జీవిత ఖైదీల విడుదల అధికారం గవర్నర్‌కుంది

21 Sep, 2022 06:00 IST|Sakshi

సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదల ప్రభుత్వ విధాన నిర్ణయం

అర్హతలున్న వారినే విడుదల చేస్తున్నాం

హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం

తదుపరి విచారణ ఈ నెల 26కి వాయిదా

సాక్షి, అమరావతి: రాజ్యాంగం ప్రకారం జీవిత ఖైదీలను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేసే అధికారం గవర్నర్‌కు ఉందని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం హైకోర్టుకు నివేదించింది. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలన్నది ప్రభుత్వ విధాన నిర్ణయమని ప్రభుత్వ న్యాయవాది (హోం) వేలూరి మహేశ్వరరెడ్డి వివరించారు. గవర్నర్‌ తన విచక్షణాధికారాలను ఉపయోగిస్తున్నప్పుడు జీవిత ఖైదు పడ్డ వ్యక్తి 14 ఏళ్లు శిక్ష అనుభవించి తీరాలన్న నిబంధనను పాటించాల్సిన అవసరం లేదన్నారు.

ఇదే విషయాన్ని సుప్రీం కోర్టు కూడా చెప్పిందన్నారు. సత్ప్రవర్తనతో పాటు విడుదలకు ప్రభుత్వం నిర్దేశించిన అర్హతలు కలిగి ఉన్న ఖైదీలను మాత్రమే విడుదల చేస్తున్నామని తెలిపారు. ఇదే రీతిలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 175 మందిని విడుదల చేశామని చెప్పారు. ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించేందుకు ఉద్దేశించిన విధాన నిర్ణయాన్ని, 14 ఏళ్ల శిక్ష పూర్తి కాక ముందే 8 మంది ఖైదీల విడుదలకు సంబంధించి గవర్నర్‌ ముందుంచిన ఫైల్‌ను కోర్టు ముందుంచామని తెలిపారు.

ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. ఖైదీల విడుదలలో ప్రభుత్వానికి అధికారం లేదనడంలేదని, అయితే జీవితఖైదు పడ్డ వారి విడుదల విషయంలో ప్రభుత్వానికి అపరిమిత అధికారాలున్నాయా? ప్రభుత్వం అనుకుంటే జీవిత ఖైదు పడ్డ ఆరు నెలల్లోనే విడుదల చేయవచ్చా వంటి ప్రశ్నలకు సమాధానం కావాలంది. తదుపరి విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది.

ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌ రాయ్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.తన భర్త పార్థమరెడ్డి హత్య కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న 8 మందిని శిక్షాకాలం పూర్తి కాక ముందే విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మెట్టు గ్రామానికి చెందిన ముడి నవనీతమ్మ దాఖలు చేసిన వ్యాజ్యంపై జస్టిస్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ మంగళవారం మరోసారి విచారణ జరిపారు.

పిటిషనర్‌ తరఫు న్యాయవాది గూడపాటి వెంకటేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. జీవిత ఖైదు పడ్డ ఖైదీ 14 సంవత్సరాల జైలు జీవితాన్ని అనుభవిస్తేనే క్షమాభిక్షకు అర్హుడని తెలిపారు. ప్రస్తుత కేసులో విడుదలైన వారు క్షమాభిక్షకు అర్హులు కాదన్నారు.  

మరిన్ని వార్తలు