'సంప్రదింపులతో సాధించుకోవాలి.. లేదంటే ఆ గ్యాప్ అలానే ఉంటుంది'

2 Feb, 2022 16:58 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: పదకొండవ పీఆర్సీపై అనేకసార్లు చర్చించిన తర్వాతే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటన చేశారని ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగ సంక్షేమం) ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేను మొన్నటి వరకూ ఎన్జీవో అధ్యక్షుడిగా, జేఏసీ ఛైర్మన్‌గా ఉన్నాను. కొంత మంది ఉద్యోగ నాయకులు హెచ్‌ఆర్‌ఏ తగ్గిందని అంటున్నారు. దీనిపై ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వం దీనిపై కమిటీ కూడా వేసింది. నిన్న (మంగళవారం) జరిగిన సమావేశంలో మూడు విషయాలను పట్టుబడుతున్నారు. పాత శాలరీ ఇవ్వాలని, పీఆర్సీ రిపోర్ట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

పెరిగిన జీతాలకు అనుగుణంగా కొత్త జీవో ప్రకారం నిన్న జీతాలు వేశారు. ఇప్పుడు మార్చడానికి వీల్లేదు. ఐఆర్ రికవరీ లేకుండా, హెచ్ఆర్ఏ పెంచాలని అడుగుతున్నారు. కానీ ఆ విషయాన్ని మంత్రుల కమిటీ వద్ద చర్చిస్తే బాగుండేది. కోవిడ్ వల్ల ఆర్థిక పరిస్థితి సరిగాలేక ఉద్యోగులు కోరిన మేర పీఆర్సీ ఇవ్వలేకపోతున్నాం. ఏది ఏమైనా జీతాలు పడ్డాయి కాబట్టి జీవోలు వెనక్కి తీసుకోలేము. ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిపై సంప్రదింపులతో సాదించుకోవాలి. లేదంటే ఆ గ్యాప్ అలానే ఉంటుంది. సమ్మె నోటీస్ ఇచ్చి ఆందోళనకు వెళ్తామని చెప్తున్నారు. అనేక సార్లు చర్చలకు ఆహ్వానించి మంత్రుల కమిటీ వేచి చూసింది. ఉద్యోగులు, ప్రభుత్వం వేరు వేరు కాదు. వారు మరోమారు ఆలోచన చేయాలి.

చదవండి: (ఆస్తుల విభజనకు తీసుకున్న చర్యలేమిటి?: విజయసాయిరెడ్డి) 

సమ్మె వల్ల ప్రజలకు అసౌకర్యం కలుగుతోంది. మా ఉద్యోగ మిత్రులను రిక్వెస్ట్ చేస్తున్నా చర్చలతో పరిష్కరించుకుందాం. కార్యాచరణ వాయిదా వేయాలని, చర్చలకు రావాలని కోరుతున్నా. ప్రస్తుత పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నా ముఖ్యమంత్రి 23 శాతం ఫిట్‌మెంటు ఇచ్చారు. వచ్చిన జీతాల్లో ఎవరెవరికి ఎంత పెరిగిందో వాళ్ళకే తెలుసు. సామరస్యంతోనే సమస్యను పరిష్కరించుకోవాలి. ఉద్యోగులు ఒకేసారి విజయవాడ రావడం వల్ల కొంత అసౌకర్యం కలుగుతుంది. అసాంఘిక శక్తులు కూడా మన మధ్య దూరాన్ని పెంచే ప్రయత్నం చేయవచ్చు. కోవిడ్ వల్ల ఇబ్బంది ఉంది. 200 మంది కంటే ఎక్కువ గుమికూడి ఉండకూడదు. ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కూడా ఉద్యోగులు ఆలోచించాలి అని ప్రభుత్వ సలహాదారు ఎన్‌. చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు.

మరిన్ని వార్తలు