పండ్ల తోటలకు ప్రభుత్వ తోడ్పాటు 

25 Sep, 2022 04:26 IST|Sakshi
ప్రకాశం జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందిన వీరపునేని బాలచెన్నయ్య తైవాన్‌ జామ తోట

మూడేళ్లలో 1.75 లక్షల ఎకరాల్లో సాగు 

1,18,842 మంది రైతులకు రూ.400 కోట్ల సాయం 

ఉపాధి హామీ పథకం ద్వారా సాగు ఖర్చులన్నీ ప్రభుత్వానివే 

మొక్కలు, గుంతలు, కలుపు, నీటి తడుల ఖర్చంతా సర్కారుదే 

ఎకరాకు మూడేళ్లలో విడతల వారీగా రూ.1.35 లక్షలు చెల్లింపు

మొత్తం 13 రకాల పండ్ల తోటల పెంపకానికి చేయూత 

ఇందులో 33 శాతం మామిడి తోటల పెంపకమే

ఈ రైతు పేరు ఉడుముల పిచ్చిరెడ్డి. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం రాచకొండ స్వగ్రామం. 2019 వరకు తనకున్న రెండెకరాల్లో మిర్చి, పత్తి లాంటి వాణిజ్య పంటలు సాగు చేసేవాడు. నాటుకునే మొక్కలు మొదలు.. పండ్ల తోట ద్వారా ఫలసాయం వచ్చే దాకా వివిధ రూపాల్లో ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుందని తెలుసుకుని 2020లో తైవాన్‌ జామ పంట సాగు చేశాడు.

మొక్కలు తెచ్చుకోవడానికి ప్రభుత్వమే డబ్బులిచ్చింది. నాటేటప్పుడు గుంతల ఖర్చు, తర్వాత కలుపు తీసేందుకు కూలి డబ్బులు, అవసరమైనప్పుడు నీళ్లకు డబ్బులిచ్చింది.

మొక్కలు నాటిన ఏడు నెలల నుంచే ఫలసాయం రావడం మొదలైంది. కాయల కోత ఖర్చులు పోను ఏటా రూ.లక్ష నుంచి రూ.1.20 లక్షల దాకా మిగులుతోంది. గతంలో మిర్చి, పత్తి పంటలు వేసినప్పటి కంటే ఇప్పుడే నికర ఆదాయం వస్తోందని పిచ్చిరెడ్డి ఆనందంగా చెబుతున్నాడు.

ఇదే జిల్లా పీసీపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వీరపునేని బాలచెన్నయ్య తన పొలం, తన సోదరుడి పొలం.. మొత్తం రెండెకరాల్లో 2021 జూన్‌లో 800 తైవాన్‌ జామ మొక్కలు నాటాడు.

గుంతలు తీసేందుకు ప్రభుత్వం రూ. 50 వేలు ఆర్థిక సాయం చేసింది. కాపలా, నీటి తడుల కోసం ఇప్పటి దాకా రూ.72 వేలు ఇచ్చింది. ప్రస్తుతం పంట తీరును బట్టి ఎకరాకు రూ.50 వేలకు పైగా నికర ఆదాయం వస్తుందని సంతోషంగా చెబుతున్నాడు.  

సాక్షి, అమరావతి: మెట్ట భూముల్లో వర్షాధారంగా కంది, పత్తి వంటి పంటలు పండించుకునే రైతులు 1,18,842 మందికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మూడేళ్లుగా పండ్ల తోటల పెంపకానికి పూర్తి స్థాయిలో ఆర్థిక తోడ్పాటును అందజేసింది. మొక్కలు నాటుకోవడానికి గుంతలు తవ్వడం మొదలు.. మొక్కల కొనుగోలు, నాటిన మొక్కలకు నీటి తడుల ఖర్చు, పెంపకంలో అవసరమయ్యే ఎరువు ఖర్చుల వంటిì  వాటన్నింటికీ ఉపాధి హామీ పథకం ద్వారా వివిధ రూపాల్లో ఆర్థిక సహాయం చేసింది.

మూడేళ్లలో రైతులకు ఎకరాకు రూ.1,35,141 దాకా లబ్ధి చేకూర్చింది. ప్రభుత్వం అందజేస్తోన్న ఆర్థిక సహాయంతో ఆగస్టు 2019 – 2022 మార్చి మధ్య 1,18,842 మంది రైతులు 1,75,493 ఎకరాల్లో పండ్ల తోటలు సాగు చేశారు. ఇందుకోసం ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా దాదాపు రూ.400.28 కోట్లు ఆర్థిక సహాయం అందజేసిందని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది కూడా పండ్ల తోటల సాగుకు ముందుకొచ్చే రైతులను గుర్తించే ప్రక్రియ అన్ని జిల్లాల్లో కొనసాగుతుందని చెప్పారు. 

మూడో వంతు మామిడి సాగే
మామిడి, జీడిమామిడి, బత్తాయి, నిమ్మ, జామ, సపోట, కొబ్బరి, దానిమ్మ, రేగు, సీతాఫలం, నేరేడు, ఆయిల్‌ పామ్, అంజూర వంటి పండ్ల మొక్కల పెంపకానికి ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు ప్రభుత్వం తోడ్పాటు అందజేస్తోంది. పండ్ల తోట సాగు చేసేందుకు ముందుకొచ్చే రైతుకు తొలి ఏడాది రూ.65 వేల దాకా, రెండో ఏడాది మరో రూ.35 వేలు, మూడో ఏడాది రూ.33–34 వేల మధ్య ఆర్థిక తోడ్పాటు అందిస్తుందని అధికారులు వెల్లడించారు. మూడేళ్లుగా ఈ పథకం ద్వారా 33 శాతం మంది రైతులు మామిడి తోటలనే సాగు చేశారని అధికారులు వెల్లడించారు. 2019లో 20,824 ఎకరాల్లో, 2020లో 22,147 ఎకరాల్లో మామిడి తోటలు సాగయ్యాయి. 

ఏటా రూ.1000 కోట్ల ఆదాయం 
మామిడి, జీడి, కొబ్బరి పంటలను సాగు చేసుకునే రైతులకు ఏటా ఎకరాకు రెండు లక్షల దాకా నికర ఆదాయం ఉంటుంది. మార్కెట్‌లో వివిధ రకాల పండ్లకు ఉన్న డిమాండ్‌ మేరకు పంట తక్కువ వచ్చే ఏడాది కూడా ఎకరాకు లక్ష ఆదాయం గ్యారంటీగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. పండ్ల తోటలు సాగు చేసిన వారిలో దాదాపు మూడో వంతు మంది రైతులు ఏటా నికర ఆదాయం పొందుతున్నారు. వీరి ఆదాయం ఏటా రూ.1,000 కోట్లకు తక్కువ లేదన్నది అంచనా అని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు.  

మరిన్ని వార్తలు