గోల్డెన్‌ అవర్‌లో ఆస్పత్రిలో చేరిస్తే...

23 Jan, 2021 17:53 IST|Sakshi

రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత వైద్యం

గోల్డెన్‌ అవర్‌లో ఆస్పత్రిలో చేరిస్తే ఒక్కొక్కరికి రూ.1.5 లక్షల వరకు వర్తింపు

అంతకుమించితే రూ.5 లక్షల వరకు ఆయుష్మాన్‌ భారత్‌ కింద ఉచిత చికిత్స

22 వేల రిఫరల్‌ ఆస్పత్రుల గుర్తింపు

సాక్షి, అమరావతి: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గోల్డెన్‌ అవర్‌లో (గంటలోపు) ఆస్పత్రిలో చేరిన బాధితులకు నగదు రహిత వైద్యం అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు త్వరలో ఓ పథకాన్ని అమలు చేయనున్నాయి. ఇందుకోసం సూచనలు, సలహాలు అందించాలని కేంద్రం.. రాష్ట్రాల రవాణా శాఖలకు గతేడాది డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ పంపింది. రెండురోజుల కిందట ఢిల్లీలో జరిగిన ట్రాన్స్‌పోర్టు డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (టీడీసీ) సమావేశంలో కేంద్ర ప్రభుత్వ రోడ్డు రవాణా, జాతీయ రహదారులశాఖ ఈ పథకంపై రాష్ట్రాలకు దిశానిర్దేశం చేసింది. రోడ్డు ప్రమాదం జరిగిన గంటలోపు బాధితులను ఆస్పత్రిలో చేరిస్తే ప్రాణాపాయం తప్పుతుంది. ఆస్పత్రిలో చేర్చడం ఆలస్యం కారణంగా ఏటా వేలాదిమంది ప్రాణాలు పోతున్నాయి. రోడ్డు ప్రమాద బాధితులకు గోల్డెన్‌ అవర్‌లో నగదు రహిత వైద్యం అందించాలన్న మోటారు వాహన చట్టం సెక్షన్‌ 162 (2)ను కేంద్రం అమలు చేయనుంది. ఈ చట్టంలోని సెక్షన్‌ 164 బీ ప్రకారం యాక్సిడెంట్‌ ఫండ్‌ను ఏర్పాటు చేయనుంది. హిట్‌ అండ్‌ రన్‌ కేసుల్లో బాధితులు ఈ పథకం ద్వారా సెక్షన్‌ 163 కింద లబ్ధి పొందవచ్చు.

పరిహారనిధి ఏర్పాటు
బీమా వాహనాలకు, బీమా లేని వాహనాలకు, హిట్‌ అండ్‌ రన్‌ యాక్సిడెంట్లకు పరిహారనిధి (కాంపన్సేషన్‌ ఫండ్‌) ఏర్పాటు చేస్తారు. బీమా వాహనాలు ప్రమాదానికి కారణమైతే నగదు రహిత వైద్యం అందించేందుకు అన్ని బీమా కంపెనీలు కనిష్టనిధి అందించాలి. బీమా లేని వాహనాలైతే నేషనల్‌ హైవే ఫీజు కింద కేంద్రం సెస్‌ వసూలు చేసిన సొమ్ములో కేటాయించాలి. హిట్‌ అండ్‌ రన్‌ పరిహారనిధిని సొలాషియం స్కీం కింద జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తుంది. థర్డ్‌ పార్టీ ప్రీమియం వసూలు చేసే బీమా కంపెనీలు తమ వ్యాపారంలో 0.1 శాతం సొమ్ము కేటాయించాలి. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గోల్డెన్‌ అవర్‌లో ఆస్పత్రిలో చేరితే రూ.1.50 లక్షల వరకు నగదు రహిత వైద్యం అందించవచ్చు. చికిత్స వ్యయం రూ.1.50 లక్షల కంటే ఎక్కువైతే రూ.5 లక్షల వరకు ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన కింద కేంద్రం నగదు రహిత వైద్యం ఖర్చు భరిస్తుంది. ఈ పథకానికి నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరించే నేషనల్‌ హెల్త్‌ అథారిటీ (ఎన్‌హెచ్‌ఏ) దేశ వ్యాప్తంగా 22 వేల ఆస్పత్రులను రిఫరల్‌ ఆస్పత్రులుగా గుర్తించింది. ఈ పథకం కింద ఏ ఆస్పత్రి అయినా దరఖాస్తు చేసుకునేందుకు కేంద్రం అవకాశం కల్పించింది. కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి అందించే యాక్సిడెంట్‌ ఫండ్‌ను జనరల్‌ ఇన్సూరెన్స్‌ కౌన్సిల్‌ నుంచి కొంత సమకూరుస్తుంది.

స్టేట్‌ హెల్త్‌ ఏజెన్సీకి భాగస్వామ్యం
మినిస్ట్రీ ఆఫ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్టు అండ్‌ హైవేస్‌ (మోర్త్‌)కు పలు సూచనలను గతంలోనే పంపినట్లు టీడీసీ సమావేశంలో ఏపీ రవాణా శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్టేట్‌ హెల్త్‌ ఏజెన్సీని కూడా భాగస్వామ్యం చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో రోడ్‌ సేఫ్టీ కమిటీకి అనుబంధంగా రవాణా శాఖ, పోలీస్, వైద్యశాఖల అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.  

చదవండి: 
7 సార్లు చక్కర్లు కొట్టి వెనుదిరిగిన విమానం

69 పట్టణాల్లో 54,056 ఇళ్లు.. రూ.392.23 కోట్లు ఆదా

మరిన్ని వార్తలు