గిరిపుత్రులకు భూ హక్కు 

13 Sep, 2020 10:18 IST|Sakshi

ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాల పంపిణీకి రంగం సిద్ధం 

ఐటీడీఏ పరిధిలోని 8 సబ్‌ప్లాన్‌ మండలాల్లో చురుగ్గా సర్వే 

అక్టోబర్‌ 2వ తేదీ నాటికి పట్టాల పంపిణీకి చర్యలు 

ఇప్పటికే 5984 మందిని గుర్తించిన అధికారులు 

కురుపాం: దశాబ్దాలుగా వారు పోడు వ్యవసాయం చేస్తున్నారు. కానీ వాటిపై హక్కు మాత్రం పొందలేకపోతున్నారు. ఏదైనా ప్రకృతి విపత్తు వల్ల పంట నష్టపోతే వారికి ఏ విధమైన పరిహారమూ అందేది కాదు. దీనివల్ల ఏడాది పొడవునా వారు పడిన శ్రమ వృధా అవుతుండేది. ఈ సమస్యలన్నీ ప్రజాసంకల్పయాత్ర సందర్భంగా ఈ ప్రాంతానికి వచ్చిన వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తెలుసుకుని వారికి శాశ్వత ప్రాతిపదికన న్యాయం చేస్తానని ఆనాడే హామీ ఇచ్చారు. ఈ మేరకు అధికారంలోకి వచ్చిన తరువాత అడవుల్లో పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజన రైతులందరికీ భూమి హక్కు పత్రాలు(పట్టాలు) ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రంలో పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజన రైతులకు 50 వేల ఎకరాలు పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టారు.  

నాడు రాజన్న... నేడు జగనన్న 
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి రైతును రాజు చేయాలన్న సంకల్పంతో పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులందరికీ భూమి హక్కు పత్రాలిచ్చారు. ఆ తరువాత వచ్చిన పాలకులు మిగతా వారిగురించి పట్టించుకోలేదు. మళ్లీ ఆయన తనయుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అధికా రం చేపట్టిన తరువాత గిరిజనుల సమస్యపై దృష్టి పెట్టారు. అటవీశాఖ అధికారుల నుంచి ఇబ్బందులు ఎదురవకుండా పోడు వ్యవసాయం చేస్తున్న రైతులందరికీ ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ (రికార్డు ఆఫ్‌ ఫారెస్ట్‌ రైట్స్‌) కింద పట్టాలివ్వాలని ఆదేశించారు. పోడు భూముల్లో ఎవరు సాగు చేస్తే వారికే పట్టాలు ఇవ్వాలని, భూమి లేని వారికి కూడా భూమిని మంజూరు చేయాలని సూచించారు. 

ప్రభుత్వ సాయం పొందేందుకు అర్హత 
గిరిజనులకు ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం నుంచి సాయం పొందేందుకు వీలవుతుంది. ప్రభుత్వం ఇప్పటికే రైతు భరోసా కార్యక్రమాన్ని చేపట్టి పెట్టుబడి సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలు పొందిన రైతులు సైతం రైతు భరోసా పథకం ద్వారా లబి్ధపొందనున్నారు. బ్యాంకు రుణాలు పొందే అవకాశం ఉంది. వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2,22,383.02 ఎకరాల భూమిని పంపిణీ చేయడం ద్వారా 88,991 మంది రైతులకు ప్రయోజనం కలిగింది. వారికి ఇప్పటివరకూ అటవీ అధికారుల నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా వ్యవసా యం చేసుకోగలుగుతున్నారు. 

ఐటీడీఏ పరిధిలో 11,784 ఎకరాలు సిద్ధం  
పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని ఎనిమిది సబ్‌ప్లాన్‌ మండలాల్లో రెండవ ఫేజ్‌లో భూమి లేని వారిని గుర్తించారు. మొత్తం 8 సబ్‌ప్లాన్‌ మండలాల్లో 5,984 మందిని గుర్తించి వారికి 11,784 ఎకరాలను గాంధీజయంతి రోజైన అక్టోబర్‌ 2వ తేదీన పంపిణి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఐటీడీఏ పీఓ ఆర్‌.కూర్మనాథ్, రెవెన్యూ సిబ్బంది చురుగ్గా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే భూమిని గుర్తించటంతోపాటు ఆన్‌లైన్‌లో నమోదు చేసి, సరిహద్దుల వద్ద రాళ్లను కూడా పాతిపెట్టేందుకు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టారు.  

చురుగ్గా చర్యలు  
ఉన్నతాధికారుల సూచనల మేరకు ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ భూ పంపిణీకి చురుగ్గా చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే భూమి లేని వారిని గుర్తించి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశాం. గుర్తించి ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ భూముల వద్ద సరిహద్ధు రాళ్లను కూడా పాతిపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. అక్టోబర్‌ 2వ తేదీ నాటికి భూమి లేని గిరిజనులందరికీ భూ పట్టాలు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.
– హెచ్‌.రమణారావు, ఇన్‌చార్జ్‌ తహసీల్దార్, కురుపాం 

కుటుంబానికి ఆసరా
ప్రభుత్వం పంపిణీ చేయనున్న భూమి నా కుటుంబ పోషణకు ఆసరాగా నిలుస్తుంది. కురుపాం పంచాయతీ పరిధి టేకరఖండి గిరిజన గ్రామంలో లేని నాకు ఎకరా 27 సెంట్ల భూమి మంజూరు చేసినట్లు, భూ పట్టాలను కూడా పంపిణీ చేయనున్నట్టు రెవెన్యూ అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి రుణ పడి ఉంటాం.
– ఆరిక రాము, కురుపాం 

గతంలో దరఖాస్తు చేసినా పట్టించుకోలేదు 
ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ భూమి కోసం పలుమార్లు గత ప్రభుత్వం హయాంలో వినతులు సమర్పించినా ఎవరూ స్పందించలేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నేరుగా భూమి లేని రైతులకు భూమిని మంజూరు చేయటమే కాకుండా వాటిపై రైతు భరోసా, రుణాలు సైతం వచ్చేలా చర్యలు తీసుకోవడం సంతోషంగా ఉంది.
– ఆరిక శ్రీనివాసరావు, టేకరఖండి, కురుపాం మండలం   

మరిన్ని వార్తలు