పంతో ప్రభుత్వం తీసుకువచ్చిన యూడీ ఐడీ (యూనిక్‌ డిజెబిలిటీ ఐడెంటిటీ కార్డ్‌) వారికి వరంగా మారింది. ఏదోక వైకల్యం ఉన్న వారు ఎక్కడికైనా వెళ్లాలంటే తమ వద్ద ఉన్న అర్హత పత్రాలు అన్నింటినీ గతంలో వెంట తీసుకెళ్లాల్సిన పరిస్థితి. ఈ సమయంలో పొరపాటున ఏదైనా పత్రం పోతే తిరిగి దాన్ని పొందేందుకు అనేక అవస్థలు పడాల్సి వచ్చేది. ఈ సమస్యలు లేకుండా దివ్యాంగులకు మేలు చేయాలనే లక్ష్యంతో యూడీ ఐడీ కార్డును ప్రభుత్వాలు అందుబాటులోకి తీసుకువచ్చాయి. 

అర్హులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు  
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ లెక్కల ప్రకారం 54,052 మంది దివ్యాంగులు ఉన్నారు. వీరందరికీ యూడీ కార్డులను జారీ చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయ సాధికార మంత్రిత్వ శాఖ నుంచి జిల్లా కేంద్రంలోని దివ్యాంగుల సంక్షేమ శాఖకు ఆదేశాలు అందాయి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. యూనిక్‌ గుర్తింపు కార్డులో దివ్యాంగుని పేరు, గుర్తింపు సంఖ్య, పుట్టిన తేదీ, వైకల్య శాతం, జారీ చేసిన తేదీ, కార్డు ఎప్పటివరకూ పనిచేస్తుంది, కార్డు వెనుక వైపు సదరం గుర్తింపు ఐడీ నంబర్, క్యూఆర్‌ కోడ్‌ ముద్రించి ఉంటుంది. దీనిని కోడింగ్‌ చేస్తే పూర్తి వివరాలు ప్రత్యక్షమవుతాయి. ఇప్పటివరకూ జిల్లా వ్యాప్తంగా తొలి, మలి విడతల్లో 9,984 గుర్తింపు కార్డులు మంజూరు చేశారు. కార్డుల మంజూరు ప్రక్రియ నిరంతరంగా జరుగుతుంది. 
దరఖాస్తు విధానం ఇలా.. 
https://www.swavlambancard.gov.in అనే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్‌లైఫర్‌ సర్టిఫికెట్‌ ఆప్షన్‌ మీద క్లిక్‌ చేయాలి. తరువాత దివ్యాంగుడి వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలి. రెండో కాలమ్‌లో చిరునామా, గుర్తింపు కార్డు వివరాలు, శాశ్వత చిరునామా పొందుపర్చాలి. మూడో కాలమ్‌లో వైకల్య వివరాలు, నాలుగో కాలమ్‌లో ఎంప్లాయిమెంట్, దివ్యాంగుని గుర్తింపు వివరాలు నమోదు చేయాలి. ఫొటో, వేలిముద్ర లేక సంతకం చేసి అప్‌లోడ్‌ చేసి సబ్‌మిట్‌ చేయాలి. దరఖాస్తు పూర్తయిన తరువాత పరిశీలించి గుర్తింపు కార్డులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. 

ఇప్పటివరకు 9,984 కార్డులు మంజూరు 
జిల్లాలో ఇప్పటివరకూ 9,984 యూడీ కార్డులు మంజూరు చేశాం. దివ్యాంగులకు సంబంధించిన అన్ని వివరాలు ఒకే కార్డులో పొందుపర్చడం వల్ల వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. జిల్లాలోని అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలి. దీనిపై ఎటువంటి సందేహాలు ఉన్నా జిల్లా కేంద్రం ఏలూరులోని కలెక్టరేట్‌ కాంపౌండ్‌లో ఉన్న మా కార్యాలయానికి వచ్చి వివరాలు తెలుసుకోవచ్చు. 
– ఎం.ఝాన్సీరాణి, సహాయ సంచాలకులు, వికలాంగుల సంక్షేమ శాఖ  

మరిన్ని వార్తలు