సాగు భళా.. 30 ఏళ్లు వర్ధిల్లేలా!

18 Oct, 2020 19:43 IST|Sakshi

వైఎస్సార్‌ ఉచిత విద్యుత్‌ పథకానికి మెరుగులు

అన్నదాతకు హక్కుగా అమలు చేసేందుకు కార్యాచరణ

ఐదు జిల్లాల్లో రూ.782 కోట్లు వెచ్చించేందుకు నిర్ణయం

3,043 కిలోమీటర్ల కొత్త విద్యుత్‌ లైన్ల ఏర్పాటు

రూ.174.4 కోట్లతో 72 సబ్‌స్టేషన్ల నిర్మాణం

సాక్షి, తిరుపతి : ఉచిత విద్యుత్‌ పథకానికి మెరుగులద్ది రైతులు సాధికారత సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రానున్న 30 ఏళ్ల పాటు రైతన్నలకు నాణ్యమైన వ్యవసాయ విద్యుత్‌ను హక్కుగా అందించేందుకు వైఎస్సార్‌ ఉచిత విద్యుత్‌ పథకానికి శ్రీకారం చుట్టింది. వ్యవసాయ సర్వీసులకు మీటర్లు బిగించడం ద్వారా పగటిపూట నిరంతరాయంగా 9 గంటల పాటు ఉచిత విద్యుత్‌ను ఇచ్చేలా చర్యలు చేపడుతోంది. ఇందుకోసం పాత లైన్ల స్థానంలో కొత్త లైన్లను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్‌) చిత్తూరు, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో రూ.782 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తోంది. 

కొత్త లైన్లు.. నయా సబ్‌ స్టేషన్లు
డిస్కం పరిధిలోని ఐదు జిల్లాల్లో 2.80 లక్షల కిలోమీటర్ల మేర విద్యుత్‌ లైన్లు ఉన్నాయి. కొత్తగా 3,043 కిలోమీటర్ల మేర లైన్లు నిర్మిస్తున్నారు. 1,532 ట్రాన్స్‌ఫార్మర్లకు సంబంధించి లోడ్‌ సామర్థ్యాన్ని పెంచారు. ఈ ఏడాది నూతనంగా మరో 675 ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నారు. రూ.174.4 కోట్లతో కొత్తగా 72 చోట్ల 33/11 కేవీ విద్యుత్‌ ఉప కేంద్రాలు నిర్మించనున్నారు. ఇందుకోసం డిస్కం పరిధిలో మొత్తంగా రూ.782 కోట్లు ఖర్చు చేస్తున్నారు. డిస్కం పరిధిలో 10,90,743 విద్యుత్‌ సర్వీసులు ఉండగా.. అనధికారికంగా మరో 12 వేలకు పైగా ఉన్నట్టు గుర్తించారు. గత ప్రభుత్వ హయాంలో ఉచిత విద్యుత్‌తో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లో-ఓల్టేజీతో మీటర్లు కాలిపోయి నష్టపోయారు. ప్రభుత్వం ఇలాంటి సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఉచిత విద్యుత్‌ పథకంపై రైతుల్లో నెలకొన్న అనుమానాలు నివృత్తి చేసేందుకు ఎస్పీడీసీఎల్‌ ఈ నెల 1 నుంచి గ్రామ స్థాయిలో రైతు సదస్సులు నిర్వహిస్తోంది. నవంబర్‌ 22 నుంచి డిసెంబర్‌ 5 వరకు రైతులకు ప్రత్యేక బ్యాంకు ఖాతాలు తెరుస్తారు. నవంబర్‌ 1నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు వ్యవసాయ విద్యుత్‌ సర్వీసులకు స్మార్ట్‌ మీటర్లు, ఇన్‌ఫ్రారెడ్‌ సమాచారం గల ప్రామాణిక మీటర్లను బిగిస్తారు.

ప్రయోజనాలివీ..
కొత్త మీటర్ల ఏర్పాటకు ముందు అనధికార విద్యుత్‌ కనెక‌్షన్ల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిస్తారు. రెవెన్యూ రికార్డుల్లో మార్పులు, చేర్పుల ఆధారంగా విద్యుత్‌ శాఖ బిల్లుల్లో పేర్లు మార్చుకోవడం, సాగు విస్తీర్ణంలో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. ప్రభుత్వమే రైతులకు నగదు బదిలీ చేయనుంది. ఆ మొత్తాల్ని రైతులు విద్యుత్‌ శాఖకు బిల్లు రూపంలో చెల్లించడం వల్ల నాణ్యమైన విద్యుత్‌ కోసం డిమాండ్‌ చేసే హక్కు వారికి ఉంటుంది.

ఒక్క పైసా కూడా కట్టక్కర్లేదు
వైఎస్సార్‌ ఉచిత వ్యవసాయ విద్యుత్‌ పథకంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. వ్యవసాయ కనెక‌్షన్లకు మీటర్లు బిగించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తాం. మీటర్‌ పొందడం నుంచి కనెక‌్షన్‌ తీసుకునే వరకు రైతులు ఒక్క పైసా కూడా కట్టాల్సిన అవసరం లేదు.
- హెచ్‌.హరనాథరావు, సీఎండీ, ఎస్పీడీసీఎల్

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా