అంతర్వేది: కొత్త రథం నిర్మాణ డిజైన్లు ఖరారు

15 Sep, 2020 09:09 IST|Sakshi

పాత రథం నమూనాలోనే అంతర్వేది ఆలయ కొత్త రథం డిజైన్‌కు ఆమోదం..

సాక్షి, అమరావతి: పాత రథం నమూనాలోనే అంతర్వేది ఆలయ కొత్త రథం నిర్మాణ డిజైన్లను దేవదాయ శాఖ ఖరారు చేసింది. 41 అడుగుల ఎత్తు, ఆరడుగుల వెడల్పుతో ఏడంతస్తుల్లో ఆలయ రథం ఉంటుంది. అంతర్వేది ఆలయ రథం నిర్మాణానికి సంబంధించి దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సోమవారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక కమిషనర్‌ అర్జునరావుతో సమీక్షించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణోత్సవాలు జరగనున్నాయని.. అప్పటిలోగా కొత్త రథ నిర్మాణ ప్రక్రియ పూర్తి కావాలని మంత్రి ఆదేశించారు. ఆరు చక్రాలతో కూడిన కొత్త రథం నిర్మాణంతో పాటు, రథశాల మరమ్మతులకు రూ.95 లక్షలు ఖర్చవుతుందని అంచనా వేసినట్టు వివరించారు.  

అంతర్వేదిలో దర్శనాలు నిలుపుదల
సఖినేటిపల్లి: తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీలక్ష్మీనృసింహస్వామి వారి ఆలయంలో ఈ నెల 20 వరకు అధికారులు దర్శనాలను నిలిపివేశారు. అంతర్వేది, పరిసర ప్రాంతాల్లో కరోనా ఉధృతి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ యర్రంశెట్టి భద్రాజీ సోమవారం తెలిపారు. స్వామి వారికి నిత్యం జరిగే కైంకర్యాలు ఏకాంతంగా అర్చకులు నిర్వహిస్తారని చెప్పారు.

చదవండి: టీడీపీ దుష్ర్పచారాన్ని నమ్మొద్దు

మరిన్ని వార్తలు