త్వరలో పేపర్‌లెస్‌ కోర్టులు 

25 Sep, 2023 05:20 IST|Sakshi
విశాఖలో కోర్టుల భవన సముదాయాన్ని ప్రారంభిస్తున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్, న్యాయమూర్తులు

ఏపీలోని అన్ని కోర్టుల ఆధునికీకరణకు ప్రభుత్వం చర్యలు

త్వరలోనే టెండర్లు పిలిచేందుకు ప్రణాళికలు.. కమర్షియల్‌ హబ్‌గా విశాఖ అభివృద్ధి చెందుతోంది

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌

విశాఖలో 10 కోర్టుల భవన సముదాయాన్ని ప్రారంభించిన సీజే

సాక్షి, విశాఖపట్నం: సాంకేతికత వేగంగా మారుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని కోర్టులు త్వరలోనే కాగిత రహిత(పేపర్‌ లెస్‌) న్యాయస్థానాలుగా మారనున్నా­యని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ తెలిపారు. విశాఖపట్నంలో కొత్తగా నిర్మించిన 10 కోర్టుల భవన సముదాయాన్ని చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ ఆదివారం ప్రారంభించారు.

అనంతరం విశాఖ జిల్లా కోర్టుల సముదాయం ఆవ­రణలో ఏర్పా­టు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం బాంబే హైకోర్టులో చాలామంది అడ్వొకేట్లు ఐప్యాడ్స్‌ ద్వారా తమ కేసులపై వాదోపవాదనలు వినిపిస్తున్నారని తెలిపారు. ఇదే తరహాలో టెక్నాలజీని అన్ని కోర్టులు క్రమంగా అందిపుచ్చుకుంటున్నాయని, రాష్ట్రంలోనూ ఆ తరహా విధానం అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

అందుకే న్యాయవాదులు, న్యాయమూర్తులు సాంకేతికను అందిపుచ్చుకుని, సవాళ్లని ఎదుర్కొనేలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. న్యాయస్థానాల్లో న్యాయవాదులు, న్యాయమూర్తులతోపాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి చూసే కక్షిదారులకు మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ప్రతినిధులతో కలిసి రాష్ట్రంలోని అన్ని కోర్టులపై సమగ్ర నివేదిక సిద్ధం చేసిందని, న్యాయస్థానాల ఆధునికీకరణ, కొత్త భవనాల నిర్మాణం, కోర్టుల్లో ఏసీ సౌకర్యంతోపాటు అన్ని మౌలిక వసతులు సమకూర్చేందుకు త్వరలోనే టెండర్లు పిలవనుందని చీఫ్‌ జస్టిస్‌ వెల్లడించారు. ఇప్పటికే కొన్ని కోర్టు భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయని, అక్టోబర్‌ 30 నాటికి 5 భవనాలు ప్రారంభమవుతాయని తెలిపారు.

కక్షిదారులకు కోర్టు నియమాలు తెలియవని, కోర్టులో ఏమైనా తప్పుగా ప్రవర్తించినా వారికి నియమనిబంధనలు తెలియజేసి, వారిపట్ల గౌరవంగా వ్యవహరించాలని సూచించారు. దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే అడ్వొకేట్స్‌ ప్రాక్టీస్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం వెల్ఫేర్‌ ఫండ్‌ అందించడం చాలా ఊరటనిచ్చే అంశమని అన్నారు. విశాఖ కాస్మోపాలిటిన్‌ నగరమని చీఫ్‌ జస్టిస్‌ అభిప్రాయపడ్డారు.

వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ముందువరసలో ఉన్న విశాఖ... రాష్ట్రంలో ఉన్న అన్ని నగరాలతో పోల్చితే కమర్షియల్‌ హబ్‌గా మారుతోందన్నారు. ఈ సందర్భంగా విశాఖ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌కు ఆత్మీయ సత్కారం చేశారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ దుర్గాప్రసాద్‌రావు, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు, జస్టిస్‌ చీమలపాటి రవి, జిల్లా ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జ్‌ ఆలపాటి గిరిధర్, విశాఖపట్నం బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ చింతపల్లి రాంబాబు, న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు