యుద్ధ ప్రాతిపదికన బొగ్గు సేకరణ

8 May, 2022 05:24 IST|Sakshi

సీఎం ఆదేశాలతో కదిలిన ఇంధన శాఖ 

ప్రస్తుతం రోజువారీ అవసరాలకే ఉన్న బొగ్గు

32 లక్షల టన్నుల కొనుగోలుకు టెండర్లు 

నెలలోగా ప్రక్రియ పూర్తి

సాక్షి, అమరావతి: భానుడి ఉగ్రరూపంతో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయి.  విద్యుత్‌కు విపరీతంగా డిమాండ్‌ ఏర్పడడంతో.. దేశంలోని అనేక రాష్ట్రాలు విద్యుదుత్పత్తిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇదే సమయంలో దేశవ్యాప్తంగానూ, అంతర్జాతీయంగానూ బొగ్గు సమస్య తీవ్రమై ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ ప్రభావం దిగుమతులపైనా పడింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్‌ ఉత్పత్తికి విఘాతం కలుగకుండా బొగ్గు నిల్వలు పెంచుకోవాలని ఇంధన శాఖను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. దీంతో దాదాపు 32 లక్షల టన్నుల బొగ్గును సమకూర్చుకోవడానికి అధికారులు కసరత్తు మొదలుపెట్టారు.

రికార్డు స్థాయిలో వినియోగం.. 
రాష్ట్ర్‌రంలో పీక్‌ డిమాండ్‌ రికార్డులు సృష్టిస్తోంది. ఏప్రిల్‌ 8న అత్యధికంగా రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ 12,293 మెగావాట్లకు చేరింది. ఇది రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక డిమాండ్‌. ఈ నెల ప్రారంభంలో దాదాపు 11,767 మెగావాట్లుగా ఉన్న డిమాండ్‌ ప్రస్తుతం 9,711 మెగావాట్లుగా ఉంది. ఇక రోజువారీ విద్యుత్‌ డిమాండ్‌కు తగ్గట్టుగా 200 మిలియన్‌ యూనిట్లను విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు సరఫరా చేస్తున్నాయి. దీనిలో బుధవారం రూ.56.75 కోట్లతో 40.32 మిలియన్‌ యూనిట్లను బహిరంగ మార్కెట్‌నుంచి యూనిట్‌ రూ.14.07 చొప్పున కొనుగోలు చేశారు. 

నెలలోపే టెండర్లు ఖరారు..
కొరతను అధిగమించేందుకు బొగ్గును దిగుమతి చేసుకోవటానికి అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఏపీ జెన్‌కోను ఆదేశించింది. దీంతో కృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లో 800 మెగావాట్ల ఉత్పత్తిని పెంచడానికి ఏపీ పవర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ లక్ష టన్నుల దిగుమతి చేసుకున్న మెరుగైన గ్రేడ్‌ బొగ్గు కోసం టెండర్లు పిలిచింది. అదే విధంగా ఏపీజెన్‌కో 18 లక్షల టన్నుల కోసం, ఏపీ పవర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీపీడీసీఎల్‌) 13 లక్షల టన్నుల కోసం తాజాగా టెండర్లు ఆహ్వానించాయి. ఈ మొత్తం టెండర్ల ప్రక్రియను నెల రోజుల్లోపే పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.

ఎక్కడా దొరకని బొగ్గు, విద్యుత్‌..
థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో బొగ్గు కొరత తీవ్రంగా ఉంది. విజయవాడ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (వీటీపీఎస్‌)లో 0.83 రోజులు, రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ (ఆర్‌టీపీపీ)లో 2.10 రోజులు, కృష్ణపట్నంలో 6.02 రోజులు, హిందుజాలో 4.24 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మన రాష్ట్రంలో బొగ్గు క్షేత్రాలు లేకపోవడంతో మహానది కోల్‌ ఫీల్డ్స్, సింగరేణి కాలరీస్‌పై ఆధారపడాల్సి వస్తున్నది. అక్కడి నుంచి కూడా తగినంత బొగ్గు సరఫరా జరగడం లేదు.

ఈ నేపథ్యంలో అవసరమైన బొగ్గును అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. మరోవైపు విద్యుత్‌ ఎక్సే్ఛంజీల్లోనూ కరెంటు పరిమితంగానే దొరుకుతోంది.  కొనుగోలు వ్యయం గత పదేళ్లలో లేనంతగా రికార్డు స్థాయికి చేరుకుంది. యూనిట్‌ రూ.12 నుంచి 16 వరకు పలుకుతోంది. పీక్‌ అవర్స్‌లో రూ.20కి కూడా కొనాల్సి వస్తోంది. 

మరిన్ని వార్తలు