ప్రసవానంతరం తల్లీబిడ్డలు సురక్షితంగా ఇంటికి..

22 Jul, 2021 02:59 IST|Sakshi

ఉచిత రవాణా ఉపయోగించుకున్నవారు 77.83 శాతం 

2.67 లక్షల మంది గర్భిణులకు ప్రభుత్వ వైద్యసేవలు  

సాక్షి, అమరావతి:  గర్భిణులకు ఉచిత వైద్యసదుపాయం కల్పించడమేగాక ప్రసవానంతరం తల్లీబిడ్డలను సురక్షితంగా ఇంటి వద్దకు పంపించే సేవలను కూడా ప్రభుత్వం సమర్థంగా నిర్వర్తిస్తోంది. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవమయ్యే మహిళల్లో ఎక్కువమంది ఇంటికి వెళ్లేందుకు ప్రభుత్వ రవాణాను ఉపయోగించుకున్నారు. 2020–21 సంవత్సరంలో 2,20,731 మంది బాలింతలు అంటే మొత్తం డెలివరీల్లో 77.83 శాతం మంది తల్లీబిడ్డలు ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లేందుకు ప్రభుత్వ ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నట్లు తాజా గణాంకాల్లో వెల్లడైంది. ప్రతి ఆస్పత్రిలోను బాలింతను డిశ్చార్జి చేసే సమయానికి వైద్యులే వాహనాలను సిద్ధం చేసి తల్లీబిడ్డలను సురక్షితంగా ఇంటికి చేరుస్తున్నారు.

ప్రసవానంతరం ప్రభుత్వం ఇచ్చే పోషకాహారాన్ని 2.66 లక్షల మంది బాలింతలు వినియోగించుకున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో గర్భిణులుగా నమోదు చేసుకుని ఉచిత వైద్యపరీక్షలు, రక్తపరీక్షలు చేయించుకున్న వారు 2,67,069 మంది ఉన్నారు. ప్రసవానికి వెళ్లేందుకు ఉచిత రవాణా అంటే 108 వాహనాలను 48.45 శాతం మందే ఉపయోగించుకున్నారు. దీన్ని మరింతగా పెంచాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. పురిటినొప్పుల సమయంలో 108కు కాల్‌చేస్తే 15 నిమిషాల్లోనే ఇంటిదగ్గరకు వస్తుందని, ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవం అయ్యే మహిళలకు సంబంధించిన వివరాలను ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు పంపించాలని ట్రస్ట్‌ సీఈవో అన్ని ఆస్పత్రులకు లేఖ రాసిన విషయం తెలిసిందే. ప్రసవాలకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని కూడా ఆయన ఆ లేఖలో స్పష్టం చేశారు.   

మరిన్ని వార్తలు