టీడీపీ జెండా నీడన ఉపాధ్యాయుడు

22 Aug, 2020 09:22 IST|Sakshi
టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలోఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ పక్కన కూర్చున్న ఉపాధ్యాయుడు వెంకటేశ్వరరావు (సర్కిల్‌లో ఉన్న వ్యక్తి)

ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీడియా సమావేశానికి హాజరు

ఉపాధ్యాయుడిపై కలెక్టర్, ఎమ్మెల్యేలకు ఫిర్యాదు

సాక్షి, ఉయ్యూరు: టీడీపీ సమావేశంలో పాల్గొని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు సర్వీసు రూల్స్‌ను ఉల్లంఘించారు. దీనిపై విచారించి చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్, డీఈఓలకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఫిర్యాదు చేశారు. సంబంధిత వివరాలు ఇలా ఉన్నాయి. స్వర్ణప్యాలెస్‌ అగ్నిప్రమాద ఘటనపై రమేష్‌ ఆస్పత్రికి మద్దతుగా టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌ గురువారం టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించా రు. వైవీబీ రమేష్‌ ఆస్పత్రి యాజమాన్యానికి వత్తాసు పలు కుతూ ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకుని అసత్య ఆరోపణలు చేశారు. అయితే, వైవీబీ మీడియా సమావేశంలో పమిడిముక్కల మండలం తాడంకి జెడ్‌పీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నూకల వెంకటేశ్వరరావు పాల్గొని నిబంధనలను ఉల్లంఘించారు.

ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉంటూ సర్వీసు రూల్స్‌ను అతిక్రమించి టీడీపీ జెండా నీడన కూర్చోవటంపై ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. వెంకటేశ్వరరావు టీడీపీ సమావేశానికి హాజరైన ఫోటోలు, వీడియోలు శుక్రవారం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేయటంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి (పెనమలూ రు), కైలే అనిల్‌కుమార్‌ (పామర్రు),  జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్, డీఈఓ రాజ్యలక్ష్మీలకు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయుడు టీడీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొనటంపై విచారణ జరిపి చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు