కోవిడ్‌ వైద్య సేవలకు.. 11,200 మంది నియామకం

8 Aug, 2020 04:00 IST|Sakshi

రాష్ట్రవ్యాప్తంగా కరోనా ఆసుపత్రుల్లో 37,189 బెడ్లు ఉన్నాయి

చికిత్స పొందుతున్న వారి సంఖ్య 16,404

ఆక్సిజన్, వెంటిలేటర్‌తో చికిత్స పొందుతున్న వారు 4,965 మంది

మరణాల రేటు దేశంలో 2.07 శాతం.. ఏపీలో 0.89 శాతమే        

కోవిడ్‌–19 నివారణ చర్యలపై సీఎం జగన్‌ సమీక్షలో అధికారుల వెల్లడి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కోవిడ్‌ ఆస్పత్రుల్లో వైద్యం, ఇతర సంబంధిత సేవల కోసం 11,200 మంది సిబ్బందిని నియమిస్తున్నామని సీఎం వైఎస్‌ జగన్‌కు అధికారులు తెలిపారు. కరోనా నివారణపై క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సీఎం సమక్షంలో జరిగిన సమీక్షలో అధికారులు వెల్లడించిన అంశాలిలా ఉన్నాయి.

► కోవిడ్‌ నివారణ చర్యలను అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తున్నాం. పెద్ద సంఖ్యలో పరీక్షలు చేస్తున్నాం. పాజిటివ్‌గా వచ్చిన కేసులను ప్రకటిస్తున్నాం.
► పారదర్శకత అనేది కోవిడ్‌ నివారణ  చర్యల్లో అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నాం.
► రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్‌ ఆసుపత్రుల్లో 37,189 బెడ్లు అందుబాటులో ఉన్నాయి.
► ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 16,404. ఆక్సిజన్, వెంటిలేటర్‌ తరహా చికిత్స పొందుతున్న వారు 4,965 మంది.
► మరణాల రేటు దేశంలో 2.07 శాతం ఉంటే అదే ఏపీలో 0.89 శాతమే. అదే కర్ణాటకలో 1.85 శాతం, తమిళనాడులో 1.63, మహారాష్ట్రలో 3.52 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా పాజిటివిటీ రేటు 8.87 శాతంగా ఉంటే రాష్ట్రంలో 8.56, కర్ణాటకలో 9.88, తమిళనాడులో 9.26, మహారాష్ట్రలో 19.36, ఢిల్లీలో 12.75 శాతంగా ఉంది.
► ప్రతి 10లక్షల జనాభాకు 43,059 మందికి పరీక్షలు చేస్తున్నాం. శ్రీకాకుళం, కర్నూలు, కడప, కృష్ణా, నెల్లూరు, పశ్చిమ గోదావరి, చిత్తూరులో రాష్ట్ర సగటు కన్నా ఎక్కువ పరీక్షలు నిర్వహిస్తున్నాం. 

మరిన్ని వార్తలు