NPCI: మీ బ్యాంకు ఖాతాలో నగదు జమ కావడం లేదా..? కారణం ఇదే..

29 Jun, 2022 15:02 IST|Sakshi

పెదవాల్తేరు(విశాఖపట్నం): ఎన్‌పీసీఐ ఈ మాట సచివాలయాలలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల కింద సొమ్ముని బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుండడం తెలిసిందే. ఎన్‌పీసీఐ అనుసంధానం ఉన్న బ్యాంకు ఖాతాలలో మాత్రమే పథకాల సొమ్ము జమ అవుతుంది. చాలా మందికి ఈ విషయం తెలియక తమ బ్యాంకు ఖాతాలలో ఎందుకు సొమ్ము పడలేదంటూ సచివాలయాలకు ప్రదక్షిణలు చేస్తున్నారు. అక్కడ వార్డు వలంటీర్లు, సంక్షేమ కార్యదర్శులు బ్యాంకులో ఎన్‌పీసీఐ అనుసంధానం ఉన్న ఖాతాలకే సొమ్ము పడుతుందని చెప్పడంతో బ్యాంకులకు పరుగులు తీస్తున్నారు. ఇంతకీ ఎన్‌పీసీఐ అంటే నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా అని అర్థం.
చదవండి: దేశ చరిత్రలోనే ఇది ఒక అరుదైన ఘట్టం

ఒక వ్యక్తికి ఒక బ్యాంకు ఖాతా మాత్రమే ఉంటే ఎన్‌పీసీఐ అనుసంధానం ద్వారా ఆయా పథకాల సొమ్ము ప్రయోజనాలు నేరుగా సదరు ఖాతాలోనే జమ అవుతాయి. కానీ, కొంత మందికి ఒకటి కన్నా రెండు లేదా అంతకన్నా ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉంటాయి. అప్పుడు సమస్య వస్తుంది. వాస్తవానికి ఇన్ని ఖాతాలలో ఏదో ఒక ఖాతాకు మాత్రమే బ్యాంకులో ఎన్‌పీసీఐ అనుసంధానం చేసి ఉంటారు. కానీ లబ్ధిదారులు మాత్రం అమ్మ ఒడి, చేయూత, వాహన మిత్ర, కాపు నేస్తం తదితర పథకాల కింద పేర్లు నమోదు సమయంలో తెలియక వేరే బ్యాంకు ఖాతాలు ఇస్తుండడంతో చాలా మందికి నగదు జమ అవ్వలేదు.

అటువంటి సమయంలో లబ్ధిదారులు సదరు బ్యాంకులకు వెళ్లి ఏ ఖాతాకు ఎన్‌పీసీఐ అనుసంధానం జరిగి ఉందో తెలుసుకోవచ్చు. అలాగే, ఎక్కువ బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్న వారు తమకు నచ్చిన బ్యాంకు ఖాతాకు ఎన్‌పీసీఐ అనుసంధానం కోరుకుంటే సంబంధిత బ్యాంకులో ఆధార్, బ్యాంకు ఖాతాలతో సంప్రదించాల్సి ఉంటుంది. తరువాత ఎన్‌పీసీఐ అనుసంధానం గల బ్యాంకు ఖాతా జెరాక్స్‌ మాత్రమే ఆయా పథకాలకు దరఖాస్తు సమయంలో సచివాలయాలలో అందజేయాల్సి ఉంటుంది.  

మరిన్ని వార్తలు