AP: పీహెచ్‌సీల బలోపేతం చేస్తున్న సర్కార్‌

21 Dec, 2021 22:56 IST|Sakshi

భవనాలకు మరమ్మతులు, కొత్త భవనాల నిర్మాణం

అన్ని సదుపాయాలు ఉండేలా చర్యలు

సాక్షి, అమరావతి: పల్లె ప్రజల ఆరోగ్య పరిరక్షణలో కీలకమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్‌సీ)ను రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేస్తోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన పరిస్థితులకు చెక్‌ పెడుతూ.. ‘నాడు–నేడు’ కార్యక్రమంలో భాగంగా పీహెచ్‌సీలను సీఎం వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ఆధునీకరిస్తోంది. భవనాలకు మరమ్మతులు చేయడంతో పాటు, శిథిలావస్థలో ఉన్న భవనాల స్థానంలో కొత్త భవనాలను నిర్మిస్తోంది. ఇందు కోసం రూ. 670 కోట్లు ఖర్చు చేస్తోంది.

978 భవనాలకు మరమ్మతులు
రాష్ట్ర వ్యాప్తంగా 1,124 పీహెచ్‌సీలు ఉన్నాయి. వీటిలో 978 పీహెచ్‌సీల భవనాలకు మరమ్మతులు చేస్తున్నారు. 146 పీహెచ్‌సీలకు కొత్త భవనాల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతోంది. మరమ్మతుల కోసం రూ. 408.5 కోట్లను ప్రభుత్వం వెచ్చించింది. ఇప్పటికే 532 భవనాలకు మరమ్మతులు పూర్తయ్యాయి. ఆయా పీహెచ్‌సీల్లో అవసరమైన ప్రహరీలు, వైద్యులు, వైద్య సిబ్బంది సమావేశ గదులు, రోగులకు అవసరమైన ఇతర అదనపు నిర్మాణాలు చేపట్టారు. ఆసుపత్రి ప్రాంగణంలో ఆహ్లాద వాతావరణం ఉండేలా మొక్కలు నాటడంతో పాటు ఇతర చర్యలు చేపట్టారు. రూ.261.5 కోట్లతో 146 కొత్త భవనాలను జాతీయ ప్రమాణాలతో, అన్ని వసతులు ఉండేలా నిర్మిస్తున్నారు. 

నూతనంగా నిర్మిస్తున్న భవనాల్లో వసతులు ఇలా
మహిళలు, పురుషులకు వేర్వేరుగా జనరల్‌ వార్డులు
 ఆపరేషన్‌ థియేటర్‌.. ప్రసూతి గది
 ఇద్దరు వైద్యాధికారులతో పాటు, ఆయుష్‌ వైద్యుడికి వేరు వేరుగా కన్సల్టేషన్‌ గదులు, స్టాఫ్‌ నర్సుల కోసం ప్రత్యేక గది.
 మెడిసిన్‌ స్టోర్, ల్యాబ్‌ గదులు, ఆసుపత్రికి వచ్చే రోగులకు మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు కల్పన.

వచ్చే ఏప్రిల్‌కు అందుబాటులోకి
నాడు–నేడు కింద పీహెచ్‌సీల్లో మరమ్మతులు, నూతన భవనాల నిర్మాణం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. వచ్చే ఫిబ్రవరి నెలాఖరుకు 978 భవనాల మరమ్మతులు, ఏప్రిల్‌ నెలాఖరుకు 146 కొత్త భవనాల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించాం. ఈ లోపు పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. 
– మురళీధర్‌రెడ్డి, ఏపీఎంఎస్‌ఐడీసీ వైస్‌ చైర్మన్, ఎండీ

మరిన్ని వార్తలు