సంక్షేమం తోడుగా 'అభివృద్ధి'

15 Mar, 2023 04:13 IST|Sakshi
ఉభయ సభల సంయుక్త సమావేశంలో మాట్లాడుతున్న గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌. చిత్రంలో మండలి చైర్మన్‌ మోషేన్‌రాజు, స్పీకర్‌ తమ్మినేని సీతారాం

రాష్ట్ర ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ 

కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా సంక్షేమ ఫలాలు

45 నెలల్లో డీబీటీ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.1.97 లక్షల కోట్లు 

సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా పారదర్శకంగా సేవలు

80 లక్షల మంది పిల్లల చదువులకు చేయూతగా ‘అమ్మ ఒడి’ 

నాడు–నేడుతో పాఠశాలల ఆధునికీకరణ, ఇంగ్లిష్‌ మీడియం

సున్నా వడ్డీ, చేయూత, కాపు నేస్తం పథకాల ద్వారా మహిళలకు బాసట.. సామాజిక న్యాయంలో సరికొత్త విప్లవం

ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా నాణ్యమైన వైద్యం.. రైతన్నలకు అన్ని విధాలా భరోసా

జీఐఎస్‌లో రూ.13.42 లక్షల కోట్ల పెట్టుబడులు.. 378 ఒప్పందాలు

ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి నిరంతరం కృషి 

కులం, మతం, ప్రాంతం, రాజకీయం చూడకుండా డీబీటీ విధానం ద్వారా పారదర్శకంగా అనేక పథకాలను ప్రభుత్వం అమలు చేసిందని చెప్పడానికి సంతోషంగా ఉంది. అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమాభివృద్ధి ఫలాలు అందించడమే లక్ష్యంగా, రాష్ట్ర సమగ్రాభివృద్ధే ధ్యేయంగా మా ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది.
– గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌ 

సాక్షి, అమరావతి: సమాజంలో ఏ ఒక్కరూ వెనుక పడకూడదనే లక్ష్యంతో నవరత్నాలనే గొడుగు కింద సమ్మిళిత పాలన నమూనాతో సంక్షేమ వ్యవస్థను ప్రభుత్వం రూపొందించిందని గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌ అన్నారు. అన్ని వర్గాల వారి అభ్యు­న్నతే లక్ష్యంగా, రాష్ట్ర సుస్థిర ప్రగతే ప్రభుత్వ అగ్ర ప్రాధాన్యతగా ఉందని చెప్పారు. 2023–24 రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల తొలిరోజు మంగ­ళవారం ఆయన ఉభయ సభల సంయుక్త సమా­వేశంలో ప్రసంగించారు.

రాష్ట్రంలో గడిచిన 45 నెలల్లో డీబీటీ విధానం ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు రూ.1.97 లక్షల కోట్ల మొత్తాన్ని జమ చేశామని తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌  క్రియాశీల నాయ­కత్వంలో 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల  ఆకాంక్షలను నెరవేర్చే ప్రయాణంలో నాలుగేళ్లు పూర్తయిందని చెప్పారు. ఈ క్రమంలో సమర్థవంతమైన ప్రభుత్వ విధానాల అమలుతో 2021–22లో 11.43 శాతం జీఎస్‌డీపీ వృద్ధి రేటు సాధించామన్నారు. ఇది దేశంలోని అన్ని రాష్ట్రాలకంటే అత్యధికం అని స్పష్టం చేశారు.

విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు, నాడు–నేడు కింద మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టామన్నారు. 15,004 సచివాలయాల ద్వారా పాలనలో పారదర్శకత, వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టామని, ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలను అందించామని చెప్పారు. 2022–23 ముందస్తు అంచనాలు ప్రస్తుత ధరలలో 16.22 శాతం సమగ్ర వృద్ధిని సూచిస్తున్నాయని తెలిపారు. ప్రస్తుత ధరలలో రాష్ట్ర తలసరి ఆదాయం 2021–22లో రూ.1,92,517 నుంచి 14.02 శాతం ప్రోత్సాహక వృద్ధిరేటుతో రూ.2,19,518కు చేరిందన్నారు. ఈ సమావేశంలో గవర్నర్‌ ఇంకా ఏమన్నారంటే..

గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న సీఎం జగన్‌ 

విద్యా సంస్కరణలతో బంగారు బాట
► 2020 జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా పాఠ్యప్రణాళిక సంస్కరణలను అమలు చేస్తున్నాం. 2020–21 నుంచి మన బడి నాడు–నేడు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. రూ.3,669 కోట్లతో తొలి దశలో 15,717 పాఠశాలలను, రెండో దశ కింద రూ.8 వేల కోట్లతో 22,344 పాఠశాలలను అభివృద్ధి బాట పట్టించాం. మూడేళ్లలో రూ.16,021.67 కోట్లతో 57,189 పాఠశాలలు, 3,280 ఇతర విద్యా సంస్థలలో మౌలిక సదుపాయాలను కల్పించాలన్నది మా ప్రభుత్వ యోచన.  

► ‘జగనన్న అమ్మ ఒడి’ పథకం కింద 84 లక్షల మంది పిల్లలను పాఠశాలలకు పంపడానికి 44.49 లక్షల మంది తల్లులకు రూ.19,617.60 కోట్ల మొత్తాన్ని అందించాం. ప్రతి తల్లికి ఏటా రూ.15 వేల చొప్పున ఇస్తున్నాం.  

► రూ.690 కోట్ల విలువైన బైజూస్‌ కంటెంట్‌ ప్రీలోడ్‌ చేసిన ట్యాబ్‌­లను 4.60 లక్షల మంది విద్యార్థులు, 60 వేల మంది టీచర్లకు పంపిణీ చేశాం. ఆరో తరగతి, ఆపై తరగతుల వరకు ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెల్స్‌­ను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నాం. ఈ ప్యానెల్స్‌­ను 5,800 పాఠశాలల్లోని 30,213 తరగతి గదుల్లో నెలకొల్పేందుకు ప్రణాళిక రూపొందించాం. ఇంగ్లిష్‌ మీడియం అమలు చేయడంతో పాటు ద్విభాషా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశాం. ఇంగ్లిష్‌ ల్యాబ్‌­లను ఏర్పాటు చేశాం. 

► స్కూల్‌ డ్రాపౌట్స్‌ను తగ్గించి జీఈఆర్‌ను మెరుగు పరచడానికి జగనన్న విద్యా కానుక కింద ప్రభుత్వ,  ప్రభుత్వేతర ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి చదివే 47.4 లక్షల మంది విద్యార్థులకు బూట్లు, బ్యాగ్‌లు, పుస్తకాలు, ఇతర వస్తువులతో కూడిన కిట్‌ల పంపిణీకి 2020–21 నుంచి రూ.2,368 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేశాం.

ఆరోగ్యకరమైన సమాజం 
► డా.వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకంలో ప్రొసీజర్‌లు 2,446 నుంచి 3,255కు పెంపు. రాష్ట్రంలో 1.41 కోట్ల కుటుంబాలకు (95 శాతం కుటుంబాలు) వర్తింపు

► ఆరోగ్య ఆసరా కింద 15.65 లక్షల మందికి రూ.971.28 కోట్ల సాయం 

► రాష్ట్రంలో సమర్థవంతంగా మాతా, శిశు సంరక్షణ సేవల అమలు 

► గ్రామీణ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా ఫ్యామిలీ డాక్టర్‌ విధానం

► వైఎస్సార్‌ టెలిమెడిసిన్‌ కింద 2.83 కోట్ల కన్సల్టెన్సీల నమోదు. ఇది దేశంలో 35 శాతం వాటా 

► నాడు–నేడు ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధి. 17 వైద్య కళాశాలల ఏర్పాటు. వచ్చే విద్యా సంవత్సరంలో 5 కళాశాలలు ప్రారంభం. వైద్య ఆరోగ్య శాఖలో 48,639 పోస్టుల భర్తీ  
 
సామాజిక భద్రతలో విప్లవం
► వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ పథకాల ద్వారా 35.7 లక్షల మంది గర్భిణిలు, పాలిచ్చే తల్లులు, పిల్లల పోషకాహారం కోసం రూ.6,141 కోట్ల ఖర్చు  

► నవ రత్నాలు– పేదలందరికీ ఇళ్లు పథకం కింద 30.65 లక్షల మంది మహిళలకు ఇళ్ల స్థలాలు.. వీరిలో 21.25 లక్షల మందికి గృహాల మంజూరు. 4.4 లక్షల గృహాల నిర్మాణం పూర్తి. కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.32,909 కోట్ల ఖర్చు  

► వైఎస్సార్‌ పింఛన్‌ కానుక కింద 64.45 లక్షల మందికి రూ.66,823.79 కోట్లు  .  

► వైఎస్సార్‌ నేతన్న నేస్తం కింద 81,783 మందికి రూ.788.5 కోట్ల సాయం 

► వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కింద  .20 లక్షల మందికి రూ.422 కోట్లు 

► జగనన్న చేదోడు కింద 3.30 లక్షల మంది రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు రూ.927.49 కోట్లు

► వైఎస్సార్‌ బీమా కింద మృతుల కుటుంబాలు, క్షతగాత్రులకు రెండేళ్లలో రూ.512 కోట్లు 

► వైఎస్సార్‌ వాహనమిత్ర కింద 2.74 లక్షల మంది డ్రైవర్‌లకు రూ.1,041 కోట్ల సాయం 

► వైఎస్సార్‌ లా నేస్తం ద్వారా 4,248 మంది జూనియర్‌ లాయర్లకు రూ.35.4 కోట్లు

► జగనన్న తోడు కింద 15.31 లక్షల వీధి వ్యాపారులకు రూ.2,470.3 కోట్ల మేర సాయం 

► స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించేలా చట్టం. అన్ని నామినేటెడ్‌ పోస్టులు, నామినేటెడ్‌ పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు 

► 2019 ఏప్రిల్‌ 11 నాటికి 78.74 లక్షల మంది ఎస్‌ఎస్‌జీ మహిళలు బ్యాంక్‌లకు బకాయిపడ్డ రుణ మొత్తంలో రూ.12,758 కోట్లు చెల్లింపు 

► వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద 1.02 కోట్ల మంది ఎస్‌­హెచ్‌­జి మహిళలకు రూ.3,615 కోట్ల సాయం

► వైఎస్సార్‌ చేయూత కింద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలు 26.7 లక్షల మందికి మూడు విడతల్లో రూ.14,129 కోట్ల చెల్లింపు

► వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం కింద మూడు విడతల్లో 3.94 లక్షల మందికి రూ.595.86 కోట్లు 

► వైఎస్సార్‌ కాపు నేస్తం కింద 3.56 లక్షల మందికి రూ.1,518 కోట్లు

► వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అల్ప సంఖ్యాక వరాల్లోని యువతుల పెళ్లికి ఆర్థిక సాయం 

►వైఎస్సార్‌ స్వేచ్ఛ పథకం కింద రూ.25.33 కోట్ల ఖర్చు 

► ఆపదలో ఉన్న మహిళలను రక్షించేలా దిశ యాప్‌. 1.36 కోట్ల డౌన్‌లోడ్‌లు 

► 2021–22 నుంచి ‘జెండర్‌’ బడ్జెట్‌ సుస్థిర వ్యవసాయానికి భరోసా

సుస్థిర వ్యవసాయానికి భరోసా
► 2020–21లో వ్యవసాయ రంగంలో 11.3 శాతం, ఉద్యానవన రంగంలో 12.3 శాతం, పశు సంవర్థక రంగంలో 11.7 శాతం, మాంసం ఉత్పత్తిలో 10.3 శాతం వృద్ధి రేటు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సుపరిపాలన సూచికలో (జీజీఐ) మొదటి స్థానం. 

► వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ యోజన కింద రైతులకు ఐదేళ్లలో రూ.67,500 కోట్లు. 10,778 రైతు భరోసా కేంద్రాలు. వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా కింద 44.55 లక్షల మంది రైతులకు రూ.6,872 కోట్ల బీమా చెల్లింపు.

► 147 వైఎస్సార్‌ అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌­లు, జిల్లా స్థాయిలో 11 ప్రయోగశాలలు, జోనల్‌ స్థాయిలో 4 రీజనల్‌ కోడింగ్‌ కేంద్రాల ఏర్పాటు. 73.88 లక్షల మంది రైతులకు రూ.1,834.55 కోట్ల సున్నా వడ్డీ. 22.22 లక్షల మంది రైతులకు రూ.1,911.78 కోట్ల ఇన్‌­పుట్‌ సబ్సిడీ. శీతలు గిడ్డంగులు, ప్రాసెసింగ్‌ యూనిట్లు, రూ.27,800 కోట్ల విలువైన ఉచిత విద్యుత్‌. 10 ఎకరాల లోపు ఆక్వా రైతులకు విద్యుత్‌ సబ్సిడీ కింద రూ.2,647 కోట్లు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఎక్స్‌­గ్రేషియా రూ.7 లక్షలకు పెంపు. దశల వారీగా, ప్రాధాన్యత క్రమంలో నీటి పారుదల ప్రాజెక్టుల పూర్తి. 

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో బెస్ట్‌
► పరిశ్రమల స్థాపన, నిర్వహణ కోసం 21 రోజుల్లో సింగిల్‌ డెస్క్‌ సిస్టమ్‌ ద్వారా అన్ని అనుమతుల మంజూరు. ఇతరత్రా సహకారం ద్వారా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో మూడేళ్ల పాటు వరుసగా ఏపీకి మొదటి స్థానం. 

► ఈ నెల 3, 4 తేదీలలో విశాఖపట్నంలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ విజయవంతంగా నిర్వహణ. రూ.13.42 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 378 అవగాహన ఒప్పందాలు. 16 కీలక రంగాల్లో 6 లక్షల ఉద్యోగావకాశాలు. రాష్ట్ర పారిశ్రామిక కేంద్రంగా విశాఖపట్నం నగరాన్ని తీర్చిదిద్దడానికి ప్రణాళిక. రాష్ట్రంలో కొత్తగా 69 భారీ, మెగా పరిశ్రమలు. 

► వైఎస్సార్‌ నవోదయం కింద ఎంఎస్‌ఎంఈల బలోపేతానికి తోడ్పాటు. రూ.19,115 కోట్ల పెట్టుబడితో 1.52 లక్షల యూనిట్లు. 13.63 లక్షల మందికి ఉపాధి. ఎంఎస్‌ఎంఈ రీస్టార్ట్‌ కింద 23,236 ఎంఎస్‌ఎంఈలకు రూ.2,086 కోట్ల ప్రోత్సాహకాలు.

► ఏపీ లాజిస్టిక్‌ హబ్‌­గా, ఆగ్నేయ ఆసియాకు గేట్‌­వేగా రాష్ట్రం. 6 నిర్వాహక ఓడరేవులు ఉండగా, రామాయపట్నం, భావనపాడు, కాకినాడ, మచిలీపట్నంలో కొత్తగా ఏర్పాటు. రెండు దశల్లో తొమ్మిది ఫిషింగ్‌ హార్బర్లు నిర్మాణం. వైజాగ్‌– చెన్నై, చెన్నై– బెంగళూరు, హైదరాబాద్‌– బెంగళూరు ఇండస్ట్రియల్‌ కారిడార్‌ల అభివృద్ధి. 

మరిన్ని వార్తలు