కళాశాలలకు కార్పొరేట్‌ కళ

17 Sep, 2022 11:15 IST|Sakshi

పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లాలో 22 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో నాడు–నేడు పనులు

9 రకాల వసతుల కల్పన

కొరత ఉన్న చోట అదనపు గదుల నిర్మాణం

రూ.13.44 కోట్ల నిధుల మంజూరు

విడతల వారీగా నిధులు విడుదల

డిసెంబరు నాటికి పూర్తి చేయాలని టార్గెట్‌

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు కార్పొరేట్‌ కళను సంతరించుకోనున్నాయి. నాడు–నేడు పనులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు. ఇప్పటికే నాడు–నేడు ద్వారా ప్రభుత్వ బడులకు కార్పొరేట్‌ సొబగులు అద్దిన ప్రభుత్వం తాజాగా జూనియర్‌ కళాశాలలపై దృష్టి సారించింది. డిసెంబరు నాటికి పూర్తి స్థాయిలో సకల వసతులు ఏర్పాటు చేయాలని నిర్దేశించింది. అవసరమైన చోట్ల అదనపు తరగతి గదులు  నిర్మించనున్నారు. 

నెల్లూరు (టౌన్‌): ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు మహర్దశ పట్టింది. జిల్లాలో తొలి విడతలో 1,059, రెండో విడతలో 1,112 పాఠశాలలను అభివృద్ధి చేసిన ప్రభుత్వం తాజాగా జూనియర్‌ కళాశాలల్లో నాడు–నేడు కార్యక్రమాన్ని అమలు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. కళాశాలల్లో 9 రకాల వసతులను కల్పించనున్నారు. వీటి అభివృద్ధికి రూ.13.44 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. పనులను బట్టి విడతల వారీగా నిధులను విడుదల చేయనున్నారు. త్వరలో పనులు ప్రారంభించి డిసెంబరు నాటికల్లా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. కళాశాల డెవలప్‌మెంట్‌ కమిటీ ఆధ్వర్యంలో పనులు నిర్వహించనున్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఆధునిక వసతులు ఏర్పాటు కానుండడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.   

9 రకాల వసతుల ఏర్పాటు 
ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మొత్తం 9 రకాల వసతులు కలి్పంచనున్నారు. అవసరమైన కళాశాలలో అదనపు తరగతి గదులు నిర్మాణం చేపట్టనున్నారు. ప్రధానంగా మరుగుదొడ్లు, మేజర్, మైనర్‌ రిపేర్స్, రన్నింగ్‌ వాటర్, ఆర్వో ప్లాంట్లు, డ్రింకింగ్‌ వాటర్, ఎలక్ట్రికల్‌ పనులు, ఫ్యాన్లు, లైట్లు, కుర్చీలు, బెంచీలు, టేబుల్స్, గ్రీన్‌ చాక్‌బోర్డు, పెయింటింగ్, కాంపౌండ్‌ వాల్‌ తదితర వసతులను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి సమగ్ర శిక్ష ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు కళాశాలల్లో మౌలిక వసతులు పరిశీలించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కళాశాల డెవలప్‌మెంట్‌ కమిటీ ప్రతిపాదనల మేరకు తీర్మానాలు చేశారు. వీటికి కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు ఆమోదముద్ర వేశారు.  

డిసెంబరు నాటికి పూర్తి 
ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో నాడు–నేడు పనులను ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. పనులను బట్టి విడతల వారీగా నిధులను విడుదల చేయనున్నారు. వారం రోజుల్లో తొలుత ఆయా కళాశాలలకు 15 శాతం నిధులు విడుదల చేయనున్నారు. పనులు ఆయా కళాశాల డెవలప్‌మెంట్‌ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించాల్సి ఉంటుంది. నాడు–నేడు పనులు పూర్తతే కళాశాలలు సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకోనున్నాయి.  
– ఎ. శ్రీనివాసులు, డీవీఈఓ 

22 కళాశాలల ఎంపిక
జిల్లాలో మొత్తం 26 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. వీటితో పాటు మరో 4 ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. ఆయా కళాశాలల్లో ఫస్టియర్, సెకండియర్‌ కలిపి మొత్తం 25 వేల మందికి పైగా విద్యార్థులు ఇంటరీ్మడియట్‌ చదువుతున్నారు. ప్రస్తుతం నాడు–నేడుకు జిల్లాలో 22 జూనియర్‌ కళాశాలలు ఎంపిక చేశారు. వీటి అభివృద్ధికి రూ.13,44,95,539 ని«ధులు మంజూరు చేశారు. 
 

మరిన్ని వార్తలు